మూడు రోజుల బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా

దేశవ్యాప్తంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటు (సెప్టెంబర్‌ 28-30) నిర్వహించాల్సిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె చివరి నిమిషాల్లో వాయిదా పడింది. ఆదివారం రాత్రి ఈ విషయాన్ని యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) ప్రకటించింది. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌(ఐబీఏ-బ్యాంకుల యాజమాన్యాల ప్రతినిధి సంస్థ)తో జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. 
 
దీంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల శాఖలు యాథావిధిగా పనిచేయనున్నాయి. వారంలో ఐదు రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని, మరికొన్ని కీలక డిమాండ్లతో యూఎఫ్‌బీయూ మూడు రోజుల సమ్మెను తలపెట్టింది. ఉద్యోగులపై పని భారం అధికంగా ఉన్నందున వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకే పనిదినాలు ఉండాలని బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు.
 
ప్రస్తుతం ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకు ఉద్యోగులకు సెలవులుగా ఉన్నాయి. అదే మాదిరి మిగిలిన అన్ని శనివారాలను సెలవుగా ప్రకటించడంపై చర్చించేందుకు ఐబీఏ, యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు యూఎఫ్‌బీయూ ప్రకటించింది.
 
‘‘ఈ కమిటీ అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తుంది. భాగస్వాములు అందరితో చర్చించి కస్టమర్లు సహా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని గుర్తిస్తుంది’’అని యూఎఫ్‌బీయూ తన ప్రకటనలో పేర్కొంది. స్కేల్‌ 4, అంతకుమించిన అధికారులకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకానికి (పీఎల్‌ఐ) సంబంధించి పథకంలోనూ సవరణలపై ఐబీఏతో చర్చలు ప్రారంభిస్తామని తెలిపింది. 
 
మిగిలిన పెండింగ్‌ అంశాలపైనా ఇరువర్గాలు సత్వర పరిష్కారం కోసం చర్చిస్తాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత సమ్మెను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. పని గంటలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ, అన్ని శనివారాలు సెలవు ఇవ్వాలని ఒత్తిడి చేసేందుకే యూఎఫ్‌బీయూ  ప్రధానంగా మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. ఐదు రోజుల బ్యాంకింగ్ వారంపై రెండేళ్లకు పైగా చర్చలు జరుగుతున్నాయని ఆ సంస్థ చెబుతోంది.
ఈ మార్పుకు అంగీకరించలేదని, గతంలో జరిగిన వేతన చర్చల్లో దీనిని చేర్చలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.  గత చర్చలు వివాదాన్ని పరిష్కరించడంలో విఫలమవడంతో యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. తమ డిమాండ్లు నెరవేరకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని కూడా వారు ప్రతిపాదించారు. ఆదివారం జారీ చేసిన సర్క్యులర్ ప్రణాళికాబద్ధమైన ఆందోళనను వాయిదా వేసింది కానీ కొత్త సమ్మె తేదీని వెల్లడించలేదు. 

 
కాగా, సోమవారం నుంచి మూడు రోజుల సమ్మె సేవలకు అంతరాయం కలిగించవచ్చని, ముఖ్యంగా అది అర్ధవార్షిక ముగింపు తేదీని కవర్ చేస్తున్నందున ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంతకు ముందు హెచ్చరించింది.  వినియోగదారులకు బ్రాంచ్ లావాదేవీల కోసం అదనపు రోజు ఇచ్చేందుకు  బ్యాంకులను ఆదివారం కూడా తెరిచి ఉంచాలని కోరారు. 

About The Author