హిందీ బోధనపై తమిళనాడు వ్యతిరేకతపై సుప్రీంకోర్టు అసహనం 

హిందీ బోధనపై తమిళనాడు వ్యతిరేకతపై సుప్రీంకోర్టు అసహనం 

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో హిందీ బోధనపై తన వైఖరిని పునఃపరిశీలించుకోవాలని, అలాగే జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటును వ్యతిరేకించడంపై మరోసారి ఆలోచించాలని సుప్రీంకోర్టు గురువారం సూచించింది. తమిళనాడులో హిందీని పూర్తిగా మినహాయించలేమని, ఢిల్లీలో ఉన్నవారికి ప్రజలు దూరమవ్వకూడదని కోర్టు అభిప్రాయపడింది.

పాఠశాలల్లో హిందీ బోధనపై తమిళనాడు వ్యతిరేకతకు సంబంధించిన అంశాన్ని విచారిస్తున్న జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఎ.జి. మసీహ్‌లతో కూడిన ధర్మాసనం  విచారించింది. ఈ సందర్భంగా, తమిళనాడు గడ్డపై హిందీ బోధనను అనుమతించబోమనే “వైఖరి”ని ఆ రాష్ట్రం మార్చుకోవాలని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. అంతేకాకుండా, భాషా అంశంపై కేంద్రంతో తమిళనాడు చర్చలు జరపాలని ఆమె పేర్కొన్నారు.

“మీ రాష్ట్రంలో మీరు చేస్తున్న మంచి పనులకు అదనంగా మరొకటి ఉండటం వల్ల మీ ప్రమాణాలు ఏమీ తగ్గిపోవు. ఢిల్లీ నుంచి వచ్చే విధానం చెన్నై ప్రమాణాలను తగ్గించదు. చెన్నై ప్రజలు ఢిల్లీకి, అలాగే ఢిల్లీ వారు చెన్నైకి దూరంగా ఉండకూడదు,” అని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుపుతున్నప్పుడు సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

నవోదయ విద్యాలయాల వల్ల ‘తమిళనాడు తమిళ అభ్యాస చట్టం’  ఉల్లంఘనకు గురికాలేదని హైకోర్టు నిర్ధారించిన తర్వాతే ఆ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, నవోదయ విద్యాలయాల విధానం తమ ‘ద్విభాషా విధానం’తో  సరిపోలడం లేదని, అలాగే విద్యా విధానాలు తమ పరిధిలోకి వస్తాయని పేర్కొంటూ తమిళనాడు ఆ ఆదేశాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

అయితే, విద్య అనేది ఉమ్మడి జాబితా పరిధిలోకి వస్తుందని, అక్కడ “సహకార సమాఖ్య స్ఫూర్తి” ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నవోదయ విద్యాలయాలు రాష్ట్రంలోని ఇతర విద్యా సంస్థల పనితీరుకు ఆటంకం కలిగించవని, అవి యథావిధిగా కొనసాగవచ్చని కూడా కోర్టు తమిళనాడుకు తెలిపింది.  “మీ రాష్ట్రంలో విద్య కోసం మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో విద్యా ప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయని మాకు తెలుసు. అదనంగా మరొకటి ఉండటం వల్ల మీ ప్రమాణాలు తగ్గిపోవు. ఢిల్లీ నుంచి వచ్చే విద్యా విధానం చెన్నై ప్రమాణాలను తగ్గించదు, ఆ విషయం మాకు తెలుసు,” అని కోర్టు పేర్కొంది.