చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు 2 సార్లు గుండెపోటు?

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు 2 సార్లు గుండెపోటు?
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై మరోసారి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిన్‌పింగ్‌కు ఇటీవల కనీసం రెండు సార్లు గుండెపోటు వచ్చిందని సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ మాజీ రాజకీయ అధిపతి లోబ్సాంగ్ సాంగే సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి స్వతంత్ర ధ్రువీకరణ, అధికారిక మెడికల్ రిపోర్టులు అందుబాటులో లేవు. 
 
ఏఎన్‌ఐ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న లోబ్సాంగ్ సాంగే ఈ విషయాన్ని తనకు ఓ మాజీ ఉన్నతస్థాయి చైనా అధికారి చెప్పినట్లు వెల్లడించారు. ఆ అధికారితో గంటకు పైగా జరిగిన సంభాషణలో జిన్‌పింగ్ ఆరోగ్యం గురించి సమాచారం అందిందని తెలిపారు. జిన్‌పింగ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని చెబుతూ బహిరంగ కార్యక్రమాల్లో కనిపిస్తున్న తీరు, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, నడిచే విధానంలో మార్పులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా జిన్‌పింగ్ మెంటల్ ఫాగ్‌తో బాధపడుతున్నారని, దాని ప్రభావంతో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.  చైనాలో ఉన్నతస్థాయి సైనిక అధికారులపై ఇటీవల జరుగుతున్న చర్యలను కూడా సాంగే ప్రస్తావించారు. జిన్‌పింగ్ హయాంలో కీలక పదవులు చేపట్టిన పలువురు సీనియర్‌ సైనిక అధికారులు ఆ తర్వాత పదవులు కోల్పోవడం లేదా ప్రజలకు దూరంగా ఉండటం వెనుక ఆయనపై ఉన్న ఒత్తిడి కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. 

చైనా తదుపరి నాయకత్వంపైనా లోబ్సాంగ్ సాంగే కీలక వ్యాఖ్యలు చేశారు. జిన్‌పింగ్ తన వారసుడిని ప్రకటిస్తే ఆ వ్యక్తి భవిష్యత్తులో తనకు ప్రత్యర్థిగా మారే అవకాశం ఉంటుందని, అందుకే వారసుడిని ప్రకటించడంలో ఆయన వెనుకాడుతున్నారని విశ్లేషించారు. మరోవైపు వారసుడిని ప్రకటించకుండా నాయకత్వ మార్పు జరిగితే, అధికారం కోసం పార్టీలో అంతర్గత పోరు తలెత్తే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని ఆయన ఎంపరర్స్ డైలమాగా అభివర్ణించారు.
 
జిన్‌పింగ్ ఆరోగ్యంపై అనుమానాలు, సోషల్‌ మీడియాలో ప్రచారాలు గతంలోనూ వెలుగులోకి వచ్చాయి. అయితే ఇటీవల ఆయన అంతర్జాతీయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. గురువారం రోజున కిర్గిజిస్థాన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీఓ) సదస్సు, ఈజిప్టు పర్యటన తర్వాత ఆయన బీజింగ్‌కు తిరిగి వచ్చినట్లు చైనా అధికారిక వర్గాలు తెలిపాయి. 
 
లోబ్సాంగ్ సాంగే 2011 నుంచి 2021 వరకు సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్‌కు ఎన్నికైన రాజకీయ అధిపతి సిక్యోంగ్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన హార్వర్డ్ లా స్కూల్‌లో సీనియర్‌ విజిటింగ్‌ ఫెలోగా ఉన్నారు. చైనా టిబెట్‌ విధానాలపై ఆయన చాలాకాలంగా విమర్శలు చేస్తున్నారు.