ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం 


“మిస్టర్ రాహుల్ గాంధీ.. భారతీయ జనతా పార్టీ ఎన్నడూ ఓట్లను చోరీ చేయదు, దేశ ప్రజల మనసులను గెలుచుకుంటుంది. ఎన్నికల్లో గెలిస్తే తమ ఘనతగా చెప్పుకోవడం, ఓడిపోతే ఈవీఎంలు, ఎన్నికల సంఘంపై నిందలు వేయడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు, ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ప్రజలు ఛీత్కరించుకుంటున్నా కాంగ్రెస్ వైఖరిలో మార్పు రావడం లేదు” అంటూ  కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. 

ఎన్నికల సంఘం, రాజ్యాంగ వ్యవస్థలపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరాధార ఆరోపణలను కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చాలా బాగా పనిచేసినట్లు, కేరళలో కాంగ్రెస్ సీనియర్ నేత చెప్పినట్లు ఎస్ఐఆర్ ద్వారా దొంగ ఓట్లను తొలగిస్తే ఈసీ మంచిదైనట్లు ప్రచారం చేసుకున్నారని గుర్తుచేశారు. అదే ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే మాత్రం ఈవీఎంలు, ఎన్నికల సంఘం తప్పన్నట్లు మాట్లాడటం వారి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని ధ్వజమెత్తారు. 
 
కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌ది కాదని, రాహుల్ గాంధీని ప్రధాని చేయాల్సిన బాధ్యత ఈవీఎంలది కాదని స్పష్టం చేశారు. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు ఏమాత్రం లేదని ఆయన పేర్కొన్నారు. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించి, పత్రికా స్వేచ్ఛను హరించి, పౌర హక్కులను కాలరాసి, ప్రతిపక్ష నేతలను జైళ్లలో పెట్టి చీకటి రాజ్యాన్ని నడిపిన చరిత్ర కాంగ్రెస్‌దని నిలదీశారు. 
 
2009లో తమ మాట వినడం లేదని ఏకంగా రాజ్యాంగబద్ధ ఎన్నికల కమిషనర్లను తొలగించాలని రాష్ట్రపతికి సిఫారసు చేసిన చరిత్రను గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రజాస్వామ్యబద్ధంగా ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేయాలన్నా కోర్టులకు వెళ్లి అనుమతులు తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.  దేశ ప్రయోజనాల కోసం పని చేస్తున్న రాజ్యాంగ, భద్రతా వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు.
“రాహుల్ గాంధీ ఏ ఒక్క వ్యవస్థనూ వదిలిపెట్టడం లేదు. ఆర్మీ చీఫ్, ఎయిర్‌ఫోర్స్, సర్జికల్ స్ట్రైక్స్, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్, లోక్‌సభ స్పీకర్, సీజేఐ, ఈడీ, సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో, మీడియా హౌస్‌లతో పాటు చివరకు పార్లమెంట్, జీఎస్టీ వ్యవస్థలపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ విషప్రచారం చేస్తున్నారు” అంటూ మండిపడ్డారు.  విదేశీ వేదికల మీద దేశ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడటం ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనం అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తరు.
“ఈ దేశాన్ని తమ కుటుంబం మాత్రమే పాలించాలి, తమ తాత, నానమ్మ, తండ్రి ప్రధానులయ్యారు కాబట్టి నేనే ప్రధాని కావాలనే రాచరికపు భావజాలం, అహంకారం రాహుల్ గాంధీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఆర్థిక సంక్షోభం సృష్టించి, చివరకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి తీసుకొచ్చారని పేర్కొంటూ రాబోయే రోజుల్లో ఈ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ఎస్ఐఆర్ గురించి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లో సుప్రీంకోర్టు ఆదేశాలు, పర్యవేక్షణలోనే లక్షలాది అక్రమ ఓట్లను తొలగించడం జరుగుతోందని తెలిపారు. బెంగాల్‌లో చనిపోయిన 24 లక్షల మంది ఓట్లు, పర్మనెంట్‌గా వలస వెళ్లిన 19 లక్షల మంది ఓట్లు, చిరునామా లేని 12 లక్షల మంది ఓట్లు, దాదాపు 2 కోట్ల డూప్లికేట్ ఓట్లు తొలగిస్తే తప్పేముంది? అని ప్రశ్నించారు. 

 
తండ్రికి, పిల్లలకు మధ్య కేవలం 15 ఏళ్ల వయస్సు తేడా ఉన్నట్లు చూపించిన తప్పుడు రికార్డులను సవరిస్తే కాంగ్రెస్‌కు వచ్చిన ఇబ్బందేమిటి? అని నిలదీశారు. ఎన్నికల కమిషన్ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలపై స్పందిస్తూ దీనిపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.  

About The Author