22ఏ భూముల వివాదంలో ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

22ఏ భూముల వివాదంలో ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

తెలంగాణ రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల జాబితా అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజుకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై తక్షణమే స్వతంత్ర విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాల విషయంలో తీసుకున్న చర్యలపై 4 వారాల్లో రిపోర్టు ఇవ్వాలని స్పష్టం చేసింది.  

ఈ చర్య వలన రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది అమాయక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం, అధికారులు అనాలోచితంగా తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయాల కారణంగా అమాయక ప్రజలు మానసికక్షోభకు అదేవిధంగా ఆర్థిక దోపిడీకి గురవుతూ కొంతమంది ఆత్మహత్యలకు దారితీస్తుందని, హైదరాబాద్‌కు చెందిన అడ్వకేట్ కరుపోతుల రేవంత్ ఎన్‌హెచ్‌ఆర్సీలో ఈనెల 14న ఫిర్యాదు చేశారు. 

దీనిపై సోమవారం విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సామాన్య అమాయక ప్రజల భూములను నిషేధిత జాబితాలో ఉంచడం వారి మానవ హక్కులకు భంగం కలిగించడమేనని ప్రస్తావిస్తూ ఆర్టికల్ 21, 14, 19(1)జీ , 300-ఏ రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు సమానత్వపు హక్కు, ఆస్తి హక్కులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ 22ఏ కారణంగా లక్షల మంది సామాన్య ప్రజల ఆస్తి హక్కును కాలరాయడమే అని ప్రస్తావించింది. 

కావున ఈ నిర్ణయంపై తక్షణమే స్వతంత్ర విచారణ చేపట్టి బాధితులకు ఉపశమనం కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సంజయ్ జాజుకు జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇట్టి నివేదికను నాలుగు వారాల్లోపు మరల మానవ హక్కుల కమిషన్‌కు సమర్పించాలని సంఘం తెలిపింది. 

22ఏ నిషేధిత భూములతోపాటు ఇతర భూసంబంధిత సమస్యల పరిష్కారం దిశగా ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉన్నత స్థాయి కమిటీకి సీసీఎల్‌ఏ కమిషనర్‌ లోకేశ్ కుమార్ను ఛైర్మన్‌గా నియామకం చేసింది.   నిషేధిత భూముల జాబితాలో ఇళ్లు, అపార్ట్‌మెంట్లను చేర్చడం హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివాదానికి దారితీసింది. 

ఈ ఆందోళనకు ప్రధాన కారణాలుగా న్యాయపరమైన వివాదాలు, కంప్యూటరైజేషన్ ప్రక్రియలో జరిగిన లోపాలను రెవెన్యూ అధికారులు గుర్తించారు. ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో చేర్చడంపై సుమారు చాలా మేరకు దరఖాస్తులు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ భూముల సర్వే నెంబర్లకు సమీపంలో ఉన్న భూములకు బైనంబర్లు ఉన్నాయని అధికారులు చెబుతుండగా, ఆ ఆస్తులు ప్రైవేట్ అని పేర్కొంటూ యజమానులు పెద్ద ఎత్తున కోర్టులను ఆశ్రయించారు. 

గత డిసెంబర్‌లో జిల్లా కలెక్టర్లు నిషేధిత భూముల జాబితాను ప్రభుత్వానికి సమర్పించినప్పుడు, ఆస్తులను ఏ,బి,సి,డి,ఈ అనే వర్గాలుగా విభజించారు.  అయితే కంప్యూటరైజేషన్ ప్రక్రియలో సంబంధిత సర్వే నంబర్ల ప్రస్తుత స్థితిని పర్యవేక్షించకుండా, సరిచూసుకోకుండానే రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్ నుంచి వివరాలను నేరుగా ఆన్లైన్లో అప్‌లోడ్ చేశారు. దీంతో అవి నిషేధిత జాబితాలోకి చేరాయి. 

వాటిని విక్రయించి రిజిస్ట్రేషన్ చేయాలనే దగ్గర 22ఏ సమస్య బయటపడింది. దీంతో చాలా మంది అయోమయంలో పడ్డారు. ఈ సమస్యపై స్పందించిన ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తామని వెల్లడిస్తూ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.