పారిస్‌లోని ఈఫిల్ టవర్ ను ఓ హిందూ సంస్థకు చెందిన సాధువులు సందర్శించిన సమయంలో అక్కడ పనిచేస్తున్న మహిళా సిబ్బందిని విధుల నుంచి తప్పించడంపై దుమారం చెలరేగింది. ఈ చర్యలను ఖండిస్తూ ఈఫిల్ టవర్లోని ఉద్యోగులు సోమవారం ఆందోళన చేపట్టడంతో ఈఫిల్ టవర్‌ను మూసివేశారు. బోచసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్తాన్ (బీఏపీఎస్) సంస్థకు చెందిన సుమారు 100 మంది హిందూ సాధవులు ఈఫిల్ టవర్‌ను సందర్శించారు.
ఆ సందర్శన సమయంలో మహిళా ఉద్యోగులను విధులకు దూరంగా ఉంచారు. హిందూ సాధువులకు మహిళలు కనబడాకుండా ఉండేందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు. హిందూ సాధువుల బృందం వచ్చిన సమయంలో పురుషులను విధుల్లోకి తీసుకున్నట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధి డయాన్ డావోని తెలిపారు. “ఈ విషయం ఉద్యోగులకు, ముఖ్యంగా మహిళలకు ఏమాత్రం నచ్చలేదు. జరిగిన తీరు, కొందరి పట్ల వ్యవహరించిన విధానం వారిని తీవ్ర అవమానానికి గురిచేసింది” అని ఆమె పేర్కొన్నారు.
ఈ ఆరోపణలపై విచారణ ప్రారంభించినట్లు పారిస్ మేయర్ ఇమ్మాన్యుయేల్ గ్రెగోయిర్ తెలిపారు. “ఇటువంటి పరిస్థితులను సహించడం ఆమోదయోగ్యం కాదు” అని ఆయన ‘ఎక్స్’ లో స్పష్టం చేశారు. “ఇవి నా విలువలు కావు, అలాగే ఈఫిల్ టవర్ పాటించాల్సిన విలువలు కూడా కావు. అక్కడ స్త్రీ, పురుషుల మధ్య ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తిరగడానికి, వ్యవహరించడానికి అవకాశం ఉండాలి” అని చెప్పారు.
మహిళా సిబ్బందిని తప్పించిన అంశంపై మేనేజ్మెంట్తో చర్చలు జరిపారు. మళ్లీ ఇలా జరగకుడదని మేనేజ్మెంట్తో సిబ్బంది పేర్కొన్నది. ఆ ఘటన పట్ల సిబ్బందికి మేనేజ్మెంట్ క్షమాపణలు చెప్పింది. ఇటీవల పారిస్ శివారు ప్రాంతంలో ఓ హిందూ ఆలయాన్ని ప్రారంభించారు. ఆ గుడి ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు హిందూ సంస్థకు చెందిన సాధువులు పారిస్‌కు చేరుకున్నారు. అయితే ఆ బృందం సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో ఇతరులకు ఇబ్బంది కలిగించరాదన్న ఉద్దేశంతో ఈఫిల్ టవర్ వద్ద ఏర్పాట్లు చేశారు.
అతిథులను ఆహ్వానించడం అంటే మన విలువల్ని పోగొట్టుకోవడం కాదని, ఫ్రాన్స్‌లో మహిళలు ప్రజాజీవితంలో సంపూర్ణంగా ఉంటారని, ఒకరి కోసం వాళ్లను అదృశ్యం కావాలని చెప్పరని నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యేట్ బ్రాన్ పివెట్ తెలిపారు.
`ఎక్స్’లో ఒక ప్రకటనలో, బీఏపీఎస్ మహిళా సిబ్బంది పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆ ఆందోళనలను తాము “చాలా తీవ్రంగా” పరిగణిస్తున్నామని పేర్కొంటూ, “మాకు తెలిసినంత వరకు, ఏ సమయంలోనూ ఈఫిల్ టవర్‌లోకి ఎవరినీ ప్రవేశించకుండా నిరోధించలేదు. అయినప్పటికీ, కలిగిన ఏ బాధకైనా లేదా అసౌకర్యానికైనా మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము” అని పేర్కొన్నది.

More Stories
`భిన్నత్వం సహజం..ఐక్యతే సత్యం’ చాటి చెప్పడమే హిందూ రాష్ట్ర లక్ష్యం
తొలిసారి చైనా మాస్టర్స్ విజేతగా సాత్విక్ జోడీ
ఇరాన్ నౌకలపై అమెరికా దాడులు..బాలిస్టిక్ క్షిపణులతో టెహ్రాన్ ప్రతీకారం