బంగ్లాదేశ్‌లో సైనిక విన్యాసాల సందర్భంగా ఆ దేశ ఆర్మీ వినియోగిస్తున్న చైనా తయారీ ట్యాంక్ పేలింది. ఈ సంఘటనలో ఇద్దరు బంగ్లాదేశ్ సైనికులు మరణించారు. మరో సీనియర్ ఆర్మీ అధికారి గాయపడ్డారు. ఆయనను మిలిటరీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం చట్టోగ్రామ్‌లోని హథజారి ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో బంగ్లాదేశ్ ఆర్మీ సైనిక విన్యాసాలు నిర్వహించింది.
ఈ సందర్భంగా చైనాకు చెందిన టైప్ 59 ట్యాంక్ నుంచి ఫైరింగ్ చేసిన సంఘటనలో ఆ యుద్ధ ట్యాంక్ పేలిపోయింది. గాయపడిన ఆ అధికారిని మెరుగైన చికిత్స కోసం ఢాకాలోని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్‌కు హెలికాప్టర్‌లో తరలించారు. అయితే సైనిక విన్యాసాల్లో ఆ ట్యాంక్ ఎందుకు పేలింది అన్న దానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు.
ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను గుర్తించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు బంగ్లాదేశ్ ఆర్మీకి చెందిన అంతర సేవల ప్రజా సంబంధాల డైరెక్టరేట్ (ఐఎస్‌పీఆర్) పేర్కొంది. మిలిటరీ డ్రిల్ సందర్భంగా చైనా తయారీ యుద్ధ ట్యాంక్ పేలుడుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
గత నెలలో చైనాకు చెందిన అంతరిక్ష సాంకేతికతకు సంబంధించిన మరో వైఫల్యం జరిగిన నేపథ్యంలోనే బంగ్లాదేశ్ ఆర్మీ ట్యాంక్ ఘటన కూడా చోటుచేసుకుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, దక్షిణ చైనాలోని వెంచాంగ్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి చైనాశాట్-4బి ఉపగ్రహాన్ని మోసుకెళ్తున్న చైనాకు చెందిన లాంగ్ మార్చ్ 7ఏ రాకెట్ ప్రయోగించిన కొద్దిసేపటికే పేలిపోయింది.
బీజింగ్ కాలమానం ప్రకారం రాత్రి 8:02 గంటలకు రాకెట్ ప్రయోగించగా, చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా దానిని “ఫ్లైట్ అనామలీ”గా అభివర్ణించింది. ప్రయోగించిన సుమారు 85 సెకన్ల తర్వాత తీరప్రాంతంలోని స్పేస్‌పోర్ట్ సమీపంలో రాకెట్ పేలిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఫుటేజ్ చూపించింది. తదనంతరం ఈ మిషన్ విఫలమైంది, అయితే కారణాన్ని ఇంకా విశ్లేషిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

More Stories
ఇరాన్ చేతికి అమెరికా అత్యాధునిక మానవరహిత జలాంతర్గామి ‘డైవ్ ఎల్డీ’?
దుర్గాపూజ సమీపిస్తుండగా బంగ్లాదేశ్‌లో ముగ్గురు హిందువుల హత్య
ఉగ్రవాది మసూద్ అజార్ ఆచూకీపై తీవ్ర అనిశ్చితి