తెలంగాణాలో మూడేళ్లలో 47 శాతం పెరిగిన నార్కోటిక్స్‌ కేసులు

తెలంగాణాలో మూడేళ్లలో 47 శాతం పెరిగిన నార్కోటిక్స్‌ కేసులు
తెలంగాణాలో గత మూడేళ్లల నార్కోటిక్స్‌ కేసులు ఏకంగా 47 శాతం పెరిగినట్లు అర్ధవార్షిక నేర గణాంకాల సమీక్షలో వెల్లడైంది. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో రాష్ట్రంలో నార్కోటిక్స్‌ కేసులు 2023-24లో 2,026 ఉండగా, 2025-26లో 2,960కి పెరిగాయి. కమిషనరేట్ల వారీగా చూస్తే సైబరాబాద్‌లో ఈ కేసులు 266 నుంచి 508కి చేరాయి. 
 
అంటే మూడేళ్లలో 90 శాతం పెరుగుదల నమోదైంది. వరంగల్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. అక్కడ నార్కోటిక్స్‌ కేసులు ఏకంగా 142 శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు. జిల్లాల విషయానికి వస్తే ఆదిలాబాద్‌లో కేసులు 57 నుంచి 219కి పెరిగాయి. అక్కడ క్రైం రేటు 7.2 శాతం నుంచి 26.9 శాతానికి చేరింది. నిజామాబాద్‌లో 62 నుంచి 123 కేసులకు పెరుగుదల నమోదైంది. 
 
నారాయణపేట, మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లోనూ మాదకద్రవ్యాల కేసులు గణనీయంగా పెరిగినట్లు సమీక్షలో వెల్లడైంది. మరోవైపు రాష్ట్రంలో మొత్తం నేరాలు మాత్రం 2023-24లో 2.6 లక్షల నుంచి 2025-26లో 2.8 లక్షలకు పెరిగాయి. అయితే హత్య, దోపిడీ, చోరీ వంటి తీవ్రమైన నేరాలు తగ్గుముఖం పట్టాయని పోలీసులు తెలిపారు. 
 
2024-25లో 7,019గా ఉన్న తీవ్రమైన నేరాలు 2025-26లో 6,294కు తగ్గాయి. అంటే 10.3 శాతం క్షీణత నమోదైందని వెల్లడించారు. ప్రధాన కమిషనరేట్లలో హైదరాబాద్‌లో తీవ్రమైన నేరాలు 1,483 నుంచి 1,094కి తగ్గి 26.2 శాతం క్షీణించాయి. సైబరాబాద్‌లో 656 నుంచి 613కి, మల్కాజిగిరిలో 664 నుంచి 549కి కేసులు తగ్గాయి. 
 
2023-24తో పోలిస్తే మహిళలపై నేరాలు మూడు శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడించాయి. అయితే ఫ్యూచర్‌ సిటీ మినహా ఇతర కమిషనరేట్లలో ఇటువంటి కేసులు తగ్గాయని పోలీసులు తెలిపారు.