గుజరాత్‌లో ఐదు గతి శక్తి కార్గో టెర్మినల్స్ ప్రారంభం

గుజరాత్‌లో ఐదు గతి శక్తి కార్గో టెర్మినల్స్ ప్రారంభం
 
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, గుజరాత్‌లో ఐదు గతి శక్తి కార్గో టెర్మినల్స్ (జిసిటి)ను ప్రారంభించి, దేశానికి అంకితం చేసి, శంకుస్థాపన చేశారు. ఇవి రాష్ట్ర సరుకు రవాణా సామర్థ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు, ప్రాంతీయ ఆర్థిక కేంద్రాలు, ఓడరేవులు, దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్ల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి. 
 
గుజరాత్ నుండి ఉప్పును దాని గమ్యస్థానానికి తరలించడానికి రైలు మార్గాన్ని మరింతగా ఉపయోగించుకునే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేస్తూ, వైష్ణవ్ శివలఖ జిసిటి నుండి మిథాపూర్‌కు ఉప్పుతో నిండిన సరుకు రవాణా రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఐదు జిసిటిలలో, కచ్‌లోని శివలఖ జిసిటిని ప్రారంభించారు. కచ్‌లోని భీమాసర్  జిసిటి, మోర్బిలోని దేవాలియా  జిసిటి  మరియు బనస్కాంతలోని చండీసర్  జిసిటిలను దేశానికి అంకితం చేశారు. 
 
మహేసానాలోని లించ్  జిసిటికి శంకుస్థాపన చేశారు. ఈ టెర్మినల్స్ సరుకు రవాణా కోసం రైలు సామర్థ్యాన్ని విస్తరించడానికి, ఓడరేవుల వద్ద రద్దీని, అడ్డంకులను తగ్గించడానికి, అలాగే గుజరాత్ ఓడరేవులకు, ఉత్తర అంతర్భాగాలకు మధ్య సరుకు రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.  స్థానిక ఆర్థిక కేంద్రాలను విస్తృత జాతీయ మార్కెట్లు, ఓడరేవులతో అనుసంధానించడం ద్వారా, ఈ జీసీటీలు ఈ ప్రాంతంలో పెరుగుతున్న పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు మద్దతు ఇస్తాయి.
పేద, మధ్యతరగతి కుటుంబాలతో సహా ప్రతి ఇంటివారు వినియోగించే నిత్యావసర వస్తువు ఉప్పు అని వైష్ణవ్ పేర్కొన్నారు.  గుజరాత్, ముఖ్యంగా కచ్, ఒక ప్రధాన ఉప్పు ఉత్పత్తి ప్రాంతమని, దేశంలోని వివిధ ప్రాంతాలకు ఉప్పును రవాణా చేయడం సాంప్రదాయకంగా అనేక సవాళ్లను ఎదుర్కొందని ఆయన తెలిపారు. సాంప్రదాయ రైల్వే వ్యాగన్లలో ఉప్పును రవాణా చేసినప్పుడు, వ్యాగన్ మోసే సామర్థ్యంలో గణనీయమైన భాగం వ్యాగన్‌కే కేటాయించబడుతుందని చెప్పారు. 
 
 అంతేకాకుండా, ఉప్పు తేమను గ్రహిస్తుంది, దీని ఫలితంగా రవాణా సమయంలో సరుకు తడిసిపోతుంది. ఈ సవాళ్లను పరిష్కరించడానికే కొత్త తేలికపాటి స్టెయిన్‌లెస్ స్టీల్ ఉప్పు కంటైనర్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు ఆయన వివరించారు. ఈ కంటైనర్ పై నుండి లోడింగ్ చేయడానికి, పక్క నుండి అన్‌లోడింగ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. 
 
కొత్త కంటైనర్ల వల్ల దేశంలోని వివిధ ప్రాంతాలకు ఉప్పు రవాణా సులభతరం అవుతుందని, అలాగే లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియ మరింత సజావుగా, సమర్థవంతంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 150 గతి శక్తి కార్గో టెర్మినళ్లను ఇప్పుడు ప్రారంభించమని, ఇవి పరిశ్రమలకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు సరుకు రవాణా అనుసంధానాన్ని మెరుగుపరుస్తున్నాయని వైష్ణవ్ తెలిపారు.