సింధు జలాలపై హేగ్ కోర్టు తీర్పును తిరస్కరించిన భారత్  

సింధు జలాలపై హేగ్ కోర్టు తీర్పును తిరస్కరించిన భారత్  
పాకిస్థాన్‌తో నీటి పంపిణీ ఒప్పందాన్ని నిలబెట్టుకోవాలని న్యూఢిల్లీని కోరిన తరువాత, సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్ అమలులో ఉంటుందని, హేగ్‌లోని శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానానికి “భారత సార్వభౌమ నిర్ణయాలపై ఎటువంటి అధికార పరిధి లేదు” అని స్పష్టం చేసింది.  అంతర్జాతీయ వివాదాల కోసం ప్రపంచంలోనే అత్యంత పురాతన శాశ్వత వేదిక అయిన మధ్యవర్తిత్వ న్యాయస్థానం, ఒప్పందాన్ని ముగించడానికి లేదా సస్పెండ్ చేయడానికి భారత్‌కు ఎటువంటి సమర్థన లేదని, ఉపఖండంలోని ఈ రెండు బద్ధ శత్రువుల మధ్య ఒప్పందం పూర్తిగా అమలులో ఉందని పేర్కొంది. 
 
1960 సెప్టెంబర్‌లో కుదిరిన సింధు జలాల ఒప్పందం, భారత్,  పాకిస్థాన్ మధ్య సింధు నదీ వ్యవస్థ పంపిణీని నియంత్రించడానికి రూపొందించారు. గత సంవత్సరం ఏప్రిల్ 22న 26 మంది ప్రాణాలు కోల్పోయిన పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో సహా పాకిస్థాన్‌పై భారత్ పలు ప్రతీకార చర్యలు తీసుకుంది.
 
“రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు” అనే తన చిరకాల సూత్రాన్ని పునరుద్ఘాటిస్తూ, ఇస్లామాబాద్ తన భూభాగం నుండి పనిచేస్తున్న సరిహద్దు ఉగ్రవాద నెట్‌వర్క్‌లను నిర్మూలించడానికి ధృవీకరించదగిన, తిరుగులేని చర్యలు తీసుకునే వరకు ఒప్పంద కార్యకలాపాలు నిలిపివేస్తామని న్యూఢిల్లీ స్పష్టం చేసింది. 
 
“ఈ ఒప్పందంలోని నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘిస్తూ ప్రపంచ బ్యాంకు ఈ సోకాల్డ్ కోర్టును ఏర్పాటు చేసింది. చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేన ఈ సంస్థ గతంలో చేసిన అన్ని ప్రకటనలను భారత్ ఎలాగైతే గట్టిగా తిరస్కరించిందో, అలాగే ఈ కోర్టు ఇచ్చిన ఈ సోకాల్డ్ అవార్డును కూడా ఖచ్చితంగా తిరస్కరిస్తుంది,” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 
 
ఈ ‘చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన సంస్థ’ ఉనికిని భారతదేశం చట్టబద్ధంగా ఎన్నడూ గుర్తించలేదని, ‘ఈ ఆరోపిత మధ్యవర్తిత్వ సంస్థ ఏర్పాటు చేయడమే సింధు జలాల ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే’ అని నిరంతరం వాదిస్తూనే ఉందని ఆ ప్రకటన మరింతగా నొక్కి చెబుతోంది. సింధు నదీ వ్యవస్థలోని పశ్చిమ నదులపై భారతదేశానికి చెందిన కిషన్‌గంగా, రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టుల రూపకల్పనకు సంబంధించిన విభేదాలపై పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని కోరింది. 
 
భారతదేశం మొదటి నుంచీ ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ వస్తుంది. ఈ తరహా వివాదాలు సాంకేతికమైనవని, ఒప్పందం ప్రకారం వీటిని ఒక తటస్థ నిపుణుడు పరిశీలించాలని న్యూఢిల్లీ వాదిస్తోంది. ఒకే అంశాలను మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఏకకాలంలో పరిశీలించడానికి అనుమతించడం, ఒప్పందంలో నిర్దేశించిన వివాద పరిష్కార విధానానికి విరుద్ధమని భారత్ పేర్కొంది. తాము ఈ సంస్థ ముందు ఎప్పుడూ హాజరుకాలేదని, అలాగే దాని గత తీర్పులను లేదా ప్రకటనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని భారత్ స్పష్టం చేసింది.