కొండా సురేఖ, చిన్నారెడ్డిలను పదవుల నుండి తప్పించండి 

కొండా సురేఖ, చిన్నారెడ్డిలను పదవుల నుండి తప్పించండి 

మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిలను  వారి పదవుల నుంచి తొలగించాలని ఏఐసీసీకీ పీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ పూర్తి స్థాయి నివేదికను పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌గౌడ్‌కు అందించింది. పార్టీ గీతను దాటి వ్యవహరించిన నేతలపై చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నట్లు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ మల్లు రవి తెలిపారు.

క్రమశిక్షణా కమిటీ గత నాలుగు రోజులుగా ఈ ఇద్దరిపై ఇచ్చిన విజ్ఞప్తులతో పాటు, ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా నిశితంగా పరిశీలించింది. షోకాజ్‌ నోటీసులకు అటు కొండా సురేఖ, ఇటు చిన్నారెడ్డి ఇచ్చిన వివరణలను కూడా ఒకటికి రెండుసార్లు అధ్యయనం చేసింది. ఇందులో ప్రధానంగా పార్టీ గీత దాటిన ఆ ఇద్దరినీ పదవుల నుంచి తొలగించాలని సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.

వారు ఇచ్చిన నివేదికల కాపీలను మహేశ్‌గౌడ్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు పంపించారు. ఆ నివేదికలకు మీనాక్షి, మహేశ్‌గౌడ్‌ తమ సూచనల్నీ జోడించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు పంపనున్నారు. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుశ్మిత పటేల్ పార్టీ నియమావళిని దాటి మాట్లాడడం మొదటిసారి కాదని పేర్కొంది. 

గతంలో రెండుసార్లు ఇదే తీరుగా మాట్లాడారని, మూడోసారి కూడా ఇదే రీతిలో కొండా సురేఖ కుటుంబం వ్యవహరించినట్లు పేర్కొంది. ఇప్పటికీ ఉపేక్షిస్తే పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించి, భవిష్యత్తులో పార్టీకి నష్టం వాటిల్లకుండా చూడాలని సూచించినట్లు క్రమశిక్షణ కమిటీ సూచించినట్లు సమాచారం.

తాజాగా సీఎం రేవంత్‌రెడ్డిపై, ఆయన సోదరులపై సుస్మితా పటేల్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తే దానికి వివరణ ఇవ్వాల్సిందిగా కొండా సురేఖకు షోకాజ్‌ నోటీసులు పంపినట్లు తెలిపింది. అయితే సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, తనకు సంబంధం లేని అంశంపై వివరణ కోరడం సరికాదంటూ సురేఖ వివరణ ఇచ్చారని పేర్కొంది. క్యాబినెట్‌ మంత్రి అయివుండీ సీఎం రేవంత్‌రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలను సురేఖ కనీసం ఖండించలేదని తెలిపింది.

సీనియర్‌ నేత చిన్నారెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వకపోయినా.. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి, ప్రజావాణి బాధ్యతలను ఇచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం గౌరవించిందని క్రమశిక్షణ కమిటీ గుర్తు చేసింది. కానీ, ఆయన వనపర్తి నియోజకవర్గంలో సొంత పార్టీ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసి క్రమశిక్షణను ఉల్లంఘించారని తెలిపింది. ఈ నేపథ్యంలో చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి, ప్రజావాణి బాధ్యతల నుంచి తప్పించాలని సూచించింది.