సజ్జన్ కుమార్ ఇంటికి వెళ్లిన ముగ్గురు ఎంపీలకు బీజేపీ సమన్లు

సజ్జన్ కుమార్ ఇంటికి వెళ్లిన ముగ్గురు ఎంపీలకు బీజేపీ సమన్లు

1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలిన సజ్జన్ కుమార్ మరణం చుట్టూ అలుముకున్న వివాదాలు ఇప్పుడు రాజకీయంగా భిన్న ధృవాల్లో ఉన్న మరో ముగ్గురిని చిక్కుల్లో పడేశాయి. వివాదాస్పద వ్యక్తి అయిన సజ్జన్ కుమార్‌ను ప్రశంసించినందుకు కాంగ్రెస్ నేత దీపేందర్ హూడా తన పార్టీ సహచరుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కొద్ది రోజులకే, ఇప్పుడు ముగ్గురు బీజేపీ ఎంపీలు ఆయన ఇంటికి వెళ్లి సంతాపం తెలిపినందుకు విమర్శల పాలయ్యారు. 

సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తూ జైలులో మరణించిన సజ్జన్ కుమార్ ఇంటికి ముగ్గురు బీజేపీ ఎంపీలు వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు సజ్జన్‌ కుమార్‌ మరణం పట్ల సంతాపం తెలపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్  పార్టీ ఎంపీలకు సమన్లు జారీ చేశారు. వారి వెళ్లిఉండాల్సింది కాదని స్పష్టం చేస్తూ వారి సంజాయిషీ కోరినట్లు తెలుస్తున్నది.

1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న 80 ఏళ్ల సజ్జన్ కుమార్ పలు అనారోగ్య సమస్యల కారణంగా ఆగస్ట్‌ 20న జైలులో మరణించారు. సజ్జన్ కుమార్ అంత్యక్రియల తర్వాత నిర్వహించిన భోగ్ (పెద్దకర్మ) కార్యక్రమానికి ముగ్గురు బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. వారు పశ్చిమ ఢిల్లీ ఎంపీ కమల్‌జీత్ సెహ్రావత్, దక్షిణ ఢిల్లీ ఎంపీ.

ఈ ముగ్గురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు, గతంలో సజ్జన్ కుమార్ కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ‘అవుటర్ ఢిల్లీ’ పార్లమెంటరీ స్థానం నుండి విభజించినవే. పిరాగర్హిలోని సజ్జన్ కుమార్ నివాసానికి ఆ ఎంపీలు వెళ్లడాన్ని బహిరంగంగా ఖండించిన మొదటి వ్యక్తి పంజాబ్‌కు చెందిన సీనియర్ పార్టీ నాయకుడు హెచ్.ఎస్. ఫూల్కా. ఆయన చేసిన బలమైన అభ్యర్థన మేరకే బీజేపీ అధినేత ఈ చర్య తీసుకున్నారు.

“సామూహిక హంతకుడైన సజ్జన్ కుమార్ మరణం పట్ల సంతాపం తెలిపేందుకు కమల్‌జీత్ సెహ్రావత్, రామ్‌వీర్ సింగ్ బిధురి, యోగేందర్ చందోలియా అనే ముగ్గురు ఎంపీలు ఆయన నివాసానికి వెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను,” అని ఫూల్కా నిన్న పేర్కొన్నారు. ఫూల్కా ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజేపీలో చేరారు. సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులు న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి బీజేపీ ఎప్పుడూ అండగా నిలిచిందని, సజ్జన్ కుమార్ జైలులోనే ఉండేలా చూడటంలో బాధితుల కుటుంబాలకు మద్దతు ఇచ్చిందని గుర్తుచేస్తూ ఆ ఎంపీల చర్య ప్రత్యేకంగా ఖండించదగినదని ఆయన స్పష్టం చేశారు.

 “సానుభూతి అనేది బాధితులు, వారి కుటుంబాలకే దక్కాలి—వారిలో చాలామంది ఆ నాటి భయానక పరిస్థితుల జ్ఞాపకాలతో ఇప్పటికీ జీవిస్తున్నారు.  ఈ ముగ్గురు ఎంపీలను బహిష్కరించాలని నేను పిలుపునిస్తున్నాను,” అని పంజాబ్ అసెంబ్లీలో మాజీ ప్రతిపక్ష నాయకుడు అయిన ఫూల్కా తెలిపారు.  న్యాయం కోసం సాగిన సుదీర్ఘమైన, కఠినమైన పోరాటంలో, సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితుల కుటుంబాలకు ఫూల్కా చాలా కాలంగా న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు.

అయితే, ఆ ఎంపీలు వ్యక్తిగత హోదాలోనే సజ్జన్ కుమార్ ఇంటికి వెళ్లారని బీజేపీ తెలిపింది. “ఆ ముగ్గురు ఎంపీలు పార్టీ ప్రతినిధులుగా కాకుండా, తమ వ్యక్తిగత హోదాలో సజ్జన్ కుమార్ ఇంటికి వెళ్లారు,” అని బీజేపీ అధికార ప్రతినిధి ఆర్.పి. సింగ్ చెప్పారు. మరోవైపు ఢిల్లీకి చెందిన ఆప్‌ నేత సౌరభ్ భరద్వాజ్ దీనిపై స్పందిస్తూ అల్లర్ల కేసులో దోషిగా తేలిన వ్యక్తి పట్ల ఆ ముగ్గురు బీజేపీ ఎంపీల హృదయాలు ద్రవిస్తున్నాయని ఎక్స్‌ పోస్ట్‌లో ఎద్దేవా చేశారు.