అమెరికా–ఇజ్రాయెల్‌ సంబంధాల్లో పెరుగుతున్న దూరం!

అత్యంత సన్నిహిత మిత్రదేశాలుగా పేరొందిన అమెరికా–ఇజ్రాయెల్‌ సంబంధాల్లో దూరం పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.  ఐక్యరాజ్యసమితి  సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా వచ్చిన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ కాకుండానే స్వదేశానికి తిరిగి వెళ్లనుండటం ఈ సందర్భంగా పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.  

గతంలో అమెరికా పర్యటనలకు వచ్చినప్పుడు నెతన్యాహుకు ఘన స్వాగతం లభించేది.  ముఖ్యంగా గత ఏడాది ఆయన అమెరికాలో దాదాపు వారం రోజుల పాటు పర్యటించి, అప్పటి అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతున్న సంకేతాలు కనిపించాయి. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది.

ఐరాస జనరల్‌ అసెంబ్లీలో ప్రసంగించేందుకు న్యూయార్క్‌కు చేరుకున్న ఆయన ఎనిమిది గంటల కంటే తక్కువ సమయం మాత్రమే అక్కడ గడపనున్నట్లు ఇజ్రాయెల్‌ అధికారులు తెలిపారు. ఐరాస ప్రసంగం మినహా అమెరికా ప్రభుత్వంలోని కీలక అధికారులతో ఎలాంటి అధికారిక సమావేశాలు లేవని వెల్లడించారు. ఈ పరిణామం అమెరికా–ఇజ్రాయెల్‌ సంబంధాల్లో పెరుగుతున్న దూరానికి సంకేతమని కొందరు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పలేమని, పలు అంశాలపై దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయని మరికొందరు పేర్కొంటున్నారు. గాజాలో కొనసాగుతున్న యుద్ధం, అక్కడి మానవతా పరిస్థితులు, అంతర్జాతీయ స్థాయిలో ఇజ్రాయెల్‌పై వస్తున్న విమర్శలు అమెరికా–ఇజ్రాయెల్‌ సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి. గాజా అంశంలో ఇజ్రాయెల్‌ అనుసరిస్తున్న విధానంపై అమెరికాలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో ఇజ్రాయెల్‌కు బలమైన మద్దతు ఇచ్చిన ట్రంప్‌ యంత్రాంగం ప్రస్తుతం యుద్ధ పరిణామాలు, మధ్యప్రాచ్య దౌత్య పరిస్థితుల నేపథ్యంలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా విశ్లేషిస్తోంది. యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ ప్రసంగంలో నెతన్యాహు ప్రధానంగా ఇజ్రాయెల్‌ భద్రతా అంశాలు, గాజా యుద్ధంపై తమ వైఖరిని వివరించే అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌ చర్యలను సమర్థించడంతో పాటు అంతర్జాతీయ విమర్శలకు సమాధానం ఇచ్చేందుకు ఆయన ప్రయత్నించనున్నట్లు సమాచారం.

అమెరికా అధ్యక్షుడితో భేటీ లేకపోయినా నెతన్యాహు న్యూయార్క్‌ పర్యటనలో తొమ్మిది మంది ప్రపంచ నాయకులతో సమావేశం కానున్నట్లు సమాచారం. ముఖ్యంగా లాటిన్‌ అమెరికా దేశాల నేతలతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. 

నెతన్యాహు అర్జెంటీనా, బొలీవియా, పరాగ్వే, పనామా, ఇథియోపియా దేశాల అధ్యక్షులు; కొలంబియా ఉపాధ్యక్షుడు; అలాగే గ్రీస్, స్లోవేనియా, పాపువా న్యూ గినియా దేశాల ప్రధాన మంత్రులతో సమావేశం కానున్నారు. అనేక దేశాల నాయకులు తనను కలవాలని కోరుకున్నప్పటికీ, శుక్రవారం సాయంత్రం ‘సుక్కోట్’  పండుగ ప్రారంభానికి ముందే ఇజ్రాయెల్‌కు తిరిగి రావాల్సి ఉన్నందున వారందరినీ కలవడం సాధ్యం కాలేదని నెతన్యాహు కార్యాలయం తెలిపింది. 

About The Author