మణిపూర్‌లోని సహాయ శిబిరాలలో నివసిస్తున్న అంతర్గత నిర్వాసితులలో అసహజ మరణాలతో సహా అనేక మంది మరణించారన్న నివేదికలపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ కేసులలో తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. సహాయ శిబిరాలలో మరణాలకు సంబంధించి జమ్మూ కశ్మీర్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ గీతా మిత్తల్ కమిటీ సమర్పించిన నివేదికను ఉటంకిస్తూ జులై 4వ తేదీన కమిటీ అడిగిన సమాచారాన్ని ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించింది.
“ఆదేశాలు జారీ చేసేలా కోర్టును బలవంతం చేయవద్దని మీ చీఫ్ సెక్రటరీకి చెప్పండి. తీసుకున్న చర్యలేమిటో వెంటనే వివరించండి” అని సర్వోన్నత న్యాయస్థానం భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్‌లు జయమాల్య బాగ్చి, వి. మోహనలతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది. మరోవైపు మణిపూర్ వ్యాప్తంగా సహాయక శిబిరాల్లో నమోదైన మరణాలపై పరస్పర విరుద్ధమైన గణాంకాలు సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి.
ఎనిమిది జిల్లాల్లో 640 మరణాలు సంభవించినట్లు ఒక నివేదిక పేర్కొంది. ఒక ఐఏఎస్ అధికారి ఇచ్చిన మరో నివేదికలో శిబిరాల్లో 608 మరణాలు సంభవించినట్లు ఉన్నది. అయితే కేవలం 20 కేసుల్లో మాత్రమే పోస్ట్‌మార్టం పరీక్షలు నిర్వహించినట్లు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. దీంతో అసహజ మరణాలన్నిటికి పోస్ట్‌మార్టం పరీక్షలు ఎందుకు నిర్వహించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరింది.
సహాయ శిబిరాలలో ఉంటూ అసహజ మరణం పొందిన నిర్వాసితులకు కేవలం రూ. 20,000-30,000 పరిహారం మాత్రమే ఎందుకు చెల్లించారో వివరించాలని ధర్మాసనం రాష్ట్రాన్ని కోరింది. ఈ విషయంపై ప్రత్యేక స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని మణిపూర్ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీని ఆదేశించింది. అసహజ మరణాలకు సంబంధించిన అన్ని కేసులలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యేలా, దర్యాప్తులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవల అథారిటీని కోరారు.
సహాయ శిబిరాలలో నివసిస్తున్న నిర్వాసితుల భద్రత, గౌరవాన్ని కాపాడాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కోర్టుకు ఎనిమిది జిల్లాల్లో 42 ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. మొత్తం 3,020 కేసులు విచారణలో ఉండగా 302 కేసుల్లో చార్జిషీట్లు, 1,583 కేసుల్లో క్లోజర్ రిపోర్టులు దాఖలు చేశామని పేర్కొన్నారు. మరో 1,135 కేసుల్లో విచారణ కొనసాగుతుండగా, 33 కేసుల్లో ట్రయల్స్ ప్రారంభం అయ్యాయని చెప్పారు.
గౌహతిలోని ప్రత్యేక కోర్టు వారానికి రెండు రోజులు మాత్రమే కేసులను విచారిస్తోందని బాధితుల న్యాయవాది తెలపగా విచారణను వేగవంతం చేసేందుకు సీబీఐ కేసుల కోసం మరో రెండు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.

More Stories
హిందీ బోధనపై తమిళనాడు వ్యతిరేకతపై సుప్రీంకోర్టు అసహనం
ఉధంపూర్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
పెల్లెట్ గన్ వాడకంపై దర్యాప్తు కమిటీ మార్పుకు సుప్రీం నిరాకరణ