విద్యుత్ కోత‌ల‌తో చీక‌ట్లో మ‌గ్గుతున్న బాంగ్లాదేశ్

విద్యుత్ కోత‌ల‌తో చీక‌ట్లో మ‌గ్గుతున్న బాంగ్లాదేశ్
దేశంలో విద్యుత్ ఉత్పత్తిపై సహజ వాయువు తీవ్ర కొరత ప్రభావం చూపడంతో, బంగ్లాదేశ్ గత కొన్నేళ్లలో అత్యంత తీవ్రమైన విద్యుత్ సంక్షోభాలలో ఒకదానిని ఎదుర్కొంటోంది; దీనివల్ల దుకాణాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌ను రాత్రి 8 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దేశ రాజ‌ధాని ఢాకాలోనే 4-5 గంట‌ల క‌రెంట్ కోత‌లు న‌మోద‌వుతున్నాయి. 

దేశ‌వ్యాప్తంగా తీవ్ర విద్యుత్ కోత‌ల‌తో ప్ర‌జ‌లు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో 8 నుండి 10 గంటలసేపు విద్యుత్ కోతలు ఎదుర్కొంటున్నారు. ప్ర‌భుత్వ అస‌మ‌ర్ధ‌త‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా చేసే భారత్ కూడా ఇప్పుడు ఆ దేశాన్ని పూర్తిగా ఆదుకునే ప‌రిస్థితులు లేవు.  స్థానిక ప్ర‌జ‌లు చాలా మంది త‌మ‌కు 90వ ద‌శ‌కం నాటి రోజులు గుర్తుకొస్తున్నాయంటున్నారు. గ‌తంలో కిరోసిన్ దీపాలు వాడే రోజులు మ‌ళ్లీ వ‌చ్చాయంటున్నారు.

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 3,000 మెగావాట్ల నుంచి 3,500 మెగావాట్ల విద్యుత్ లోటు ఉంది. విద్యుత్ ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌లో లోపాలు, ఉత్ప‌త్తికి త‌గినంత చ‌మురు స‌ర‌ఫ‌రా లేక‌పోవ‌డం వంటివి బంగ్లాదేశ్లో విద్యుత్ కోత‌ల‌కు కార‌ణాలుగా చెబుతున్నారు.  ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. ప‌రిశ్ర‌మ‌లు కూడా విద్యుత్ కొర‌త‌తో నిలిచిపోతున్నాయి. చివ‌రికి ఆస్ప‌త్రుల్లో చికిత్స చేయడానికి రాత్రి పూట కూడా విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉండ‌టం లేదు.

ఒక ఆస్ర‌త్రిలో టార్చ్‌లైట్ల వెలుగులో న‌ర్సులు వైద్యం చేస్తున్న ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. బంగ్లాదేశ్‌లో విద్యుత్ సంక్షోభం నివార‌ణ‌కు చ‌మురు చాలా అవ‌స‌రం. ఆ దేశానికి అవ‌స‌ర‌మైన చ‌మురును కొంత‌ వ‌ర‌కు భారత్ స‌ర‌ఫ‌రా చేస్తుంది.  2023లో భారత్ నిర్మించిన ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్ ద్వారా ఆ దేశానికి భారత దేశం నుంచి చ‌మురు స‌ర‌ఫ‌రా జ‌రుగుతుంది. అయితే, ఇప్పుడు ఇరాన్ యుద్ధం, అంత‌ర్జాతీయ సంక్షోభం నేప‌థ్యంలో భారత్ సైతం చ‌మురు కొర‌త‌ను ఎదుర్కుంటోంది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో బంగ్లాదేశ్‌కు చ‌మురు స‌ర‌ఫ‌రా చేయ‌డం భారత్ కు క‌ష్టంగా మారింది.  దీంతో అక్క‌డ చ‌మురు ఆధారిత విద్యుత్ ఉత్ప‌త్తి భారీగా త‌గ్గింది.  కొన్ని ప్రాంతాల్లో, బకాయి విద్యుత్ బిల్లుల వసూలు కోసం చేపట్టిన చర్యల సమయంలో విద్యుత్ శాఖ అధికారులపై దాడులు జరుగుతున్నాయి.ఇదే స‌మ‌యంలో భారత్ నుంచి నేరుగా బంగ్లాదేశ్‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా కూడా జ‌రుగుతుంది. 

అనేక రాష్ట్రాల్లోని ప్రైవేటు ప‌వ‌ర్ ప్లాంట్ల నుంచి బంగ్లాదేశ్‌కు 2,656 మెగావాట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రా జ‌రుగుతోంది. కానీ, అనేక అవాంత‌రాల వ‌ల్ల భారత్ నుంచి కూడా త‌గినంత విద్యుత్ స‌ర‌ఫ‌రా జ‌ర‌గ‌డం లేదు. ఇలాంటి ప‌లు ప‌రిస్థితుల కార‌ణంగా బంగ్లాదేశ్ విద్యుత్ కొర‌త‌ను ఎదుర్కుంటోంది. దాదాపు 20 ఏళ్ల‌లో ఇలాంటి సంక్షోభం లేద‌ని స్థానికులు అంటున్నారు.