ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ యూకే పర్యటనలో భాగంగా ఎన్నారై సిక్కులతో తన సంబంధాలను విస్తరించుకున్నారు. లండన్‌లోని ఒక ప్రసిద్ధ గురుద్వారాలో ప్రార్థనలు చేశారు. అమెరికా, కెనడా, యూకే దేశాల పర్యటనలో భాగంగా భగవత్ సెప్టెంబర్ 2న యూకేకు చేరుకున్నారు. సంస్థ శత వార్షికోత్సవ సంవత్సరంలో ఆయన సంఘ్ ప్రపంచవ్యాప్త కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నారు.
భగవత్ ఖల్సా జాతా బ్రిటిష్ ఐల్స్ గురుద్వారాను సందర్శిస్తున్న చిత్రాలను ఆర్‌ఎస్‌ఎస్ విడుదల చేసింది. ఆయనకు బీజేపీ రాజ్యసభ ఎంపీ విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ, ఇతర సంఘ నాయకులు స్వాగతం పలికారు. లండన్‌లో, భగవత్‌కు ‘ఇంటిగ్రల్’ అనే యూకే ఆధారిత సంస్థ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సంస్థ యూకేలో, యూకే-భారత్ మధ్య సంభాషణలు, సహకారం, దీర్ఘకాలిక సంబంధాలను బలోపేతం చేయడానికి నాయకులను, సంఘాలను ఏకతాటిపైకి తీసుకువస్తుంది.
భగవత్‌కు యూకేలో స్వాగతం పలకడానికి, ఆయన పర్యటన సందర్భంగా విస్తృత భాగస్వామ్య కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి, యూకేకు చెందిన 115కు పైగా సామాజిక-సాంస్కృతిక సంస్థలు ఇంటిగ్రల్‌తో చేతులు కలిపాయని ఆర్‌ఎస్‌ఎస్ తెలిపింది. తన మత సామరస్య కార్యక్రమంలో భాగంగా, సంఘ్ అధినేత విల్లెస్డెన్‌లోని శ్రీ స్వామినారాయణ ఆలయాన్ని కూడా సందర్శించారు.
సెప్టెంబర్ 6న “ఏకత్వ వేడుక” అనే ఇతివృత్తంతో జరిగే సామాజిక నాయకుల సత్కార కార్యక్రమానికి, నాగరిక సంభాషణకు భగవత్ హాజరవుతారు. 1966లో బ్రిటన్‌లో స్థాపించబడిన హిందూ సామాజిక, సాంస్కృతిక సంస్థ అయిన హిందూ స్వయంసేవక్ సంఘ్ యూకే ఇంటిగ్రల్ మద్దతుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
మరోవంక, యూకే భద్రతా మంత్రి డాన్ జార్విస్, గురువారం పార్లమెంటులో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ, ఈ పర్యటన దేశ వలస నిబంధనల ప్రకారం “అవసరాలకు” అనుగుణంగా ఉందని పునరుద్ఘాటించారు. ఈ వారం భగవత్ యూకే పర్యటన ప్రారంభం సందర్భంగా హిందూ కౌన్సిల్ యూకే, హిందూ ఫోరమ్ ఆఫ్ బ్రిటన్, హిందూ స్వయంసేవక్ సంఘ్ యూకే, ఇన్‌సైట్ యూకే వంటి సంఘాలు సంయుక్త ప్రకటనను జారీ చేశాయి.
“ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ. ఇది వ్యక్తిత్వ నిర్మాణం, స్వచ్ఛంద సేవ, నాయకత్వం, సామాజిక సమైక్యత, ప్రపంచ సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించడానికి అంకితమై ఉంది,” అని వారు పేర్కొన్నారు. “ఆర్ఎస్ఎస్ తన విస్తృతమైన సామాజిక సేవకు, సమానత్వాన్ని ప్రోత్సహించడానికి, మారుమూల మరియు ,దుర్గమ ప్రాంతాలలో విద్యను అందించడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ‘మొదట స్పందించే’ సంస్థగా ప్రసిద్ధి చెందింది” అని తెలిపారు.
“ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల భాగంగా, మన అన్ని వర్గాలకు సంబంధించిన ఐదు పరివర్తనలను ప్రోత్సహించడంలో డాక్టర్ భగవత్ నాయకత్వంలో తీసుకున్న ప్రయత్నాలను మేము స్వాగతిస్తున్నాము: సామాజిక సామరస్యం, సమైక్యత; సమాజంలో ఒక యూనిట్‌గా కుటుంబం ప్రాముఖ్యత; నిస్వార్థ సేవ; పర్యావరణ పరిరక్షణ; పౌర విధులను శ్రద్ధగా నిర్వర్తించడం,” అని వారు జోడించారు.

More Stories
22ఏ నిషేధిత భూముల జాబితాకు నిరసనగా బిజెపి మహాధర్నా
ఆఫ్రికా పెద్దగా, గ్రీన్‌ల్యాండ్ చిన్నగా.. త్వరలో కొత్త ప్రపంచ పటం
బెంగాల్లో 1000 విద్య భారతి పాఠశాలల ఏర్పాటు