* అరెస్టుల సందర్భంగా తోపులాట, ఉద్రిక్తత
తెలంగాణలో పేద విద్యార్థులకు అందాల్సిన రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాస్వామ్యయుతంగా ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన శాంతియుత ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బిజెపి యువమోర్చ కార్యకర్తలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పోలీసుల అరెస్టులతో ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందేలతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అమీర్‌పేట్ కార్పొరేటర్ శ్రీమతి సరళ అసెంబ్లీ వద్ద జరిగిన నిరసన కార్యక్రమాలు పోలీసులు అరెస్టు చేస్తున్న క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై కుల్సుం పుర పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఆస్పత్రిలో ఐసీయు చేర్చుకొని చికిత్స చేస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి దశలవారీగా అసెంబ్లీ ముట్టడికి వస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తూ వచ్చారు.
వరుసగా అసెంబ్లీ ముట్టడికి కమలం పార్టీ నేతలు రావడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. మరోసారి అసెంబ్లీ ముట్టడికి బీజేపీ యత్నించడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంచందర్‌రావు అరెస్ట్ సందర్భంలో తోపులాట చోటు చేసుకుంది. దీంతో గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ తెలంగాణ చీఫ్‌ను పోలీసులు తీసుకెళ్లకుండా రోడ్డుపై పడుకుని మరీ బీజేవైఎం నేతలు నిరసనకు దిగారు.
రాంచందర్ రావును తీసుకెళ్తున్న పోలీస్ వాహనంపైకి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే ఎక్కడంతో వెంటనే పోలీసులు అతడిని లాగి పడేశారు. ఆ వెంటనే పలువురు కార్యకర్తలు కారుకు అడ్డంగా పడుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో అసెంబ్లీ వద్ద బీజేపీ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలకు చేతులు విరగగా, పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
విద్యార్థులకు రావలసిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే మండిపడ్డారు. శాంతియుతంగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసుకుంటామంటే అడ్డుకున్నందుకే అసెంబ్లీని ముట్టడించాల్సి వచ్చిందని చెబుతూ ఈ ఆందోళన కేవలం ఆరంభం మాత్రమేనని, ముందుముందు అసలు సినిమా చూపిస్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను, బీజేవైఎం కార్యకర్తలను ఏకం చేసి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటినే ముట్టడిస్తామని స్పష్టం చేశారు.
అసెంబ్లీ ముట్టడి సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత అమానుషంగా ఉందని రాంచందర్ రావు మండిపడ్డారు. పోలీసుల తోపులాట, లాఠీచార్జ్ ల వల్ల పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు గాయాలయ్యాయని, పలువురు ఆసుపత్రుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా ప్రజాప్రతినిధులు, యువమోర్చా నాయకులపై పోలీసులు దౌర్జన్యం చేయడం గర్హనీయమని పేర్కొన్నారు.
గతంలో యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది విద్యార్థుల నుంచి సంతకాలు సేకరించి, ఆ విజ్ఞాపన పత్రాలను ఇవ్వడానికి ప్రయత్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించేందుకు వెళ్లినా అక్రమంగా అరెస్టు చేశారని, అంతకుముందు నిరాహార దీక్షకు, నిన్న ధర్నా చౌక్‌లో విద్యార్థి మహాధర్నాకు కూడా పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లోనే పోలీసు యంత్రాంగం నడుస్తోందని, అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేస్తూ, నిరంకుశ, నిర్బంధ పాలన సాగిస్తున్నారని ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు అగాధంలో పడిందని, ఫీజు రీయింబర్స్మెంట్ రాక.. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలియజేయాలని, ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గపు చర్య అని తీవ్రంగా ఆమె ఖండించారు. ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే, విద్యార్థుల పక్షాన బీజేపీ ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని ప్రభుత్వాన్ని డీకే అరుణ హెచ్చరించారు.

More Stories
స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాత మధు అనుచిత వ్యాఖ్యలపై దుమారం
మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల కర్కశత్వం
ఢిల్లీలో భవనం కూలడంపై ఎబివిపి నిరసన.. ఎంసిడి కార్యాలయంపై దాడి