బంగ్లాదేశ్‌లో హిందూ నగల వ్యాపారి దారుణ హత్య

బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. మైమన్‌సింగ్‌ జిల్లాలోని బెగున్‌బరి ప్రాంతంలో కాలువ తూము గేటు సమీపంలో నీటిపై తేలుతున్న ప్లాస్టిక్‌ డ్రమ్ములో ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడిని 50 ఏళ్ల నిరంజన్‌ చంద్ర సూత్రధార్‌గా గుర్తించారు.  ఆయన మైమన్‌సింగ్‌ పట్టణంలోని అథర్‌బరి బిల్డింగ్‌ ప్రాంతంలో మరో వ్యక్తితో కలిసి నగల దుకాణం నిర్వహించేవారు.
నీటిలో డ్రమ్ము తేలుతుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని డ్రమ్మును బయటకు తీసి పరిశీలించగా అందులో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు.  మృతదేహంపై తల, ఛాతి ప్రాంతాల్లో పదునైన ఆయుధంతో దాడి చేసినట్లుగా కనిపించే గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ గాయాల ఆధారంగా నిరంజన్‌ను ముందుగా హత్య చేసి ఉండవచ్చని, అనంతరం మృతదేహాన్ని ప్లాస్టిక్‌ డ్రమ్ములో పెట్టి నీటిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ ఘటనకు పాల్పడింది ఎవరు? హత్యకు అసలు కారణం ఏమిటి? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు.  మృతుడి గుర్తింపు విషయంలో ఆయన జేబులో లభించిన ఓ టోకెన్‌ కీలకంగా మారింది. అది మైమన్‌సింగ్‌ హిందూ కోఆపరేటివ్‌ క్రెడిట్‌ యూనియన్‌ లిమిటెడ్‌ జారీ చేసిన టోకెన్‌గా పోలీసులు గుర్తించారు. దాని ఆధారంగా సంబంధిత సంస్థను సంప్రదించడంతో మృతుడు నిరంజన్‌ చంద్ర సూత్రధార్‌ అని గుర్తించారు.
తర్వాత పోలీసులు కుటుంబ సభ్యులను సంప్రదించగా ఆయన భార్య సుమితా రాణి సూత్రధార్‌, కుమారుడు జాయ్‌ సూత్రధార్‌ మృతదేహాన్ని పరిశీలించి నిరంజన్‌దేనని ధ్రువీకరించారు.  నిరంజన్‌ తన భార్య, కుమారుడితో కలిసి మైమన్‌సింగ్‌లోని స్టేడియం ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసించేవారు. ఈనెల 20వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. మరుసటి రోజు స్టేడియం ప్రాంతంలో ఆయన మేనల్లుడు చూసినట్లు సమాచారం.
గతంలోనూ నిరంజన్‌ కొన్నిసార్లు కొన్ని రోజుల పాటు ఇంటికి దూరంగా ఉండి తిరిగి వచ్చేవారని కుటుంబ సభ్యులు భావించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. 
దీంతో ఆయన కనిపించకుండా పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం. నిరంజన్‌ మృతదేహంపై గాయాలు ఉండటంతో హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు హత్యకు కారణం ఏమిటనేది నిర్ధారణ కాలేదు. నిందితులు ఎవరనేది కూడా తెలియలేదు.

ప్రస్తుతం మైమన్‌సింగ్‌ కోత్వాలి మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిరంజన్‌ చివరిసారిగా ఎక్కడికి వెళ్లారు? ఆయనతో ఎవరైనా సంప్రదింపులు జరిపారా? మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి నీటిలో పడేసింది ఎవరు? అనే అంశాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. మరోవైపు మృతుడి కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు తెలుసుకుంటున్నారు.

About The Author