సాధారణంగా ప్రపంచ పటాన్ని చూస్తే ఐరోపా, ఉత్తర అమెరికా భారీగా, ఆఫ్రికా మాత్రం వాటితో పోలిస్తే చిన్నగా కనిపిస్తుంది. కానీ ఖండాల వాస్తవ విస్తీర్ణాన్ని మరింత కచ్చితంగా ప్రతిబింబించే కొత్త ప్రపంచ పటాన్ని ప్రోత్సహించే తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఆమోదించింది. ఈ తీర్మానానికి భారత్‌తో సహ 164 దేశాలు మద్దతు పలికాయి. అమెరికా మాత్రం వ్యతిరేకంగా ఓటేసింది. మరో ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
ఈక్వల్ ఎర్త్ కార్టోగ్రాఫిక్ ప్రొజెక్షన్ పేరుతో ఈ కొత్త మ్యాప్‌ను తీసుకొచ్చారు. ప్రపంచంలోని వివిధ ఖండాల భూభాగాలను వాటి వాస్తవ విస్తీర్ణానికి దగ్గరగా చూపించడమే దీని ప్రధాన ఉద్దేశం. 2018లో కార్టోగ్రాఫర్ల బృందం దీన్ని అభివృద్ధి చేసింది. ఇందులో ఖండాల సాపేక్ష భూవిస్తీర్ణాన్ని సాధ్యమైనంత కచ్చితంగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ మ్యాప్‌లో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా, ఓషియానియా ప్రాంతాలు ప్రస్తుతం మెర్కేటర్ మ్యాప్‌లో కనిపించే దానికంటే పెద్దగా కనిపిస్తాయి.
మరోవైపు ఉత్తర ప్రాంతాల పరిమాణం తగ్గుతుంది. ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ ఖండాల మధ్య ఉన్న వాస్తవ విస్తీర్ణ నిష్పత్తిని కాపాడటంతో పాటు, వాటి ఆకృతులను వీలైనంత వరకు గ్లోబ్‌పై కనిపించే విధంగా చూపిస్తుంది. ఈ తీర్మానాన్ని ఐరాస సర్వసభ్య సమావేశంలో ఆఫ్రికాలోని టోగో దేశం ప్రవేశపెట్టింది.
తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా మరింత కచ్చితమైన, సమతుల్యమైన కార్టోగ్రఫీ విధానాలను ప్రోత్సహించాలన్న తీర్మానం ఉద్దేశాన్ని భారత్ స్వాగతిస్తోందని ఐరాసలోని భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ రఘూ పూరీ తెలిపారు. ప్రపంచ భౌగోళిక స్వరూపాన్ని, వివిధ ప్రాంతాల పరిమాణాలను సమాజాలు ఎలా అర్థం చేసుకుంటాయన్న విషయంలో పటాలకు కీలక పాత్ర ఉందని, ప్రపంచ పటాల్లో భూభాగాల వాస్తవ విస్తీర్ణానికి తగిన ప్రాతినిధ్యం ఉండటం అవసరమని అభిప్రాయపడ్డారు.
తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసిన అమెరికా ఇది సైద్ధాంతిక చర్య అని విమర్శలు చేసింది. మెర్కేటర్ మ్యాప్ బదులుగా కొత్త మ్యాప్‌లను ప్రోత్సహించనున్నట్లు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయల్ బారట్ తెలిపారు. ఇక ఈక్వెల్ ఎర్త్ మ్యాప్ ప్రకారం ఉక్రెయిన్‌లోని భూభాగాన్ని రష్యా ఆక్రమించినట్లుగా ఉండడంతో ఆ మ్యాప్ విధానాన్ని ఉక్రెయిన్ వ్యతిరేకిస్తూ ఓటింగ్‌లో పాల్గొనలేదు. తీర్మానానికి యురోపియన్ యూనియన్ మద్దతు ఇస్తూ మ్యాప్‌లు మారినా సరిహద్దులు మారవని పేర్కొన్నది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విద్యా సంస్థలు, మీడియా, డిజిటల్ వేదికలు, అధికారిక పత్రాల్లో విస్తృతంగా వినియోగించేది మెర్కేటర్ ప్రొజెక్షన్. దీనిని 1569లో ఫ్లెమిష్ కార్టోగ్రాఫర్ గెరార్డస్ మెర్కేటర్ రూపొందించారు. 16వ శతాబ్దంలో సముద్ర నావిగేషన్ అవసరాల కోసం రూపొందించిన ఈ పట విధానం, భూమధ్యరేఖకు దూరంగా ఉన్న ప్రాంతాల భూభాగ పరిమాణాలను వాస్తవానికి భిన్నంగా చూపిస్తుంది.

More Stories
యూకే పర్యటనలో గురుద్వారా సందర్శించిన మోహన్ భగవత్
నాగరిక సంభాషణను పెంపొందించేందుకే భగవత్ యుకె పర్యటన
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు 2 సార్లు గుండెపోటు?