మహిళా ఆసియా టీ20కప్ విజేతగా భారత్‌

మహిళా ఆసియా టీ20కప్ విజేతగా భారత్‌
మహిళల ఆసియా కప్‌లో భారత్‌ మరోసారి రికార్డు స్థాయిలో 8వ టైటిల్‌ను గెలుచుకుంది.  టోర్నీ చరిత్రలో పదోసారి ఫైనల్‌ చేరిన టీమిండియా టైటిల్‌ పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ శ్రీలంకను చిత్తుచేసింది. ఆదివారం రాత్రి దుబాయ్‌ వేదికగా పూర్తి ఏకపక్షంగా సాగిన తుదిపోరులో 72 పరుగుల తేడాతో లంకేయులను చిత్తుచేసి రెండేండ్ల క్రితం ఇదే టోర్నీలోఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.

మొదట షెఫాలీ వర్మ (39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) ధనాధన్‌ ఆటకు తోడు స్మృతి మంధాన (39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59) అర్ధ శతకాలతో రాణించగా ఉమెన్‌ ఇన్‌ బ్లూ 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 183 రన్స్‌ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో లంక 20 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. 

కెప్టెన్‌ చమారి ఆటపట్టు (36) టాప్‌ స్కోరర్‌. తెలుగమ్మాయి శ్రీచరణి (4/20) నాలుగు వికెట్లతో మెరవగా వెటరన్‌ స్పిన్నర్‌ దీప్తి శర్మ (3/19) మరోసారి మాయ చేయడంతో లంకేయులు లక్ష్యం దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌కు షెఫాలి, స్మృతి అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. లంక బౌలర్లను అవలీలగా ఎదుర్కున్న ఈ జోడీ.. ఫస్ట్‌ వికెట్‌కు 12.5 ఓవర్లలోనే ఏకంగా 129 రన్స్‌ జోడించి  ఏకపక్షం చేసేసింది. 

స్మృతి పరిస్థితులకు తగ్గట్టు ఆడినా షెఫాలి మాత్రం ఆరంభం నుంచే వేగంగా ఆడింది. చమారి ఐదో ఓవర్లో 4, 6, 6తో రెచ్చిపోయిన ఆమె ప్రబోధ బౌలింగ్‌లోనూ రెండు ఫోర్లతో అలరించింది. దిల్హరి బౌలింగ్‌లో బౌండరీతో 24 బంతుల్లోనే ఆమె హాఫ్‌ సెంచరీ పూర్తయింది. నీలాక్షి 11వ ఓవర్లో 6,4తో మంధాన కూడా టీ20ల్లో 36వ ఫిఫ్టీని సాధించింది.  13వ ఓవర్లో ప్రబోధ బౌలింగ్‌లో షెఫాలి చమారి చేతికి చిక్కడంతో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ మరుసటి ఓవర్లోనే స్మృతి సైతం నిష్క్రమించింది. ఈ ఇద్దరూ ఉన్నప్పుడు భారత స్కోరు 200 దాటుతుందని భావించినా తర్వాత వచ్చిన హర్మన్‌ప్రీత్‌ (14), రిచా ఘోష్‌ (17), దీప్తి శర్మ (7) ధాటిగా ఆడలేకపోయారు.

భారీ ఛేదనలో క్రాంతి గౌడ్‌ తొలి ఓవర్లోనే వికెట్‌ తీయడంతో లంక ఆత్మరక్షణలో పడింది. చమారి, విష్మీ (20).. 9 ఓవర్లు క్రీజులో ఉన్నా వేగంగా పరుగులు రాబట్టలేకపోయారు. దీప్తి పదో ఓవర్లో ఈ ఇద్దర్నీ ఔట్‌ చేసి లంకకు ‘డబుల్‌’ షాకులిచ్చింది. చమారిని రిచా స్టంపౌట్‌ చేయగా విష్మీ క్లీన్‌బౌల్డ్‌ అయింది. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో నీలాక్షి మినహా మిగిలినవారెవరూ సింగిల్‌ డిజిట్‌ దాటలేకపోయారు.  చరణి వరుస ఓవర్లలో హర్షిత (9), కవిష (7), నీలాక్షి, సుగంధిక (1)ను ఔట్‌ చేసి లంక వెన్ను విరిచింది. ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి దీప్తి.. కౌశని (9)ని బౌల్డ్‌ చేసి ఆ జట్టు ఇన్నింగ్స్‌కు ముగింపు కార్డు వేసింది.