తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నెయ్యి కల్తీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది. హైదరాబాద్ జోనల్ కార్యాలయ అధికారులు సుకృతి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ కైలాష్ చంద్ మంగ్లాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ), 2002లోని సెక్షన్ 19 కింద 2026 సెప్టెంబర్ 17న కైలాష్ చంద్ మంగ్లాను అరెస్ట్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.
అనంతరం ఆయనను విశాఖపట్నంలోని పీఎంఎల్ఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు న్యాయపరమైన కస్టడీకి పంపింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, అవినీతి ఆరోపణలపై కేసు నమోదైంది. ఈడీ దర్యాప్తులో భాగంగా కల్తీ నెయ్యిని తయారు చేసేందుకు రిఫైన్డ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్‌తో పాటు పలు రసాయనాలను ఉపయోగించినట్లు గుర్తించినట్లు తెలిపింది.
ఈ కల్తీ నెయ్యిని అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ కౌ గీ పేరుతో టీటీడీకి సరఫరా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఈడీ పేర్కొంది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో సుమారు రూ. 230 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని నిందితులు సరఫరా చేసినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో రూ. 96 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని కైలాష్ చంద్ మంగ్లా తన ఫ్యాక్టరీలో తయారు చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ కైలాష్ చంద్ మంగ్లా ఈ కేసులో కీలక కుట్రదారుల్లో ఒకరిగా వ్యవహరించినట్లు ఈడీ ఆరోపించింది.
తన ఫ్యాక్టరీలో కల్తీ నెయ్యి తయారీకి అవసరమైన పదార్థాలను సమకూర్చడంతో పాటు వివిధ సంస్థల ద్వారా సరఫరా వ్యవస్థను సమన్వయం చేసినట్లు ఈడీ పేర్కొంది. ఈ వ్యవహారంలో శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, మల్గంగా మిల్క్ అండ్ అగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థల పేర్లను ఈడీ ప్రస్తావించింది. నెయ్యి, రిఫైన్డ్ పామ్ ఆయిల్ కొనుగోళ్లు, విక్రయాలకు సంబంధించి తప్పుడు రికార్డులను సృష్టించినట్లు ఈడీ తెలిపింది.
కల్తీ పదార్థాల వినియోగాన్ని దాచిపెట్టి అసలైన ఆవు నెయ్యి ఉత్పత్తి, సరఫరా చేసినట్లు చూపించేందుకు ఈ రికార్డులు రూపొందించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొంది. ఈ కేసులో భాగంగా గతంలో భోల్ బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్, డైరెక్టర్ విపిన్ జైన్‌ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. కల్తీ నెయ్యి తయారీ, టీటీడీకి సరఫరా వ్యవహారంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు ఈడీ పేర్కొంది.

More Stories
కృష్ణలంక పోలీసు హింసతోనే సాయికృష్ణ మృతి
దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్
మతం మారితేనే వైసీపీలో పదవులు