మోదీ సభలో నకిలీ పీఎంవో ఐడీ కార్డులు, తుపాకీతో ప్రవేశించిన ఇద్దరు

మోదీ సభలో నకిలీ పీఎంవో ఐడీ కార్డులు, తుపాకీతో ప్రవేశించిన ఇద్దరు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొనాల్సి ఉన్న ఒక కీలక కార్యక్రమ వేదిక సమీపంలో, ప్రధాన మంత్రి కార్యాలయ (పిఎంఓ) ఉన్నతాధికారిగా నటిస్తున్న 24 ఏళ్ల వ్యక్తిని, అతనితో ఉన్న ఆయుధధారి అయిన వ్యక్తిగత అంగరక్షకుడిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ముంబైలో ఒక పెద్ద భద్రతా ముప్పు తప్పింది. వేదిక వద్ద భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో స్థానిక పోలీసులు, కేంద్ర భద్రతా సిబ్బంది ఈ అనుమానితుడిని అడ్డుకున్నారు. 

ఈ సందర్భంగా అతనితో ఉన్న ప్రైవేట్ అంగరక్షకుడి వద్ద ఒక తుపాకీని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరూ నకిలీ పీఎంఓ ఐడీ కార్డులతో సంచరిస్తున్నారు.  ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న ‘నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్’ (ఎన్ఎంఎసిసి) వద్ద ప్రధాని మోదీ కార్యక్రమం జరగాల్సిన ప్రదేశంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటం పోలీసులు గమనించారు.

వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని, తుపాకీతో ఉన్న అతని బాడీగార్డ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలోఆ వ్యక్తిని 24 ఏళ్ల రోహన్ పరేఖ్‌గా గుర్తించారు. తాను పిఎంఓకు చెందిన అధికారిగా చెప్పుకున్నప్పటికీ, తనిఖీ చేయగా అతడి వద్ద నకిలీ పీఎంఓ ఐడీ కార్డు ఉన్నట్లు తేలింది. ప్రధాని రాకకు కొద్ది గంటల ముందు ఈ అరెస్టులు జరగడంతో అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

మంగళవారం సాయంత్రం  ఎన్ఎంఎసిసి వేదికగా జరిగే ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్’ (జిఎఫ్ఎఫ్)ను ప్రారంభించడానికి ప్రధాని మోదీ రావాల్సి ఉంది. నకిలీ ఐడీలు, తుపాకీతో ఈ సభ ప్రాంగణంలోకి ఎందుకు వెళ్లారనే గల కారణాలను తెలుసుకునేందుకు ముంబయి పోలీసులు ప్రస్తుతం వారిద్దరినీ సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈ ఘటన తీవ్రత దృష్ట్యా క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తును ప్రారంభించింది. 
 
అదుపులోకి తీసుకున్న ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించడంతో పాటు వారి మొబైల్ ఫోన్లు, ఐడెంటిటీ కార్డులు, ఇతర వస్తువులను పరిశీలిస్తున్నారు. బాడీగార్డ్‌కు తుపాకీ ఎలా లభించిందో, ఆ ఆయుధానికి చెల్లుబాటు అయ్యే అనుమతి ఉందో లేదో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం షాపింగ్ ప్లాజాలో ఉన్న ఓ షాపింగ్ మాల్‌లోకి గుర్తుతెలియని ముగ్గురు అనుమానితులు ప్రవేశించడానికి యత్నించారు.
భద్రతా సిబ్బంది వారిని అడ్డుకోగా, వారు అనుమానాస్పదంగా ఉన్న ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి, గార్డులతో వాదించి, బలవంతంగా లోపలికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మాల్ సెక్యూరిటీని తుపాకీ చూపించి బీకేసీలోని జియో వరల్డ్ ప్లాజాలోకి బలవంతంగా ప్రవేశించారు. అయితే, నిందితుల వద్ద లభించిన ఆయుధానికి లైసెన్స్ ఉన్నట్లు తేలిందని, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి దర్యాప్తును ముమ్మరం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.