రాజస్థాన్ సికార్ జిల్లాలోని కెర్పురా గ్రామానికి చెందిన మేజర్ నవ్య షెకావత్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్ద ఏడీసీగా నియమితులయ్యారు. దీంతో ఈ అత్యున్నత హోదా సాధించిన మొదటి ఆర్మీ మహిళా అధికారిగా ఆమె చారిత్రాత్మక రికార్డు సృష్టించారు. దేశంలో రాష్ట్రపతికి ఏడీసీగా నియమితులైన రెండో మహిళా అధికారిగా నవ్య నిలిచారు. అంతకుముందు 2025లో ఇండియన్ నేవీకి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ యశస్వి సోలంకి తొలి మహిళా ఏడీసీగా సేవలు అందించగా, ఆర్మీ నుంచి ఆ ఘనత సాధించిన మొదటి మహిళగా మేజర్ నవ్య రికార్డు నెలకొల్పారు.
జులై 2026లో ఈ నియామకం జరగ్గా, ప్రస్తుతం ఆమె రాష్ట్రపతి భవన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. మేజర్ నవ్య షెకావత్ నేపథ్యం పూర్తిగా రక్షణ రంగానికి చెందినది. ఆమె కుటుంబంలోని మూడు తరాల వారు భారత సైన్యంలో సేవలు అందించారు: భన్వర్ సింగ్ షెకావత్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో వింగ్ కమాండర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. గ్రూప్ కెప్టెన్ కరణ్ సింగ్ షెకావత్ ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నత స్థాయిలో సేవలు అందిస్తున్నారు.
నవ్య తన కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ భారతీయ సైన్యంలో మేజర్‌గా సేవలు అందిస్తున్నారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత నవ్య సైన్యంలో చేరాలనే దృఢ సంకల్పంతో ముందడుగు వేశారు.కేంద్ర ప్రభుత్వ యూపీఎస్సీ నిర్వహించే కఠినమైన ‘సీడీఎస్’ పరీక్ష రాసి, తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించారు.చెన్నైలోని ప్రతిష్టాత్మక ‘ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ’లో పురుషులతో సమానంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు.
2021లో ఆమె ‘ఆర్మీ సర్వీస్ కార్ప్స్’ విభాగంలో అధికారిగా విధుల్లో చేరారు. ఇది సైన్యానికి అవసరమైన ఆహారం, రవాణా, వస్తువులను సరఫరా చేసే కీలక విభాగం.తన అంకితభావంతో కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే మేజర్ స్థాయికి ఎదిగి, ఇప్పుడు నేరుగా రాష్ట్రపతి ఏడీసీగా ఎంపికయ్యారు. రక్షణ రంగంలో, రాష్ట్రపతి భవన్‌లో ఏడీసీ పదవికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.
రాష్ట్రపతి అధికారికంగా పాల్గొనే పర్యటనలు, పరేడ్‌లు, సమావేశాలు, అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో ప్రోటోకాల్‌ను అమలు చేయడం, కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూసుకోవడం వీరి ప్రధాన పని. సాధారణంగా రాష్ట్రపతికి సహాయకులుగా ఐదుగురు ఏడీసీలు ఉంటారు. వీరిలో ముగ్గురు ఆర్మీ నుంచి, ఒకరు నేవీ నుంచి, మరొకరు ఎయిర్‌ఫోర్స్ నుంచి ఎంపికవుతారు. ఆర్మీ కోటా నుంచి మేజర్ నవ్య ఈ బాధ్యతను దక్కించుకున్నారు.భారత రక్షణ దళాలలో మహిళలు ఉన్నత నాయకత్వ బాధ్యతలను స్వీకరించగలరని నిరూపిస్తూ, ఆమె కోట్లాది మంది బాలికలకు స్ఫూర్తిగా నిలిచారు.

More Stories
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ హవా, 3 స్థానాలు కైవసం
స్టార్టప్‌లే భారతదేశపు యువత సత్తాకు నిదర్శనం
ఆస్కార్ బరిలో పోటీలో నిలిచిన మరాఠి సినిమా ‘గోంధల్’