మయన్మార్‌లోని బౌద్ధ ఆశ్రమంపై వైమానిక దాడి.. 14 మంది మృతి

మయన్మార్‌లోని బౌద్ధ ఆశ్రమంపై వైమానిక దాడి.. 14 మంది మృతి
మయన్మార్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మయన్మార్ మధ్య సగైంగ్‌ ప్రాంతంలోని ఓ బౌద్ధ ఆశ్రమంపై సైన్యం వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 14మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది గాయపడినట్లు సమాచారం. మఠంలో వారం రోజుల ధ్యాన శిబిరంలో పాల్గొంటున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు స్థానికుడు ఒకరు తెలిపారు. ప్రభుత్వమే ఈ దారుణానికి తెగబడినట్టు ప్రతిపక్ష సమూహం ఆరోపిస్తోంది. 
 
మయన్మార్‌లో రెండో అతిపెద్ద నగరం మాండలేకు పశ్చిమాన 75 కిలోమీటర్ల దూరంలోని మ్యాంగ్ టౌన్‌షిప్‌ స్వెల్ లే ఓహ్ గ్రామంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ఈ దాడి జరిగినట్టు మ్యాంగ్ టౌన్‌షిప్ సివిల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ (సిడిఎస్ఓఎం) ప్రతినిధి న్వే వూ తెలిపారు. గ్రామంలోని ధ్యాన కేంద్రం ఆవరణలో ఒక యుద్ధ విమానం బాంబు వేయడంతో ముగ్గురు మహిళలు సహా 14 మంది మృతిచెందారని, మరో 20 మంది గాయపడ్డారని న్వే వూ పేర్కొన్నారు. 
 
అలాగే ఘటన గురించి తమ పేర్లను వెల్లడించని స్థానికులు కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే రెండు బాంబులను జారవిడిచినట్టు తెలిపారు. రెండో బాంబు చాతుర్మాస సమయంలో వారం రోజుల పాటు ధ్యానం చేస్తున్న 100 మందికి పైగా ఉన్న మఠం సమీపంలోని ఒక ఇంటిని ధ్వంసం చేసింది. ఈ ఘటనలో మరణించిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. కాగా, సాయుధ ప్రజాస్వామ్య అనుకూల బలగాలు, సాయుధ బృందాలను లక్ష్యంగా చేసుకుని వరుసగా జరుగుతున్న వైమానిక దాడుల్లో తాజాది.   
 
మయన్మార్‌లో మిలిటరీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని పోరాడుతున్న సాయుధ బలగాలను, ఇతర తిరుగుబాటు సమూహాలను అణచివేసేందుకు సైన్యం క్రమం తప్పకుండా ఇలాంటి వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఈ తరహా దాడుల్లో సైనికుల కంటే ఎక్కువగా బౌద్ధ భిక్షువులు, మహిళలు, పిల్లలు, సాధారణ పౌరులే బలవుతున్నారు. మఠాలపై కూడా దాడులు జరపడం సైన్యం అమానుషత్వానికి అద్దం పడుతోందని  ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

మరోవైపు మయన్మార్‌లో సైన్యం సాధారణ పౌరుల్ని కావాలనే లక్ష్యంగా చేసుకొని వరుస దాడులకు తెగబడుతోందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం నియమించిన ఒక దర్యాప్తు సంస్థ నివేదించింది. 2025 జులై నుంచి 2026 జూన్ వరకు జరిగిన పరిణామాలపై ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ మెకానిజం ఫర్ మయన్మార్‌ (ఐఐఎంఎం) గత మంగళవారం తన వార్షిక నివేదికను విడుదల చేసింది. 
 
ప్రజల ఇళ్లు, పాఠశాలలు, నిరాశ్రయుల క్యాంపులు, ఆస్పత్రులపై సైన్యం వైమానిక దాడులు చేస్తోందని, చిన్నారులు ఎక్కువగా బాధితులుగా మారుతున్నారని ఐఐఎంఎం హెడ్ నికోలస్ కుమ్‌జియాన్ ఆందోళన వ్యక్తం చేశారు. చట్టానికి విరుద్ధంగా నిర్బంధాలు, చిత్రహింసలు, లైంగిక హింసకూ మిలిటరీ పాల్పడుతోందని ఆరోపించారు.