స్పామ్‌ కాల్స్‌ చేసే నంబర్లపై ఏఐ నిఘా

రోజూ మన మొబైల్‌కు లోన్లు, క్రెడిట్‌ కార్డులు, ఇన్సూరెన్స్‌, ఆఫర్లు అంటూ పదేపదే ఫోన్‌ చేసే నంబర్లు కొన్నిసార్లు విసిగిస్తుంటాయి. ఇప్పటివరకు ఇలాంటి నంబర్లపై వినియోగదారులు ఫిర్యాదు చేస్తేనే ఎక్కువగా చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. ఇకపై వినియోగదారులు ఫిర్యాదు చేయకపోయినా ఏఐ టెక్నాలజీ ద్వారా స్పామ్‌గా గుర్తించిన నంబర్లపై టెలికాం కంపెనీలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ట్రాయ్‌ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

టెలికాం కంపెనీలు ఇప్పటికే ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి అనుమానాస్పద కాల్స్‌, మెసేజ్‌లను గుర్తిస్తున్నాయి. ఇప్పుడు ఆ టెక్నాలజీ ద్వారా ఒక నంబర్‌ స్పామ్‌ చేస్తున్నట్లు గుర్తిస్తే వినియోగదారుల ఫిర్యాదు కోసం ఎదురుచూడకుండా ఆ నంబర్‌కు సంబంధించిన వివరాలను పరిశీలించి చర్యలు తీసుకునేలా ట్రాయ్‌ నిబంధనలు మార్చింది.

ఒక వ్యక్తి లేదా సంస్థకు చెందిన అనేక నంబర్ల నుంచి వరుసగా అనుమానాస్పద కాల్స్‌ వస్తుంటే అలాంటి కాల్స్‌ నమూనాలను ఏఐ వ్యవస్థలు పరిశీలిస్తాయి. వాటి ఆధారంగా ఒక నంబర్‌ లేదా పంపేవారిని స్పామ్‌గా అనుమానిస్తే ఆ సమాచారాన్ని టెలికాం కంపెనీలు పరస్పరం పంచుకుంటాయి. ఆ తర్వాత ఆ వ్యక్తి లేదా సంస్థకు గతంలో మరిన్ని నంబర్లు ఉన్నాయా? వాటి నుంచి కూడా స్పామ్‌ కాల్స్‌ వెళ్లాయా? అన్నది పరిశీలిస్తారు.

ఒకే వ్యక్తి లేదా సంస్థకు చెందిన గత 10 రోజుల్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ నంబర్లు స్పామ్‌గా గుర్తిస్తే, ఆ పంపేవారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే తన నంబర్‌ ఎందుకు స్పామ్‌గా గుర్తించారో వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది.   ఏఐ ఆధారంగా ఒక పంపేవారు మొదటిసారి స్పామ్‌ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే వారికి సంబంధించిన టెలికాం నంబర్ల నుంచి అవుట్‌గోయింగ్‌ సేవలను 15 రోజుల పాటు నిలిపివేస్తారు. 

స్పామ్‌ కాల్‌ చేయడానికి ఉపయోగించిన నంబర్‌ ఒక్కటినే కాకుండా, అదే పంపేవారికి కేటాయించిన ఇతర టెలికాం వనరులపైనా చర్యలు ఉండొచ్చు.మొదటిసారి చర్య తీసుకున్న తర్వాత కూడా అదే విధంగా స్పామ్‌ కార్యకలాపాలు కొనసాగిస్తే నిబంధనలు మరింత కఠినంగా మారతాయి. అంతేకాకుండా ఆ పంపేవారిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చుస్తారు. 

ట్రాయ్‌ తెలిపిన గణాంకాల ప్రకారం 2026 ఏప్రిల్‌లో టెలికాం కంపెనీల ఏఐ వ్యవస్థలు సుమారు 771 కోట్ల కాల్స్‌, 48 కోట్ల ఎస్ఎంఎస్ లను అనుమానిత స్పామ్‌గా గుర్తించాయి. ఇంత పెద్ద సంఖ్యలో స్పామ్‌ కమ్యూనికేషన్లు గుర్తించబడుతున్నప్పటికీ వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్య అంత స్థాయిలో ఉండటం లేదు. అందుకే కేవలం ఫిర్యాదులపై ఆధారపడకుండా ఏఐ ద్వారా ముందుగానే స్పామ్‌ను గుర్తించి చర్యలు తీసుకోవాలని ట్రాయ్‌ నిర్ణయించింది.

About The Author