పాకిస్థాన్ అనుకూల వ్యక్తి, భారత్‌కు, హిందూ వ్యతిరేకి అయిన న్యూయార్క్ మేయర్ మమ్దానీని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఎందుకు కలవాలనుకున్నారో చెప్పాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రశ్నించా రు. దీనిపై ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా స్పందించి వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తన అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకున్నదని, ఇది రాష్ట్రానికి అవమానమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమైనవని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి స్థాయి వ్యక్తులు అన్ని అనుమతులు తీసుకున్నాకే విదేశీ పర్యటన ఖరారు చేసుకుంటారని, అయితే ఆదరబాదరాగా లండన్ వెళ్లి అక్కడి నుంచి రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లాలనుకున్నారని ఆయన తెలిపారు. విదేశాలకు వెళ్లక ముందే మీ స్థాయికి తగ్గట్టు విదేశీ పర్యటన లేదని, అందుకే అనుమతులు ఇవ్వట్లేదని విదేశాంగ శాఖ స్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ప్రధాని మోదీని టెర్రరిస్ట్ అని న్యూయార్క్ మేయర్ వ్యాఖ్యనించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుని, అధికారులతో చర్చించి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంది కానీ, రేవంత్ రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఈ నెపాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. విదేశీ పర్యటనల విషయంలో విదేశాంగ శాఖ నిబంధనలు ప్రధాని నరేంద్ర మోదీ ఖరారు చేసినవి కాదని, స్వాతంత్య్రం వచ్చినపటి నుంచి ఈ నిబంధనలు అమలులో ఉన్నాయని ఆయన వివరించారు.
2005లో యుపిఏ అధికారంలో ఉన్నప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్న నరేంద్ర మోదీ అమరికా వెళ్లకుండా అనుమతులు ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది జనవరిలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వెళ్లేందుకు రేవంత్ రెడ్డికి అనుమతులు ఇచ్చిన విషయాన్ని ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. అంతకుముందు తెలంగాణ మూసీ అభివృద్ధి కోసం లండన్ వెళ్లేందుకు, తాజాగా లండన్ వెళ్లేందుకు కూడా అనుమతులివ్వడం జరిగిందని పేర్కొన్నారు.
సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అమెరికా పర్యటన విషయంలో ఆయన స్పష్టత ఇవ్వకుండా ఇలా మాట్లాడటం సరికాదని హితవు చెప్పారు. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పర్యటనలకు నిరాకరించిందని పేర్కొంటూ ఇదంతా సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమేనని, ఇదేమీ రాజకీయ అంశం కాదని ఆయన చెప్పారు.
ఈ విషయంలో కేంద్రంపై మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదని, తన స్థాయి తగ్గించుకొని ఇలా మాట్లాడటం భావ్యం కాదని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Stories
ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్’ కు డాక్టర్ వైఎస్.అవార్డు – 2026
కొండా సురేఖ, చిన్నారెడ్డిలను పదవుల నుండి తప్పించండి
నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం..11 మంది అరెస్ట్!