ఇప్పటివరకు టెలికాం సంస్థలు అందించే పలు రీచార్జ్ ప్లాన్లలో డేటా, కాల్స్, ఎస్ఎంఎస్ సేవలు కలిపి ఉండేవి. అయితే డేటా అవసరం లేని వినియోగదారులు కూడా తప్పనిసరిగా డేటాతో కూడిన ప్లాన్లను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ముఖ్యంగా రెండో సిమ్ వినియోగించేవారు, ఫీచర్ ఫోన్లు ఉపయోగించేవారు, ఇంటర్నెట్ కోసం వైఫైపై ఆధారపడేవారికి ఇది అదనపు ఖర్చుగా మారేది. తాజా నిబంధనలతో ఇలాంటి వినియోగదారులకు తమ అవసరానికి అనుగుణంగా రీచార్జ్ చేసుకునే అవకాశం కలగనుంది.
కొత్త నిబంధనల్లో నెలవారీ రీచార్జ్‌లకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ఒక నెలలో ఏ తేదీన రీచార్జ్ చేసుకుంటే తదుపరి నెలల్లోనూ అదే తేదీన రీచార్జ్ చేసుకునే అవకాశం ఉండాలి. అయితే ఒక నెలలో ఆ తేదీ లేకపోతే ఆ నెలలోని చివరి తేదీని పరిగణనలోకి తీసుకునే విధంగా నిబంధనలు రూపొందించారు. డేటా వినియోగం తక్కువగా ఉన్నవారికి ఈ ప్లాన్లు ఉపయోగపడనున్నాయి.
ఫీచర్ ఫోన్లు ఉపయోగించేవారు, రెండో సిమ్‌ను కేవలం కాల్స్ కోసం వినియోగించేవారు, ఇంటర్నెట్ కోసం వైఫైపై ఆధారపడేవారు వీటిని ఎంచుకోవచ్చు. అవసరం లేని డేటా కోసం అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి తగ్గుతుంది. తమ అవసరానికి సరిపోయే రీచార్జ్‌ను ఎంచుకునే అవకాశం వినియోగదారులకు లభిస్తుంది. కేవలం 30 రోజులు లేదా అంతకంటే తక్కువ వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లకే పరిమితం కాకుండా 30 రోజుల కంటే ఎక్కువ వ్యాలిడిటీ కలిగిన కనీసం ఒక వాయిస్–ఎస్ఎంఎస్ ప్లాన్‌ను కూడా టెలికాం సంస్థలు అందించాల్సి ఉంటుంది.
దీంతో వినియోగదారులకు స్వల్పకాలిక, నెలవారీ, దీర్ఘకాలిక ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి. ట్రాయ్ తాజా ఆదేశాలు ప్రధాన టెలికాం ఆపరేటర్లైన భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా (వీఐ) కు వర్తించనున్నాయి. కొత్త నిబంధనలను అమలు చేసేందుకు టెలికాం సంస్థలకు 2026 అక్టోబర్ 21 వరకు గడువు ఉన్నట్లు సమాచారం. వాయిస్, ఎస్ఎంఎస్ సేవలను మాత్రమే కోరుకునే వినియోగదారుల కోసం ప్రత్యేక ప్లాన్లను అందించాలని ట్రాయ్ గతంలోనే ఆదేశించింది.
అయితే తక్కువ వ్యాలిడిటీతో ఇలాంటి ప్లాన్లకు పరిమిత ఆప్షన్లు ఉన్నట్లు గుర్తించింది. దీంతో తాజా సవరణల ద్వారా వినియోగదారులకు మరింత వెసులుబాటు కల్పించేలా నిబంధనలను మార్చింది.

More Stories
మూడు రోజుల బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా
వంట నూనెల ధరలు తగ్గించాలని కేంద్రం ఆదేశాలు!
ఎండీఆర్ అంటే సెస్, పన్ను కాదు.. ప్రజలపై భారం ఉండదు