ఐరాసలో హఫీజ్ సయీద్‌ పై ప్రశ్నలకు మొఖం చాటేసిన షెహబాజ్ షరీఫ్

81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, లష్కర్-ఎ-తైబా (ఎల్ఈటి) అధిపతి హఫీజ్ సయీద్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ముఖం చాటేశారు.  షరీఫ్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశిస్తుండగా, “ప్రధానమంత్రి గారూ, మీరు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఎప్పుడు ఆపుతారు?” అని విలేకరులు ప్రశ్నించారు. 
 
అయితే, పాకిస్తాన్ ప్రధానమంత్రి స్పందించలేదు. తర్వాత, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం నుండి బయలుదేరుతున్నప్పుడు, “లష్కర్-ఎ-తైబా అధిపతి హఫీజ్ సయీద్‌పై మీరు ఎప్పుడు విచారణ జరుపుతారు?” అని షరీఫ్‌ను మళ్లీ ప్రశ్నించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి మరోసారి సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు.  పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలోని సర్గాధా నివాసి అయిన హఫీజ్ మహమ్మద్ సయీద్, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 ప్రకారం ఉగ్రవాదిగా గుర్తించచారు. 
నిషేధిత ఉగ్రవాద ఎల్ఈటి వ్యవస్థాపకుడు. 26/11 ముంబై ఉగ్రదాడి కేసులో సయీద్ నిందితుడిగా వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. ఇటీవలే, 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని, నిషేధిత ఉగ్రవాద సంస్థ ఎల్ఈటికు చెందిన పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే కార్యకర్తలు ప్లాన్ చేశారని ఎన్ఐఏ కూడా ఆరోపించింది.  ఈ దాడి వెనుక ఉన్న పెద్ద కుట్రలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ, దాని అనుబంధ ఛార్జిషీట్‌లో ఉగ్రవాదిగా ప్రకటించిన హాఫిజ్ మహమ్మద్ సయీద్‌ను 8వ నిందితుడిగా పేర్కొంది.
ఒక రోజు ముందు, ఐక్యరాజ్యసమితిలో భారతదేశం పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శించింది.  ప్రాదేశిక ఆకాంక్షలను పెంచుకోవడం లేదా సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం కాకుండా, బెయిలౌట్‌లపై ఆధారపడి బతుకుతున్న అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టాలని ఇస్లామాబాద్‌కు సూచించింది.  ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో తన ప్రతిస్పందన హక్కును వినియోగించుకుంటూ, భారత దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి పాకిస్తాన్ దారి మళ్లించే ఎత్తుగడలను తిప్పికొట్టారు. దాని శత్రుపూరిత వైఖరి, విఫలమవుతున్న దాని ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి ఏమాత్రం ఉపయోగపడదని ఆయన స్పష్టం చేశారు.
పాకిస్తాన్ ప్రాధాన్యతలు ప్రాథమికంగా తప్పుగా ఉన్నాయని పేర్కొంటూ, క్షితిజ్ త్యాగీ ఇలా వ్యాఖ్యానించారు” “ఇతరుల భూభాగాలను ఆశించడం లేదా ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం కంటే, అభివృద్ధిపై దృష్టి సారించడం ద్వారా పాకిస్తాన్ తన ప్రజలకు మెరుగైన సేవ చేయగలదు. ఎందుకంటే, ఇవి గానీ, కౌన్సిల్‌లో దాని నాటకాలు గానీ, దాని ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉన్న రుణాలను తిరిగి చెల్లించడానికి సహాయపడవు.” 
 
పౌరులపై ఇస్లామాబాద్ అణచివేతను, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో నెలకొన్న తీవ్రమైన మానవతా సంక్షోభాలను ఎత్తిచూపుతూ, క్షితిజ్ త్యాగీ  అక్కడ విస్తృతమైన నిరసనలపై ప్రాణాంతకమైన ప్రభుత్వ హింసను, ఆహారం, ఇంధనం, మందులు వంటి నిత్యావసర వస్తువులపై దిగ్బంధనాలను ఆయన ప్రస్తావించారు. 

About The Author