* ఆయన హోదాకు, పర్యటన ఉద్దేశ్యానికి తగ్గట్లు లేదని విదేశాంగ శాఖ స్పష్టం
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతిని నిరాకరించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) శుక్రవారం స్పష్టం చేసింది. ఆయన హోదాకు, పర్యటన ఉద్దేశానికి ఆ కార్యక్రమ ప్రణాళిక తగినట్లుగా లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ నెల 30 వరకు బ్రిటన్, అమెరికాలో ముఖ్యమంత్రి పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతిని కోరింది. లండన్ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో గురువారం అక్కడకు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఎల్లుండి అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లాల్సి ఉంది.
ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎంఈఏ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, “ముఖ్యమంత్రులు లేదా ఇతర ప్రముఖుల పర్యటనలకు రాజకీయ అనుమతి ఇచ్చే ముందు విదేశీ వ్యవహారాల శాఖ వాటిని పరిశీలిస్తుంది. అటువంటి సందర్భాల్లో ప్రతిపాదించిన కార్యక్రమం, వారి పదవికి, పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా ఉండాలి. ఈ నిర్దిష్ట సందర్భంలో, అమెరికా పర్యటన విషయంలో ఆ నిబంధన పాటించటంలేదు. అందుకే అనుమతి నిరాకరించడం జరిగింది. అయితే, ఆయన యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటనకు మాత్రం అనుమతి లభించింది,” అని తెలిపారు.
దీనివల్ల, ముఖ్యమంత్రి తన రెండు దేశాల పర్యటనలో అమెరికా పర్యటన భాగాన్ని రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం యుకెలో ఉన్న రేవంత్ రెడ్డి, తన పర్యటనను కుదించుకుని, బోస్టన్‌కు వెళ్లే బదులు ఆదివారం లండన్ నుండి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, ‘తెలంగాణ రైజింగ్’ అధికారిక బృందం ఇప్పటికే యుకెచేరుకున్న తర్వాత కేంద్రం అనుమతి నిరాకరించడంతో, అమెరికా పర్యటన ప్రణాళికను విరమించుకోవాల్సి వచ్చింది.
ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం యుకె, అమెరికా పర్యటనలకు అనుమతి కోరగా, కేవలం యుకె పర్యటనకు మాత్రమే ఆమోదం లభించింది. హార్వర్డ్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి), నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి అగ్రశ్రేణి విద్యాసంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా జాతీయ విద్యా విధానం స్ఫూర్తితో విద్య, నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకోవడం, అలాగే ఆయా సంస్థల నైపుణ్యాన్ని తెలంగాణ యువత ప్రయోజనం కోసం రాష్ట్రానికి తీసుకురావడమే ఈ అమెరికా పర్యటన ముఖ్య ఉద్దేశమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
“దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు విషయానికి వస్తే, మనమందరం రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా ఆలోచించాలని నేను ఎప్పుడూ నమ్ముతాను,” అని ఆయన వ్యాఖ్యానించారు. దీనిని “రాజకీయ కారణాలతో నిరాకరించిన అనుమతి”గా అభివర్ణిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినప్పటికీ, కేంద్రం నిర్ణయాన్ని పాటిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.
యుకెలో, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులతో ముందుగా నిర్ణయించిన సమావేశాలను రేవంత్ రెడ్డి కొనసాగిస్తారు. అలాగే, తెలంగాణతో భాగస్వామ్యాలను ఖరారు చేసుకునేందుకు ప్రముఖ క్రీడా, నైపుణ్యాభివృద్ధి సంస్థల ప్రతినిధులను కూడా ఆయన కలవనున్నారు.
“చాలా మంది నాయకులు తమ పిల్లలను విదేశాలకు పంపాలని కోరుకుంటుండగా, నేను ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభను భారతదేశానికి తీసుకురావాలనుకుంటున్నాను. అందుకే, ఏ సామాన్య భారతీయుడైనా హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్, లేదా ఎంఐటి, ఎల్‌బిఎస్ లేదా ఎల్‌ఎస్‌ఇ వంటి సంస్థల నుండి విద్య, సర్టిఫికేట్లు పొందగలిగేలా హైదరాబాద్‌ను అగ్రశ్రేణి ప్రపంచ నగరాలలో ఒకటిగా తీర్చిదిద్దాలనేది నా సంకల్పం, కృషి” అని ముఖ్యమంత్రి తెలిపారు.
అయితే, ప్రతిపాదిత అమెరికా కార్యక్రమాన్ని కొనసాగించాలని, అలాగే ప్రణాళికాబద్ధమైన అవగాహన ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన ప్రతినిధి బృందంతో పాటు వచ్చిన అధికారులను ఆదేశించారు.

More Stories
దేశ నిర్మాణంలో యువత పాత్రపై ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో విస్తృతంగా చర్చ
పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ మెరుపు ధర్నా.. నడ్డా ఆగ్రహం
అలనాటి ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత