రాష్ట్రంలో 22ఏ పేరుతో ప్రైవేట్ పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడం, పేదలు, దళితుల భూములను లాక్కోవడం, వేల కోట్ల రూపాయల విలువైన భూముల అక్రమ బదలాయింపులు, క్విడ్ ప్రో కో లావాదేవీలు, కమిషన్ల దందాపై బహిరంగంగా చర్చిద్దామంటే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భయపడి తప్పించుకున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
మంత్రిపై చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన పూర్తి ఆధారాలతో గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎదురుచూసినా పొంగులేటి చర్చకు రాకుండా ఎందుకు తప్పించుకున్నారని నిలదీశారు. బిజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆధారాలతో వచ్చారని తెలిసి, తన అక్రమాలు బయటపడతాయనే భయంతోనే పొంగులేటి చర్చకు రాకుండా తప్పించుకున్నారని ఆరోపించారు.
ప్రజాస్వామ్యంపై నమ్మకం, గౌరవం ఉంటే పొంగులేటి బహిరంగ చర్చకు వచ్చేవారని, తప్పు చేయకపోతే ఆధారాలతో సమాధానం చెప్పేవారని అన్నారు. అయితే తప్పు చేసారు కాబట్టే చర్చకు రాకుండా పారిపోయారని విమర్శించారు. ఆయన రాకపోవడం ప్రజాస్వామ్యంపై ఆయనకు నమ్మకం లేదని నిరూపిస్తోందని విమర్పించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 300ఏ ప్రజలకు ఆస్తి హక్కును కల్పిస్తుంటే, ‘కంచే చేనును మేసినట్లు‘ ప్రభుత్వమే ప్రజల భూములను మింగేస్తోందని మండిపడ్డారు.
భూభారతిని ‘భూహారతి‘గా మార్చారని, గత ప్రభుత్వ హయాంలో ధరణి పేరుతో లక్షల ఎకరాలను దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పేరుతో అదే దోపిడీని కొనసాగిస్తోందని ఆరోపించారు. తన శాఖలో జరిగిన తప్పులకు చిన్న ఉద్యోగులను బలిపశువులుగా మార్చకుండా పొంగులేటి స్వయంగా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలతో సమాధానం చెప్పలేకపోతే వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కోమటిరెడ్డివ్యాఖ్యలపై పొంగులేటి వివరణ ఇవ్వాలి
ఏ భూమి ఎవరి నుంచి ఎవరికి బదిలీ అయింది? వాటి ద్వారా లబ్ధి పొందిన సంస్థలేవి? 22ఏ జాబితా నుంచి భూములను తొలగించేందుకు వసూలు చేస్తున్న కమీషన్ ఎంత? మంత్రి అయిన తర్వాత పొంగులేటి ఆస్తులు ఎన్ని రెట్లు పెరిగాయి? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఏలేటి డిమాండ్ చేశారు. ఈ భూ వ్యవహారాల వెనుక కుట్ర ఉందని స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా పొంగులేటి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పీనిక్స్ సంస్థ నుంచి సుమారు రూ.15 వేల కోట్ల విలువైన ఆస్తులు పొంగులేటికి సంబందించిన సంస్థలకు బదిలీ అయ్యాయని ఆరోపిస్తూ – ఈ బదలాయింపుల వెనుక మతలబేంటి? ఇది క్విడ్ ప్రో నా? లేక బ్లాక్ మెయిలా?‘ అని ప్రశ్నించారు. ‘సారీ‘ చెప్పి చేతులు దులుపుకొని బాధ్యత నుంచి తప్పించుకోవడం కుదరదని స్పష్టం చేశారు.
“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ పొంగులేటి అవినీతి చిట్టాను సిబిఐ, ఇడి దర్యాప్తునకు అప్పగించేందుకు మీరు సిద్ధమా? లేక ఆయనను కాపాడేందుకు ప్రయత్నిస్తారా?” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ పొంగులేటి అవినీతి చిట్టాను సిబిఐ, ఇడి దర్యాప్తునకు అప్పగించేందుకు మీరు సిద్ధమా? లేక ఆయనను కాపాడేందుకు ప్రయత్నిస్తారా?‘‘ అని ప్రశ్నించారు. ఈ అవినీతి వ్యవహారంపై ఆధారాలతో ఇడి, సిబిఐ, లోకాయుక్తకు ఫిర్యాదు చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీకి కూడా బహిరంగ లేఖ రాస్తామని ప్రకటించారు. తాము చేస్తున్న ఆరోపణలు అబద్దమని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని, లేనిపక్షంలో పొంగులేటి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని, సమగ్ర విచారణ జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని ఏలేటి స్పష్టం చేశారు.

More Stories
జల వివాదాలపై చర్చలకు అమిత్ షాకు దక్షిణ రాష్ట్రాల మద్దతు
పాలనలో కుత్రిమ మేధను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలి
భారత్, జపాన్ ఇండో-పసిఫిక్ రక్షణ సహకారం ముమ్మరం