పిఎఫ్ వేతన పరిమితి రూ.25,000లకు పెంపు

పిఎఫ్ వేతన పరిమితి రూ.25,000లకు పెంపు
దేశంలోని లక్షలాది మంది ప్రభుత్వ, ప్రైవేట్, సంఘటిత రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కింద తప్పనిసరి ప్రావిడెంట్ ఫండ్ కవరేజ్ కోసం నిర్దేశించిన వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000 లకు పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. దీని వల్ల 51 లక్షల మంది అదనపు ఉద్యోగులు ఈపీఎఫ్ఓ సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి రానున్నారు. అలాగే ఉద్యోగుల పదవీ విరమణ నిధి మరింత పెరగనుంది. 
 
ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై అదనంగా రూ.11,339 కోట్ల భారం పడనుంది.   వేతన పరిమితిని పెంచడం ద్వారా పీఎఫ్ నెట్‌వర్క్‌లో కొత్తగా లక్షలాది మంది ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పరిధిలోకి రానున్నారు. ఈ నిర్ణయం అమలు చేయడం ద్వారా ప్రభుత్వంపై ఏడాదికి సుమారు రూ.11,339 కోట్ల అదనపు వ్యయం కానుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పీఎఫ్ పరిధి విస్తరించడం వల్ల ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత మెరుగైన పెన్షన్, సేవింగ్స్ లభిస్తాయి. 
 
ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల్లో ఉద్యోగ భద్రతాభావం పెరిగి, కంపెనీలు తమ ప్రతిభావంతులైన సిబ్బందిని ఎక్కువ కాలం నిలుపుకోవడానికి తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పీఎఫ్ వేతన పరిమితిని రూ.15000 నుంచి రూ. 25,000లకు పెంచే ప్రతిపాదనకు ఇటీవలే కేంద్ర ఆర్ధిక శాఖ ఆమోదం తెలపగా తాజాగా మంత్రివర్గం ఆమోదించింది.  గతంలో 2014 సెప్టెంబర్‌లో పీఎఫ్ వేతన పరిమితిని రూ.6500 నుంచి రూ.15000 కేంద్రం పెంచింది. 
 
దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు రూ 25,000లకు పెంచుతూ ఆమోదించింది. బేసిక్ పే రూ.15000 కంటే ఎక్కువ ఉండడంతో ఇప్పటివరకు ఈపీఎఫ్ కవరేజ్ అందుకోని లక్షలాది మంది ఉద్యోగులు ఇకపై తప్పనిసరిగా ఈపీఎఫ్ పరిధిలోకి రానున్నారు. పీఎఫ్ సీలింగ్ పెంచడంతో కంపెనీలు తమ ఉద్యోగుల పీఎఫ్, పెన్షన్ ఖాతాలకు చెల్లించే వాటా పెరుగుతుంది. ఈపీఎఫ్‌ఓ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7.98 కోట్ల మంది పీఎఫ్‌ సభ్యులు ఉన్నారు. వీరిలో సుమారు 82 లక్షల మందికి పీఎఫ్‌ పెన్షన్‌ సదుపాయం అందుతుంది.