రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా మారిన రేవంత్ రెడ్డి

రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా మారిన రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములను కాపాడాల్సింది పోయి, రియల్ ఎస్టేట్ బ్రోకర్ తరహాలో వ్యవహరిస్తూ లక్షల కోట్ల రూపాయల భూదందాకు తెరతీసిందని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ వస్తే భూ సమస్యలన్నీ తీరి పారదర్శకమైన చట్టం వస్తుందని ప్రజలు ఆశిస్తే, గత కేసీఆర్ ప్రభుత్వం ధరణి పేరుతో పేద రైతుల హక్కులను కాలరాసిందని ఈటల విమర్శించారు. 

ధరణి రాకముందు పహాణీలలో ఉన్న 13 కాలమ్స్ (ముఖ్యంగా కబ్జా, కాస్తు కాలమ్స్) తొలగించడం వల్ల 50-70 ఏళ్లుగా భూములను సాగుచేసుకుంటున్న దళితులు, గిరిజనులు, బీసీ పేద రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి, ఇప్పుడు ‘భూభారతి’ పేరుతో మరింత దారుణంగా పేద రైతాంగాన్ని అగాధంలోకి నెట్టిందని పేర్కొంటూ ‘ధరణి పోయినా ధోరణి మారలేదు, భూభారతి కాస్త పేదలకు భూహారతిగా మారింది’ అని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి పది అడుగులు ముందుకేసి భూముల వేలం ద్వారా దాదాపు రూ.10 లక్షల కోట్లు సమకూర్చుకోవాలనే దుర్మార్గపు ఆలోచనతో ఉన్నారని ఈటల మండిపడ్డారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని నగర విస్తరణ ప్రాంతాల్లో వేల ఎకరాల పేదల భూములను హైడ్రా, వందల మంది పోలీసుల పహారాతో రాత్రికి రాత్రే ఫెన్సింగ్‌లు, గోడలు కట్టి డీల్స్‌కు అప్పగిస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు గ్రామాలపై పడి కీచకుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రైవేట్ భూముల్లో 12 ఏళ్లు కౌలు ఉంటే ‘సెక్షన్ 38ఈ’ కింద హక్కులు వస్తుంటే బడంగ్‌పేట్‌లో ఐదు తరాలుగా (78 సంవత్సరాలుగా) 46 మంది రైతులు సాగుచేసుకుంటున్న 45 ఎకరాల 16 గుంటల భూమిని ప్రభుత్వ భూమి పేరుతో లాక్కుంటున్నారని ఆయన విమర్శించారు. దుండిగల్ సర్వే నం. 452, 453లలోని 400 ఎకరాల్లో 500 మంది రైతులు, బోరంపేట సర్వే నం. 166లోని 440 ఎకరాల్లో 150 మంది రైతులు 80 ఏళ్లుగా సాగు చేసుకుంటుంటే బలవంతంగా గుంజుకుంటున్నారని ధ్వజమెత్తారు. బోరంపేట సర్వే నం. 472లోని 30 ఎకరాలకు ప్రీకాస్ట్ గోడలు నిర్మించారని తెలిపారు. 

బొమ్మరాజుపేట (శామీర్‌పేట్)లో 1965 నాటి 1,049 ఎకరాల భూమి ధరణి లోపాల వల్ల వివాదంలోకి వెళ్లగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక 24 గంటల్లోనే పేర్లు మార్చి రియల్ ఎస్టేట్ మాఫియాకు అప్పగించారని చెప్పారు.  శంషీగూడా (ఎల్లమ్మబండ)లో సర్వే నం. 57లోని 333 ఎకరాల్లో పేదలు, జర్నలిస్టులకు ఇచ్చిన 176 ఎకరాలు కాకుండా మిగిలిన 90 ఎకరాల భూమిని (విలువ సుమారు రూ.3,000 కోట్ల నుండి రూ.4,000 కోట్లు) కోర్టు కేసులను అడ్డం పెట్టుకుని ప్రైవేట్ వ్యక్తులతో సెటిల్‌మెంట్ చేసుకుని దోచుకుంటున్నారని వివరించారు. 

కూకట్‌పల్లి (గల్ఫ్ ఆయిల్ / ఐడిఎల్ భూములు)లో గతంలో ఇండియన్ డిటనేటర్స్ లిమిటెడ్ (ఐడిఎల్) పేరిట ఉన్న 330 ఎకరాల పైచిలుకు భూమిని (విలువ రూ.20,000 కోట్లు) ఫినిక్స్ కంపెనీ మధ్యవర్తిత్వంతో చేతులు మార్చారని ఆరోపించారు. ఇక్కడి నుంచే 2021 హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అక్రమ డబ్బు ఖర్చు పెట్టిందని, ప్రస్తుతం ఇక్కడ ఒక్కో విల్లాను రూ.25 కోట్ల నుండి రూ.30 కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

బహదూర్ గూడ (ఫ్యూచర్ సిటీ)లో 70-80 ఏళ్లుగా గులాబీ తోటలు సాగుచేసుకుంటున్న రైతుల నుంచి 650 ఎకరాలను హైడ్రా బలగాలతో లాక్కోవాలని చూస్తే, ప్రజలు కారప్పొడి చల్లి తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు. ఎంకేపల్లి (200 ఎకరాలు), అజీజ్‌నగర్ (70 ఎకరాలు), హిమాయత్‌నగర్ (పేదల 60 గజాల ప్లాట్లు), కోయడ (246 ఎకరాలు), సీతారాంపూర్ వెంకటేశ్వర స్వామి భూములు (1,200 ఎకరాలు), అంబేద్కర్ నిధి కింద ఇచ్చిన 20 ఎకరాల కోళ్లఫారాల భూములను సైతం ప్రభుత్వం లాక్కుంటోందని రాజేందర్ వివరించారు.

గతంలో బీజేపీ నేతలు టైగర్ నరేంద్ర గారు, బద్దం బాల్‌రెడ్డి గారు, బండారు దత్తాత్రేయలు పేదల కోసం పోరాడి అడ్డగుట్ట, వారాసిగూడ, వాజ్‌పేయి నగర్, దత్తాత్రేయ నగర్, దీన్‌దయాళ్ నగర్ లాంటి బస్తీలను ఏర్పాటు చేయించారని పేర్కొంటూ  నేడు కూడా పేదల భూముల పరిరక్షణకు బీజేపీ కట్టుబడి ఉందని ఈటల స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా రియల్ ఎస్టేట్ బ్రోకరింగ్ దందాను ఆపి, పేదల భూములను గుంజుకోవడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ భూ దోపిడీపై ప్రజా ఉద్యమాలు నిర్మించడంతో పాటు, కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలకు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకునేలా పోరాడతామని స్పష్టం చేశారు.