వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన ఆధిపత్య పోరు సాగుతోందని సూచిస్తూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం పార్టీలో జగన్ కంటే సజ్జలకే ఎక్కువ ప్రాధాన్యత ఉందని, అందుకే వైసీపీలో సజ్జల నంబర్ 1గా, జగన్ నంబర్ 2గా మారిపోయారని ఆయన స్పష్టం చేశారు.
ఎక్స్ వేదికగా విడుదల చేసిన ఓ బహిరంగ లేఖలో సజ్జల చెప్పిన మాటలు వింటూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరకు కేబినెట్ మంత్రులకు కూడా జగన్ అపాయింట్మెంట్లు దక్కకుండా చేశారని మండిపడ్డారు. జగన్ సొంత కుటుంబ సభ్యులు ఆయనకు దూరం కావడానికి, పార్టీ ఈ పరిస్థితికి దిగజారడానికి వెనుక ఉన్న ప్రధాన శక్తులలో సజ్జల రామకృష్ణారెడ్డే ముఖ్యుడని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
ఒక ప్రబుద్ధుడి మాటలు నమ్మి సొంత బంధువులను, కష్టపడ్డ నేతలను దూరంగా నెట్టివేశారని విమర్శించారు. ఇదే తీరు కొనసాగితే 2029 ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదని హెచ్చరించారు. అదే జరిగితే ఆ తర్వాత సజ్జలను తిట్టుకుంటూ రాజకీయాల నుంచి రిటైర్ కావాల్సిందేనా? అంటూ జగన్ ను ఆయన నిలదీశారు. పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తూ, పార్టీ ఆధిపత్యాన్ని ఒకరి చేతిలో పెట్టి వ్యవస్థను చిన్నభిన్నం చేశారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
2022లో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో అందరి ముందే సజ్జల తనపై భౌతిక దాడికి పాల్పడినా జగన్ చూస్తూ ఉండిపోయారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంఘటన తర్వాత తన తప్పు లేకపోయినా పార్టీ బాధ్యతలన్నింటి నుంచి తననే పక్కన పెట్టారని విమర్శించారు.
తనపై నమ్మకద్రోహి అంటూ వైఎస్సార్సీపీ కోటరీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘‘నేను నమ్మకద్రోహినే అయితే ఆనాడే సజ్జల మాదిరిగా కాంగ్రెస్‌తో సంధి చేసుకునేవాడిని. సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లలో నా పేరు లేకుండా చేసుకునేవాడిని. నమ్మకస్తుణ్ని అనే కారణంతో ప్రతి ఛార్జిషీట్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నా పేరు చేర్చింది. జగన్ 16 నెలలు జైల్లో ఉంటే నన్ను 15 నెలలు జైల్లో ఉంచారు. నాకు సంబంధం లేని లిక్కర్ స్కామ్‌లోనూ ఏ-5గా చేర్చారు. కాకినాడ సీపోర్టు కేసులో ఏ2గా చేర్చారు” అంటూ వివరించారు.
అదే సమయంలో సకల శాఖల మంత్రి పేరు మాత్రం ఇంతవరకు ఏ ఛార్జిషీట్‌లోనూ లేదని ఆయన గుర్తు చేశారు. “ఏ కేసులూ లేకుండా ఎలానో కోటరీ నాయకుడికి తెలిసినంత నాకు తెలియదు. పార్టీ మారేందుకు సిద్ధమైన ఉత్తరాంధ్ర నేతతో కలిసి కోటరీ నాయకుడు కుట్ర పన్నారు. నాపై అసత్యాలు చెప్పి ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారు. జగన్ మెప్పు కోసమే నాస్తికుడిగా చెప్పుకొన్న ఆయన వైఎస్సార్సీపీకే కాదు, రాష్ట్రానికే నమ్మకద్రోహి” అంటూ ధ్వజమెత్తారు.
“జగన్‌ని నేను రెండు సంవత్సరాలు నోరు తెరచి ఒక్క మాట మాట్లాడలేదు. కోటరీ కారణంగా నాకు జరిగిన అవమానాల కారణంగా బయటకు వచ్చా అని పదేపదే చెప్పాను. అయినా, అదే కోటరీ వారంతా, ఈ రోజు నేను పార్టీ పెడతానంటే నన్ను విమర్శిస్తున్నారు. నేను నేరుగా గెలిచేందుకే ప్రజాస్వామ్యబద్దంగా యుద్ధం చేస్తా, అంతే గాని అప్పట్లో ప్రభుత్వాన్ని, ఇప్పుడు పార్టీని కబ్జా చేసి జగన్‌ని రోజూ మోసం చేస్తూ కోవర్ట్ రాజకీయం చేయడం నాకు చేత కాదు” అని స్పష్టం చేశారు.
“ఇది విజయసాయి రెడ్డిగా నా మాట. జగన్ పెట్టుకున్న రెండు అంచల వ్యవస్థలో అనేక విషయాల్లో నా ఆత్మాభిమానం మీద కొడుతుంటే తట్టుకోలేకపోయాను. అంతకుముందు, మంగళగిరిలో 2022లో జరిగిన పార్టీ ప్లీనరీలో నేరుగా ఈ సకల శాఖ మంత్రి నా మీద డెరైక్టుగా, భౌతికంగా దాడి చేస్తే జగన్‌కి తెలిసి ప్రేక్షక పాత్ర వహించారు” అని విజయసాయిరెడ్డి లేఖలో రాశారు.
More Stories
`భిన్నత్వంలో ఏకత్వం’ రాజకీయ నినాదం కాదు.. భారతీయ డిఎన్ఏ!
ముఖ్యమంత్రులపై సానుకూలత.. ఎమ్యెల్యేలపై ఆగ్రహం!
ఎమ్యెల్సీ బేగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కోరిన బీజేపీ