స్టార్ట‌ప్‌లే భార‌తదేశ‌పు యువ‌త స‌త్తాకు నిద‌ర్శ‌నం

స్టార్ట‌ప్‌లే భార‌తదేశ‌పు యువ‌త స‌త్తాకు నిద‌ర్శ‌నం
దేశ యువత సామర్థ్యానికి, వారి సత్తాకు దేశంలోని స్టార్టప్ పర్యావరణ వ్యవస్థే ఒక గొప్ప ఉదాహరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఒకప్పుడు కేవలం పెద్ద నగరాలకే పరిమితమైన స్టార్టప్‌ల కథ ఇప్పుడు చిన్న పట్టణాలకు, నగరాలకు కూడా విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. 20వ రోజ్‌గార్‌ మేళా సందర్భంగా శనివారం ఆయన వివిధ ప్రభుత్వ సంస్థలకు కొత్తగా ఎంపికైన యువతను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల నుంచి 51,000 మందికిపైగా యువతకు నియామక పత్రాలను పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారతదేశం నేడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా నిలిచిందని తెలిపారు. గుర్తించిన స్టార్టప్‌లలో దాదాపు సగం టైర్-2, టైర్-3 నగరాల్లోనే ఉన్నాయని చెప్పారు. ఇది భారతదేశ నూతన ఆర్థికవ్యవస్థలో గ్రామాలు, పట్టణాలు, చిన్న నగరాల నుంచి వచ్చిన యువత కూడా స్టార్ట‌ప్‌ల స్థాప‌న‌లో కీలకపాత్ర పోషిస్తున్నారని చూపిస్తోందని వివరించారు.
చిన్న పట్టణాలకు చెందిన యువత తమ సొంత ఆలోచనలతో కొత్త కంపెనీలను స్థాపిస్తూ తమతోపాటు ఇతర యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నారని ప్ర‌ధాని ప్రశంసించారు. ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలను వేగంగా విస్తరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. ఈ లక్ష్యంతోనే సుమారు రూ.1 లక్ష కోట్లతో ‘ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ను ప్రారంభించామ‌ని చెప్పారు.
ఈ పథకం ద్వారా దాదాపు 2 కోట్ల మంది యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి ప్రవేశించే అవకాశం లభిస్తుందని ప్రధాని తెలిపారు. మొదటిసారి ఉద్యోగంలో చేరేవారికి రూ.15,000 వరకు ప్రోత్సాహకం అందించడంతోపాటు కొత్త ఉద్యోగాలను సృష్టించే యాజమాన్యాలకు కూడా ప్రోత్సాహకాలు ఉంటాయని మోదీ తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థలో భాగం కాబోతున్న నూతన ఉద్యోగులకు తమ తల్లిదండ్రులు ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టాలు దేశంలోని ఏ పౌరుడూ ఎదుర్కోకుండా చూడటమే వారి లక్ష్యం కావాలని ప్ర‌ధాని హితవు చెప్పారు.  

నిరంతరం నేర్చుకోవడం, కొత్త నైపుణ్యాలు, టెక్నాలజీని అందిపుచ్చుకోవడం చాలా ముఖ్యమని ప్ర‌ధాని పేర్కొన్నారు. ఇందుకోసం ‘మిషన్ కర్మయోగి’ ని రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటికే 1.70 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు ‘ఇజిఓటికర్మయోగి’ ప్లాట్‌ఫామ్‌లో చేరారని, కొత్తగా చేరేవారి కోసం ‘కర్మయోగి ప్రారంభ్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని సిద్ధం చేశామని వివరించారు. మీరు మిమ్మల్ని ఎంతగా మెరుగుపరుచుకుంటే, దేశ పౌరులకు అంత మెరుగైన సేవలు అందించగలరని ప్రధాని చెప్పారు.

2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యం దిశగా భారత్ అడుగులు వేస్తోందని, ఇందులో యువత పాత్ర చాలా కీలకమని ప్రధాని మోదీ తెలిపారు. భారత్‌ వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) దేశ యువతకు కొత్త కెరీర్‌ అవకాశాలకు మార్గం సుగమం చేస్తున్నాయని చెప్పారు. కొత్త మార్కెట్లకు భారత వ్యాపారులు చేరుకోవడంతో పాటు, యువతకు ఉద్యోగాలు, నైపుణ్యాల ఆధారంగా కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.

 
భారత్‌ ఇప్పటివరకు వివిధ దేశాలతో 40 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని ప్రధాని మోదీ తెలిపారు. వీటి ద్వారా భారత వ్యాపారులకు కొత్త భాగస్వామ్యాలు, కొత్త మార్కెట్లు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. అదే సమయంలో యువతకు కెరీర్‌లో కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయని పేర్కొన్నారు. భారత యువత నైపుణ్యాలు, ప్రతిభపై ప్రపంచ దేశాల్లో విశ్వాసం పెరుగుతోందని పేర్కొంటూ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, యువత నుంచి ప్రపంచానికి భారీ అంచనాలు ఉన్నాయని చెప్పారు.