2008, నవంబర్ 26న జరిగిన 26/11 ముంబయి ఉగ్రదాడుల కేసులో ఈ దాడుల వెనుక మాస్టర్మైండ్లుగా నిషేధిత లష్కరే తోయిబా (ఎల్ఈటి) వ్యవస్థాపకులు హఫీజ్ సయీద్, జకీవుర్ రెహమాన్ లఖ్వీ సహా మొత్తం ఆరుగురు ప్రధాన నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా చేసేందుకు ముందడుగు పడింది. ఆ పరారీలో ఉన్న నిందితులపై కోర్టు జారీ చేసిన ప్రకటన ఉత్తర్వుల్ని అందజేసేందుకు ముంబయి పోలీసులు చర్యలు వేగవంతం చేశారు.
పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఈ ఉగ్రవాదులకు ఇంటర్‌పోల్ ద్వారా నోటీసుల్ని జారీ చేయాలని ముంబయి పోలీసులు తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖను (ఎంహెచ్ఏ) అభ్యర్థించారు. నిందితులు కోర్టుకు హాజరుకాకపోయినప్పటికీ, వారి గైర్హాజరీలోనే విచారణ జరిపి శిక్ష ఖరారు చేయడంలో వారికి నోటీసులు అందడం కీలకం. ట్రయల్ ఇన్ ఆబ్సెంటియా విధానంలో నిందితులపై విచారణ నిర్వహించే ప్రక్రియలో భాగంగానే జులైలో కోర్టు ప్రొక్లమేషన్ ఆదేశాలు జారీ చేసింది.
ఆ ఆదేశాల్ని నిందితులకు అందించేందుకే ఇప్పుడు అవసరమైన చర్యల్ని తీసుకోవాలని ముంబయి పోలీసులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆశ్రయించారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ శుక్రవారం ఉగ్రవాద కేసుల్ని విచారిస్తున్న ప్రత్యేక కోర్టుకు ఈ విషయంపై మధ్యంతర నివేదిక సమర్పించారు.
పాకిస్థాన్‌లో నివసిస్తున్న నిందితులకు ఇంటర్‌పోల్ ద్వారా కోర్టు ప్రొక్లమేషన్ ఆదేశాలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎంహెచ్ఏకు లేఖ రాసినట్లు నికమ్ తెలిపారు. ఆగస్ట్ 3న తమ అభ్యర్థనను కేంద్ర హోం శాఖ స్వీకరించిందని, దీనిపై ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన రిపోర్ట్ సమర్పించేందుకు మరింత సమయం కోరిందని ఆయన వెల్లడించారు.
ఈ కేసులో హఫీజ్ సయీద్, జకీవుర్ రెహమాన్ లఖ్వీ, సాజిద్ మీర్, అబు అల్కామా, అసిమ్ అలియాస్ అబు ఖహాఫా, మేజర్ అబ్దుర్ రెహ్మాన్ పాషాలను నిందితులుగా పేర్కొన్నారు. వీరంతా పాకిస్థాన్ జాతీయులేనని తెలిపారు. ఈ ఆరుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నప్పటికీ, వారి గైర్హాజరీలోనే విచారణ నిర్వహించేందుకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బిఎన్ఎస్ఎస్), 2023 లోని సెక్షన్ 356 కీలకంగా మారింది.
విచారణను తప్పించుకునేందుకు పరారైన లేదా వెంటనే అరెస్ట్ చేసే అవకాశం లేని ప్రకటిత నేరస్థులపై వారి గైర్హాజరీలో పూర్తి స్థాయిలో క్రిమినల్ ట్రయల్ నిర్వహించేందుకు ఈ నిబంధన అవకాశం కల్పిస్తోంది. 26/11 దాడుల కుట్ర, ప్రణాళికలో ఈ నిందితుల పాత్రను దాడుల అనంతరం పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్, అలాగే నిందితుడిగా ఉండి తర్వాత అప్రూవర్‌గా మారిన ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ వెల్లడించినట్లు కేసు దర్యాప్తులో పేర్కొన్నారు. కసబ్, హెడ్లీ వాంగ్మూలాల ఆధారంగానే హఫీజ్ సయీద్, లఖ్వీల పాత్ర స్పష్టంగా బయటపడింది.

More Stories
ఝార్ఖండ్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి.. నిరసనకారుల ఆగ్రహం
పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ మెరుపు ధర్నా.. నడ్డా ఆగ్రహం
సీజేపీ కార్యకర్తలను తరిమి కొట్టిన గ్రామస్థులు