23 మంది భారతీయులున్న కార్గో షిప్పుపై డ్రోన్ దాడి

23 మంది భారతీయులున్న కార్గో షిప్పుపై డ్రోన్ దాడి

23 మంది భారతీయ సిబ్బంది ఉన్న కార్గో షిప్పుపై డ్రోన్ దాడి జరిగింది. సెప్టెంబర్ 2, బుధవారం జరిగిన ఈ ఘటనలో ఎవరికీ, ఎలాంటి హానీ కలగలేదని సమాచారం. షిప్పు రష్యా నుంచి పాకిస్తాన్‌లోని కరాచీ వెళ్తుండగా దాడి జరిగింది. ఎంవీ బేర్యోన్ (ఐఎంఓ 9151412) అనే కార్గో షిప్పు రష్యాలోని నోవోరోస్సిస్క్ నుంచి పాక్‌లోని కరాచీ వెళ్తోంది. ఈ సమయంలో నౌకలో 23 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు.

సెప్టెంబర్ 2న ఈ నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనతో నౌకలో మంటలు చెలరేగాయి. అయితే, సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ మంటల్ని ఆర్పేశారు. ఆ తర్వాత మరో డ్రోన్ దాడి జరిగింది. అది నౌకకు సమీపంలో పడింది. అయితే, ఈ ఘటనల్లో నౌకలోని సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని, అంతా సురక్షితంగా ఉన్నారని ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్‌ ఇండియా జనరల్ సెక్రెటరీ మనోజ్ యాదవ్ వెల్లడించారు. 

దాడి తర్వాత నౌక ఎప్పట్లాగే తన ప్రయాణాన్ని కొనసాగించిందని ఆయన వెల్లడించారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో వాణిజ్య నౌకలకు, నౌకలోని సిబ్బందికి భద్రత లేకుండా పోతుందని చెప్పేందుకు ఈ ఘటన మరో ఉదాహరణ అని మనోజ్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా నౌకా రవాణాలో భారతీయ నావికా సిబ్బంది కీలకంగా పని చేస్తున్నారని, అయితే, ఇటీవలి పరిణామాల వల్ల వారు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నారని మనోజ్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ ప్రాంతంలో ఘర్షణలకు ఏమాత్రం సంబంధం లేకుండా భారతీయ సిబ్బంది దాడులకు గురవుతున్నారని చెప్పారు. ఇరాన్-అమెరికా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు వాణిజ్య నౌకలపై జరిగిన అనేక దాడుల్లో భారతీయులున్నారు. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు.