ఇరాన్‌తో వాణిజ్య, ఆర్థిక సంబంధాలను నిలిపివేసిన యూఏఈ

ఇరాన్‌తో వాణిజ్య, ఆర్థిక సంబంధాలను నిలిపివేసిన యూఏఈ
 
ఇరాన్‌తో ఉన్న అన్ని రకాల వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించింది. ‘పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల దృష్ట్యా… తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇరాన్‌తో అన్ని వర్తక, వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం’ అని యూఏఈ విదేశాంగ శాఖ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అఫ్రా అల్ హమేలీ తెలిపారు. 
 
ప్రజలకు ‘సాధ్యమైన క్షిపణి ముప్పు’ ఉందంటూ హెచ్చరిస్తూ సంక్షిప్త ఫోన్ అలర్ట్ వచ్చిన దాదాపు రెండు గంటల తర్వాత యూఏఈ నుంచి ఈ ప్రకటన వెలువడింది. అంతేకాదు, ఇరాన్ నుంచి వచ్చిన రెండు బాలిస్టిక్ క్షిపణుల్లో ఒకటి తమ ప్రాదేశిక జలాల్లో పడిందని ఆరోపించింది.
 
‘‘ప్రస్తుత పరిస్థితులు, క్షిపణి దాడి ముప్పు దృష్ట్యా తక్షణమే సమీపంలోని సురక్షితమైన భవనంలో ఆశ్రయం పొందండి’ అని హోం శాఖ ఫోన్ అలర్ట్‌లో పేర్కొంది. అయితే కొద్దిసేపటికే ఈ హెచ్చరికను ఉపసంహరించుకుంది. జూన్‌‌లో వచ్చిన ఫేక్ అలర్ట్, జులైలో సరిహద్దు దాడి అలర్ట్ తర్వాత ఇలాంటి హెచ్చరిక రావడం ఇదే మొదటిసారి. అంతకుముందు మే ప్రారంభంలో చివరిసారిగా క్షిపణి హెచ్చరిక వచ్చింది.

గత కొన్ని వారాలుగా ప్రభుత్వ రంగ చమురు సంస్థ ‘అడ్నాక్’ కు చెందిన ట్యాంకర్లే లక్ష్యంగా వరుస దాడులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ దాడుల ప్రభావాన్ని యూఏఈ తీవ్రంగా ఎదుర్కొంది. దాదాపు 3,000 క్షిపణులు, డ్రోన్లు యూఏఈని లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డాయి.
రెండు దేశాల మధ్య జూన్‌లో కుదిరిన అవగాహన ఒప్పందం గడువు సోమవారంతో ముగిసింది.
ఈ ఒప్పందం విఫలమైనప్పటికీ ఇతర గల్ఫ్ దేశాలతో పోలిస్తే తమపై ఈ రెండు నెలల్లో ఎలాంటి దాడులు జరగలేదని యూఏఈ నివేదించింది. అయితే, ఒప్పందం ముగిసి మర్నాడే తమ భూభాగంపై ‘సాధ్యమైన క్షిపణి ముప్పు’ ఉన్నట్లు మళ్లీ అత్యవసర హెచ్చరికలను ఆ దేశం జారీ చేసింది.  తమ గగనతల రక్షణ వ్యవస్థలు యూఏఈని లక్ష్యంగా చేసుకుని వచ్చిన క్షిపణి ముప్పును గుర్తించినట్లు నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపింది.
యూఏఈ రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇరాన్ నుంచి తమ వైపు దూసుకొచ్చిన రెండు బాలిస్టిక్ క్షిపణులను వైమానిక రక్షణ వ్యవస్థలు గుర్తించాయి. అందులో మొదటిది యూఏఈ సరిహద్దు జలాలకు వెలుపల పడిపోయిందని, రెండోది దేశీయ సరిహద్దు జలాల్లో కూలిపోయిందని పేర్కొంది.  ఏలాంటి భద్రతా ముప్పునైనా ఎదుర్కొనేందుకు యూఏఈ సంపూర్ణ సద్ధతతో ఉందని రక్షణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు, కవ్వింపులకు ఆపేయాలని, శత్రుత్వాన్ని వీడి హర్మూజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవాలని ఇరాన్‌ను యూఏఈ కోరింది.