మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌

మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌
* చిన్నారెడ్డికి ఉద్వాసన.. ఆ స్థానంలో గద్వాల్ విజయలక్ష్మి నియామకం 
 
మంత్రి వర్గం నుండి కొండా సురేఖను తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొండా సురేఖను కేబినెట్‌ నుంచి తక్షణమే తొలగిస్తున్నట్టు సీఎంవో లేఖ విడుదల చేసింది.  కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఆమోద ముద్ర లభించగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ సిఫారసు లేఖను గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లాకు పంపించారు. రాజీనామాకు కొండా సురేఖ అంగీకరించకపోవడంతో ఆమెను తొలగించాలని సీఎం సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
 
మంత్రి కొండా దంపతులు నేడు హైద‌రాబాద్‌లో తమ అనుచచ‌రుల‌తో స‌మావేశ‌మై భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని కొద్దిసేపట్లోనే సాయంత్రంలోగా రాజీనామా చేయకపోతే, లోక్‌భవన్‌కు బర్తరఫ్ లేఖ పంపిస్తామని హైక‌మాండ్ హెచ్చరించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారద నియమించారు.  తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు సంబంధించిన వివాదం నడుస్తున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 

సిట్టింగ్ ఎమ్మెల్యే టి. మేఘా రెడ్డిపై చేసిన వ్యాఖ్యల కారణంగా చిన్నారెడ్డి కూడా విమర్శల పాలయ్యారు. దీంతోపాటు కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

కొండా సురేఖను మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరినా అందుకు ఆమె నిరాకరించింది. దీంతో బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి లేఖ రాశారు. దీంతో దిల్లీలో 2 రోజుల పాటు జరిగిన నాటకీయ పరిణామాలకు తెరపడినట్లైంది. సురేఖ న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి, తనపై తీసుకున్న క్రమశిక్షణా చర్యలను తీవ్రంగా ప్రశ్నించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది.