తీవ్రమైన సామాజిక, ఆర్థిక సవాల్ గా ఉద్యోగార్హత వైరుధ్యం!

తీవ్రమైన సామాజిక, ఆర్థిక సవాల్ గా ఉద్యోగార్హత వైరుధ్యం!
ప్రొఫెసర్ పి. నారాయణరెడ్డి,  
మానేజ్మెంట్ నిపుణుడు, 
డైరెక్టర్ జనరల్, ఐసిబిఎం- స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్, హైదరాబాద్
భారతదేశంలో ఉద్యోగార్హత వైరుధ్యం ఒక తీవ్రమైన సామాజిక, ఆర్థిక సవాలుగా మారింది. తయారీ, సేవ, సాంకేతిక రంగాలలో పరిశ్రమలు నైపుణ్యం కలిగిన, పనికి సిద్ధంగా ఉన్న మానవ వనరుల కొరతను కుదుర్కొంటుంటే, మరోవైపు లక్షలాది మంది కళాశాల గ్రాడ్యుయేట్లు సరైన ఉపాధిని పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత విద్యాసంస్థలు ప్రధానం చేస్తున్న అధికారిక డిగ్రీల అర్హతలకు, ఆధునిక ఆర్ధిక వ్యవస్థ ఆశిస్తున్న ఆచరణాత్మక నైపుణ్యాలకు మధ్య పెరుగుతున్న తీవ్రమైన వ్యత్యాసాన్ని ఈ నిర్మాణాత్మక అసమతుల్యత స్పష్టంగా వెల్లడి చేస్తుంది. 

ఉద్యోగార్హత సంక్షోభం – క్షేత్రస్థాయి వాస్తవాలు

సాంప్రదాయ ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ డిగ్రీ ప్రోగ్రాంల వాస్తవ ప్రయోజనాన్ని ఆసిస్తూ విధాన రూపకర్తలు, ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన ఆందోళన భారత విద్యావ్యవస్థలో క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రతిబింబిస్తుంది. రాజకీయ కోణాలకు అతీతంగా, హేతుబద్దమైన సామాజిక, ఆర్థిక దృక్పథంలో చూస్తే నీటి ఆయోగ్ వంటి జాతీయ సంస్థలు నమోదు చేసిన డేటా ఈ పరిస్థితులను నిర్ధారిస్తుంది:

* నిష్క్రియాత్మకత, జనాభా ప్రయోజనం వృథా: సుమారు 8.7 కోట్ల మంది యువత విద్య, ఉద్యోగం లేదా నైపుణ్య శిక్షణ ఏదీ లేని వర్గంలో ఉన్నారు. ఇది దేశ జనాభా ప్రయోజనాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకో లేకపోవడాన్ని సూచిస్తుంది.

  • విద్యార్హతఉద్యోగతీవ్ర అసమతుల్యత: తాము చదివిన విద్య విభాగానికి నేరుగా సరిపోయే ఉద్యోగాలలో గ్రాడ్యుయేట్లలో కేవలం 8.5 శాతం మంది మాత్రమే స్థిరపడుతున్నారు.
  • కార్యాలయాలకుసంసిద్ధత లోపించడం: కళాశాల నుండి బయటకు వచ్చే గ్రాడ్యుయేట్లలో  దాదాపు 50 శాతం మంది ప్రాథమిక స్థాయి వృత్తి పరమైన బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా లేరని పరిశీలనలు స్పష్టం చేస్తున్నాయి.
  • ప్రారంభదశలోనే ఉద్యోగాల నిష్క్రక్రమణ: దాదాపు 52 శాతం మంది ప్రాధమికంగా ఉద్యోగాలు పొందుతున్నప్పటికీ, పనితీరు లోపాలు, అనుకూలత లేకపోవడం, సంస్థాగత అంచనాలలో వ్యత్యాసాల కారణంగా దాదాపు 45 శాతం మొదటి సంవత్సరంలోనే ఉద్యోగాలను వదిలివేయడం లేదా తొలగించడం జరుగుతుంది.
  • పట్టణనిరుద్యోగం: పట్టణ ప్రాంతాలలో యువత నిరుద్యోగ రేటు దాదాపు 16 శాతం వద్ద కొనసాగుతుంది. వాణిజ్య కేంద్రాలకు సమీపంలో ఉన్నప్పటికీ విపణి అవసరాలకు తగ్గ ప్రాథమిక నైపుణ్యాల కొరత తీరడంలేదని ఇది రుజువు చేస్తుంది.

వ్యవస్థాగత వైఫల్యానికి ప్రధాన మూలకారణాలు

అనియంత్రణ విస్తరణ, నాణ్యతలేని వాణిజ్య నమూనాలు, పురాతన విద్యా పద్ధతులు, పర్యవేక్షణ లోపాలే భారతదేశంలో ఉద్యోగార్హత సంక్షోభానికి ప్రధాన కారణాలు. 
1. విద్యాసంస్థల మితిమీరిన విస్తరణ: ప్రైవేట్ కళాశాలలు, సీట్ల సామర్థ్యాన్ని విచక్షణారహితంగా మంజూరు చేయడం. దానితో పరిశ్రమలలో తగిన డిమాండ్ లేకుండానే సాధారణ డిగ్రీ కలిగిన వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. 
2. విద్య వాణిజ్యకరణ: తక్కువ ఖర్చుతో, ఆదాయాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకొని నడిచే ప్రైవేట్ విద్యనమూనాలు కారణంగా తక్కువ వేతనాలతో అర్హతలేని తాత్కాలిక బోధనాసిబ్బందిపై ఆధారపడాల్సి వస్తుంది. 
3. పురాతన బోధనావిధానం: సామాజిక స్పృహతో సంబంధం లేకుండా కేవలం బట్టీ పద్దతికే ప్రాధాన్యత ఇవ్వడం కారణంగా సమస్యల పరిష్కార సామర్థ్యం, విశేషణం శక్తీ, ఆచరణాత్మక నైపుణ్యాలు కొరవడుతున్నాయి. 
4. ఉదార మూల్యాంకణం & బలహీన పర్యవేక్షణ: ప్రమాణాలు పాటించకుండా అధిక గ్రేడ్లు ఇవ్వడంతో మార్కులు, గ్రేడ్లు అధికంగా ఉన్నప్పటికీ వాస్తవ పనితీరులో తీవ్ర లోపాలు కనిపిస్తున్నాయి. 

డిమాండ్ – సరఫరా మధ్య నిర్మాణాత్మక అసమతుల్యత

ఒక గణాంక అసమానత ఈ సంక్షోభాన్ని మరింత పెంచుతుంది.  పరిశ్రమలలో ఉద్యోగావకాశాలు స్వల్పంగా మాత్రమే పెరుగుతుండగా, కళాశాలల నుండి విద్యార్థుల సరఫరా మాత్రం ఉప్పెన మాదిరిగా భారీ స్థాయిలో పెరుగుతోంది. 
 
విద్యాసంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచినప్పటికే, ఇంత భారీ సంఖ్యలో ఉన్న డిగ్రీలు పొందుతున్న వారిని కేవలం కార్పొరేట్ రంగం మాత్రమే పూర్తిగా గ్రహించలేదు. అందువల్ల ఉద్యోగార్హత నైపుణ్యాలను పెంచడంతో పాటు స్వయం ఉపాధి, వ్యవస్థాపకత, వృత్తి నైపుణ్యాలను సమాంతరంగా ప్రోత్సహించడం ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. 

భవిష్యత్ శ్రామిక శక్తికి అవసరమైన 4 ప్రధాన నైపుణ్య స్తంభాలు

మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిలబడేందుకు యువత నాలుగు ప్రధాన రంగాలలో పట్టు సాధించాల్సి ఉంది:
 
1. సాంకేతిక, విషయం పరిజ్ఞానం: ఇంజనీరింగ్, సైన్స్ లేదా బిజినెస్ ప్రాధమిక సూత్రాలపై గట్టి పట్టుతో పాటు ఆధునిక డిజిటల్ టూల్స్,  సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆచరణాత్మక విధానాలపై పూర్తి నైపుణ్యం 
2. విజ్ఞాన, విశ్లేషణ నైపుణ్యాలు: విమర్శనాత్మక ఆలోచన, డేటా విశేషణం, సంక్లిష్ట సమస్యల గుర్తింపు, అనిశ్చిత పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం 
3. వ్యక్తుల మధ్య సంబంధాలు, కమ్యూనికేషన్: స్పష్టమైన మౌఖిత, లిఖితపూర్వక వ్యక్తీకరణ, సానుభూతితో వినడం, సమిష్టిగా పనిచేయడం, విభాగాల మధ్య సమన్వయం.
4. అనుకూలత, నేర్చుకునే వేగం: మారుతున్న పని వాతావరణాలకు త్వరగా అలవాటు పడటం, నిరంతరం కొత్త ఆశయాలను నేర్చుకొనే తపన, మానసిక సంసిద్ధత 

వ్యూహాత్మక మార్గసూచి: తరగతి గది నుండి ఆర్థిక విలువ సృష్టి వరకు

భారత విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడానికి విధానాలు, విద్యాసంస్థలు, అధ్యాపకులు, విద్యార్థుల స్థాయిలో సమన్వయ సంస్కరణలు అవసరం. 
1. సంస్థాగత, బోధనా పునర్నిర్మాణం
* ఆచరణాత్మక, ప్రయోగాత్మక బోధన:  కేవలం ఉపన్యాసాలకు పరిమితం కాకుండా ప్రాజెక్ట్ ఆధారిత విద్య, కేస్-స్టడీలు, సిమ్యులేషన్ ల్యాబ్ లు, తప్పనిసరి ఇండస్ట్రీ ఇంటర్న్ షిప్ లను అమలు చేయడం. 
*  పాఠ్యాంశాల ఆధునీకరణ: అంతర్జాతీయ వ్యాపార పద్ధతులు, సరికొత్త సాంకేతిక మార్పులు, స్థానిక సామజిక- ఆర్ధిక వాస్తవాలకు అనుగుణంగా పరిశ్రమల భాగస్వామ్యంతో సిలబస్ ను నిరంతరం సవరించడం.
* జాతీయ విద్యావిధానం (ఎన్ఈపి) అమలు: బహుళ విభాగాల విద్య, ముందస్తు వృత్తి శిక్షణ, అకడమిక్ బ్యాంకు అఫ్  క్రెడిట్స్ (ఏబీసీ) వంటి ఎన్ఈపి మార్గదర్శకాలను సద్వినియోగం చేసుకోవడం.
2. అధ్యాపకుల నాణ్యత,  జవాబుదారీతనం 
* అర్హులైన అధ్యాపకుల నియామకం: తాత్కాలిక, తక్కువ వేతనాల నియామక పద్దతులను విడనాడి, ఆకర్షణీయమైన వేతనాలు, పరిశోధనలకు మద్దతు ఇచ్చే శాశ్వత కెరీర్ అవకాశాలను కల్పించడం. 
* నిరంతర నైపుణ్యాభివృద్ధి: అధ్యాపకులకు ఆధునిక డిజిటల్ బోధనా పద్ధతులు, ప్రయోగాత్మక కోర్స్ రూపకల్పన, పరిశ్రమ ప్రమాణాలపై నిరంతర శిక్షణ అందించడం. 
* ఫలితాల ఆధారిత గుర్తిపు: కళాశాలల అనుమతులు, సీట్ల కేటాయింపు, ఫీజు రాయితీలను విద్యార్థుల వాస్తవ అధ్యయన ఫలితాలు, ఉద్యోగ నియామకాల నాణ్యతతో ముడిపెట్టడం. 
 
3. సమగ్ర మూల్యాంకన విధానం 
* నైతిక విలువలు, దృక్పధం, ఆచరణాత్మక పరీక్ష: కేవలం రాత పరీక్షలకు పరిమితం కాకుండా నైతిక విలువల తీరు, బృంద పనితీరు, ఆచరణాత్మక నైపుణ్యాలను పరీక్షించే విధంగా మూల్యాంకనాన్ని తీర్చిదిద్దడం. 
* గ్రేడ్ల ద్రవ్యోల్భవాన్ని అరికట్టడం: డిగ్రీల విశ్వసనీయతను పునరుద్దరించడానికి స్పష్టమైన ప్రమాణాలతో కూడిన ప్రామాణిక మూల్యాంకనాన్ని అమలు చేయడం. 
 
4. వ్యవస్థాపకత, వృత్తి విద్యాశిక్షణ 
* పాఠశాల స్థాయి నుంచే అవగాహన: ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల స్థాయి నుంచే వ్యాపార ఆలోచనలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు, వృత్తి పరిజ్ఞానాన్ని పాఠ్యాంశాల్లో  చేర్చడం.
* వృత్తి విద్యకు గౌరవం: చేతి వృత్తులు, సాంకేతిక సమస్యల పట్ల ఉన్న చిన్న చూపును తొలగిస్తూ, ప్రాంతీయ వ్యాపార అవసరాలకు అనుగుణంగా పటిష్టమైన వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాలను రూపొందించడం. 
* ఇంక్యుబేషన్, విలువ సృష్టి: విద్యార్థులు కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారుగా మాత్రమే కాకుండా, స్వయంగా వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉదోయగాలు సృష్టించే విధంగా కళాశాలల్లో  స్టార్టప్ ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం. 
5. విద్యార్థుల  స్వీయ బాధ్యత, సామాజిక స్పృహ 
* స్వీయ అభ్యసనం: విద్యార్థులు స్వయంగా డిజిటల్  పోర్ట్‌ఫోలియోలు రూపొందించుకోవడం, సరికొత్త ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా నైపుణ్యాభివృద్ధికి తామే బాధ్యత వహించడం. 
* సామాజిక స్పృహ, వృత్తిపరమైన నైతికత: సమాజంలో అనుసంధానం, పౌర బాధ్యత, నైతిక నిబద్ధతను విద్యార్థులలో పెంపొందించడం ద్వారా సరైన నైపుణ్యాలను, సానుకూల దృక్పథం కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడం.