* దేవుళ్ళ మధ్య విభజనతో రేవంత్ రెడ్డి పెను రాజకీయ దుమారం
బీజేపీని ఉద్దేశించి “శివుడు పేదల దేవుడు, రాముడు ధనికుల దేవుడు” అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి.ఉత్తర భారతదేశంలో బీజేపీ ఎన్నికల విజయాలకు కారణం ఆ పార్టీ ‘శ్రీరాముడిని తన సొంతం చేసుకోవడమే’ (లేదా ‘రాముడిని కాజేయడమే’) అని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాదిలో రాముడిని గౌరవిస్తారని, దక్షిణాదిలో శివుడిని పూజిస్తారని ఆయన తెలిపారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య విభజన సృష్టించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, బీజేపీ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. హిందూ సమాజంలో దేవుళ్ళ మధ్య సైతం వర్గపోరాటాన్ని సృష్టించేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై రాజకీయ దుమారం చెలరేగింది.
సోమవారం ఢిల్లీలో అస్సాం దినపత్రిక ప్రతిదిన్ కాంక్లేవ్‌లో ఇండియాస్ నెక్స్ చాఫ్టర్ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూఇలా చెప్పారు: “మేము ద్రావిడులం. ఇక్కడి (ఉత్తరాది) ప్రజలు ఆర్యులు. మేము శివ భక్తులం. వారు శ్రీరామ భక్తులు. బీజేపీ రాముడిని తన వైపునకు తిప్పుకుంది. అది ఒక భావోద్వేగం, ఒక సెంటిమెంట్. మోదీ గారు ‘హర్ హర్ మహాదేవ్’ అని ఎందుకు అనరు? బీజేపీ నాయకులు ఎప్పుడైనా వేదికపై ‘హర్ హర్ మహాదేవ్’ అని అన్నారా? వారు కేవలం ‘జై శ్రీరామ్’ అని మాత్రమే అంటారు. మేము ‘హర్ హర్ మహాదేవ్’ అని అంటే వారికి నచ్చదు.”
“శివుడు పేదల దేవుడు, రాముడు ధనికుల దేవుడు, అలాగే బీజేపీ ధనికుల పార్టీ,” అని రేవంత్ రెడ్డి మరింతగా పేర్కొన్నారు. దేశంలోని ఉత్తర, తూర్పు, పశ్చిమ ప్రాంతాల కంటే దక్షిణాదిలో కాంగ్రెస్ ఎందుకు ప్రజాదరణ కలిగి ఉందన్న ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో జరిగిన ‘సైమన్ గో బ్యాక్’ ఉద్యమం తరహాలోనే, ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (ఎస్ఐఆర్) ప్రక్రియకు వ్యతిరేకంగా దేశంలో మరో ఉద్యమం వచ్చే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
‘ఎస్ఐఆర్ గో బ్యాక్’ పోరాటాన్ని నిర్వహించడానికి మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, ఎం.కె. స్టాలిన్ వంటి ప్రతిపక్ష నాయకులు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ అనేది “ఓట్లను తొలగించడానికి, బీజేపీకి లబ్ధి చేకూర్చడానికి” ఉద్దేశించినదని ఆయన ఆరోపించారు. అలాగే, కేంద్రంలో రక్షణ, హోం, వాణిజ్యం వంటి కీలక శాఖలు “ఉత్తరాది నాయకుల” చేతుల్లోనే ఉన్నాయని విమర్శిస్తూ బీజేపీపై మండిపడ్డారు.
మరోవైపు, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.ఎక్స్ లో పెట్టిన ఒక పోస్టులో, ‘ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం’ అని గతంలో చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు శ్రీరాముడికి, శివుడికి మధ్య రాజకీయ సరిహద్దులు గీస్తున్నారని మండిపడ్డారు.
“వేములవాడలో దక్షిణ కాశీ, భద్రాచలంలో దక్షిణ అయోధ్య ఉన్న తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండి, శ్రీరాముడిని, శివుడిని ఉత్తర, దక్షిణ అని విభజించకూడదని రేవంత్ రెడ్డికి తెలిసి ఉండాలి,” అని ఆయన ధ్వజమెత్తారు. “శివుడు హాలాహలం తాగి నీలకంఠుడయ్యాడు. ఈ రోజు కాంగ్రెస్ తన సొంత హాలాహలాన్ని సిద్ధం చేస్తోంది: కులానికి కులానికి, ఉత్తరానికి దక్షిణానికి, ఇప్పుడు శివుడికి రాముడికి మధ్య,” అని ఆయన ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో వారణాసికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, కాశీ విశ్వనాథుడు వారణాసికి ఆధ్యాత్మిక కేంద్రమని ఆ కేంద్ర సహాయ మంత్రి గుర్తు చేశారు.“స్వాతంత్ర్యం తర్వాత వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామిని, అంటే శివుడిని సందర్శించిన మొదటి ప్రధాని మోదీజీ,” అని ఆయన పేర్కొన్నారు.
“శివుని హృదయంలో విష్ణువు, విష్ణువు హృదయంలో శివుడు ఉన్నారు. అదే సనాతన ధర్మం. బీజేపీ నాయకులు ఎప్పుడైనా ‘హర హర మహాదేవ్’ అంటారా? అని మీరు అడిగితే, ఇక్కడ గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ స్వయంగా ఆ మాట అంటున్నారు. అందుకే హిందువులు కాంగ్రెస్ విభజన రాజకీయాలను గుర్తించాలి. హర హర మహాదేవ్. జై శ్రీ రామ్,” అని ఆయన చెప్పారు.
కాగా, దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ ‘విభజించి పాలించు’ విధానంపైనే ఆధారపడి మనుగడ సాగిస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు కులం, ప్రాంతం, మతం ప్రాతిపదికన మన మాతృభూమిని, ప్రజలను విభజించారని, ఇప్పుడు మన దేవుళ్లను కూడా విభజించాలని చూస్తున్నారని మండిపడ్డారు. “సిగ్గుచేటు! హిందువులను విభజించి ముస్లింలను ఏకం చేయడం—సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హిందువుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న దశాబ్దాల నాటి తీవ్ర ద్వేషాన్ని ప్రతిబింబిస్తున్నాయి” అని విమర్శించారు.
రేవంత్ రెడ్డి దేవుళ్ల పై చేసిన వ్యాఖ్యలు హిందూ ధర్మానికి అవమానం అని పేర్కొంటూ గతంలో కూడా తాగేవాళ్ల కు ఒక దేవుడు అని అవమాన కరం గా మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. ఖైరతా బాద్ ఎన్నికల దృష్టి తో ముస్లింల ఓటు బ్యాంకు కోసం చేస్తున్న వ్యాఖ్యలు అని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని బిజెపి కార్యకర్తలకు రాంచందర్ రావు పిలుపిచ్చారు.
More Stories
అమెరికాలో అతిపెద్ద ఉక్కు కర్మాగారాన్ని నిర్మించనున్న ఎస్సార్ గ్రూప్
తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు ప్రారంభం
రాష్ట్ర హోదా కోరిన కాశ్మీర్ అసెంబ్లీ.. బీజేపీ సభ్యుల వాకౌట్