ఆర్ఎస్ఎస్ పై ఆంక్షలు.. అమెరికా కమిషన్ పిలుపుపై భారత్ ఆగ్రహం

ఆర్ఎస్ఎస్ పై ఆంక్షలు.. అమెరికా కమిషన్ పిలుపుపై భారత్ ఆగ్రహం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై ఆంక్షలు విధించాలని మత స్వేచ్ఛపై అమెరికా సలహా మండలి అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్) ఇచ్చిన పిలుపును, భారతదేశం తోసిపుచ్చింది. దానిని ఒక “పక్షపాత” సంస్థగా అభివర్ణించింది. “మీరు ప్రస్తావిస్తున్న సంస్థ—లేదా విభాగం—పక్షపాతంతో ఉందని మా అందరికీ తెలుసు,” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ధ్వజమెత్తారు.
 
సంవత్సరాలుగా యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ “భారతదేశం గురించి అవమానకరమైన,  రెచ్చగొట్టే వ్యాఖ్యలు” చేస్తోందని, అటువంటి బృందాలు “తమ సొంత అజెండాలతో, విశ్వసనీయత లేదా నమ్మకత్వం లేకుండా” పనిచేస్తాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ వాటికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ఆర్ఆర్ఎస్ లో సభ్యుడని, అది ఒక గొడుగు సంస్థ అని, దాని ఉప-బృందాలు మత మైనారిటీలపై దాడులకు పాల్పడ్డాయని అమెరికా సలహా మండలి ఛైర్‌పర్సన్ ఆసిఫ్ మహమూద్ గత నెలలో అభివర్ణించారు. 
 
“భారత ప్రధాని మోదీ, ఆర్ఆర్ఎస్ లో సభ్యుడు. ఇది ఒక భారతీయ గొడుగు సంస్థ, దీని ఉప-విభాగాలు క్రైస్తవులు, ముస్లింలతో సహా మతపరమైన మైనారిటీలపై దాడులకు పాల్పడ్డాయి. ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు మోహన్ భగవత్ అమెరికా పర్యటనకు ప్రణాళిక వేస్తున్నారు,” అని మహమూద్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యను  యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. 
 
ఆగస్టు 29న న్యూయార్క్‌లో అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అండ్ డైలాగ్ (ఎహెడ్) నిర్వహించే ‘యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్స్’లో పాల్గొనేందుకు ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం భారత ప్రభుత్వంతో అనుబంధం కలిగి ఉన్నప్పటికీ, ఆ మితవాద సంస్థ నాయకులను ఉన్నత స్థాయి సమావేశాలతో లేదా దౌత్య మర్యాదలతో గౌరవించకూడదని   యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ కమిషనర్ జీన్ మిల్స్ కూడా విమర్శించారు. 
 
“దానికి బదులుగా, మత విశ్వాస స్వేచ్ఛఉల్లంఘనలకు బాధ్యులుగా తేలిన ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులపై ఆంక్షలు విధించడంపై అమెరికా ప్రభుత్వం దృష్టి పెట్టాలి,” అని మిల్స్ కోరారు. ఇంతకుముందు, మార్చిలో, యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ వార్షిక నివేదిక మత స్వేచ్ఛ ఉల్లంఘనల ఆరోపణలపై భారతదేశాన్ని విమర్శించింది.
 
ఈ విషయానికి ఆర్‌ఎస్‌ఎస్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వంటి వ్యక్తులు, సంస్థలను బాధ్యులుగా పేర్కొంటూ, వారిపై “లక్షిత ఆంక్షలకు” మద్దతు తెలిపింది. ఆ సంస్థ “సందేహాస్పదమైన ఆధారాలు,  సైద్ధాంతిక కథనాల”పై ఆధారపడి, దేశపు “వక్రీకరించిన, పక్షపాత” చిత్రాన్ని నిరంతరం ప్రదర్శిస్తోందని పేర్కొంటూ, యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ నివేదికను భారతదేశం తిరస్కరించింది.