భారత్ ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్వదేశీ’, ‘లోకల్ ఫర్ లోకల్’ కార్యక్రమాలకు ప్రజలు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. దేశ అవసరాలను దేశీయంగానే తీర్చుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం ఎర్రకోట ప్రాంగణం నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర శాసనసభలు, లోక్సభలో మహిళలకు 33% ప్రాతినిధ్యం కల్పించాలని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు.
పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో మహిళా ప్రజాప్రతినిధుల పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవంలో భాగంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన కొద్దిసేపటికే, పసుపు, ఆకుపచ్చ, తెలుపు రంగుల బంధాని నమూనాతో ఉన్న ఎర్ర తలపాగా ధరించిన ప్రధానమంత్రి మోదీ, పార్లమెంటు ఆమోదించిన నారీ శక్తి వందన అధినియమ్ను ప్రస్తావిస్తూ, గత 40 ఏళ్లుగా మహిళల ప్రాతినిధ్యం చుట్టూ ఉన్న రాజకీయ సవాళ్ల గురించి మాట్లాడారు.
మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ల ద్వారా మహిళా ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో దేశానికి మార్గదర్శకత్వం వహిస్తున్నారని మోదీ అన్నారు. “ప్రియమైన తోటి పౌరులారా, ఈనాడు పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో మన మహిళా ప్రజాప్రతినిధులు అత్యధిక సంఖ్యలో దేశానికి మార్గనిర్దేశం చేస్తూ, స్థానిక సవాళ్లను పరిష్కరిస్తూ, అసాధారణమైన సమర్థవంతమైన, సాధికారత కల్పించే నాయకత్వాన్ని అందిస్తున్నారు,” అని మోదీ అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో కోటి మంది యువతకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు ప్రధాని వెల్లడించారు. అలాగే వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. కోచింగ్ కోసం కుటుంబాలు ఖర్చు చేస్తున్న వేల కోట్ల రూపాయలను ఆదా చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు.
దేశంలో అందుబాటులో ఉన్న డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, నిపుణుల సేవలను ఒకే వేదికపైకి తీసుకొస్తామని తెలిపారు. వీటి సమన్వయంతో యువతకు వివిధ పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందించే సంపూర్ణ ఆన్లైన్ నెట్వర్క్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీని ద్వారా ఖరీదైన కోచింగ్ సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని భావిస్తున్నారు.
“గత ఏడాది ఈ దిశగా ‘సముద్ర మంథన్’ కార్యక్రమాన్ని ప్రకటించాము. ఈ పని కోసం రూ. 85,000 కోట్లు కేటాయించాము… ఇప్పుడు ఆ ప్రాంతాలు కార్యకలాపాలకు అనుకూలమైన ప్రాంతాలుగా మారాయి” అని చెప్పారు. 12 ఏళ్ల క్రితం కేవలం 70 నగరాలకే పైప్డ్ గ్యాస్ సౌకర్యం ఉండగా, ఇప్పుడు 700 నగరాలకు విస్తరించిందని మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా 1.75 కోట్ల కుటుంబాలు పైప్డ్ గ్యాస్ కనెక్షన్లతో అనుసంధానమయ్యాయని చెప్పారు.
సెమీకండక్టర్ రంగంలో స్వావలంబన సాధించేందుకు భారత్ కీలక అడుగులు వేస్తోందని చెప్పారు. ఇప్పటికే మూడు సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు. దేశ ఇంధన భద్రతకు అణుశక్తి కీలకమని ప్రధాని పేర్కొంటూ 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ దశాబ్దంలో ఐదు కొత్త అణు రియాక్టర్లను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తొలుత రాజ్ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ పుష్పాంజలి ఘటించారు. అలాగే, ఆయన దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించారు. 2026 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ‘వందేమాతరం’ గీతానికి సంబంధించిన 150వ వార్షికోత్సవానికి కూడా గుర్తుగా నిలుస్తాయి. దేశవ్యాప్తంగా ‘వందే మాతరం’ నినాదం మార్మోగుతోందని, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందని మోదీ తెలిపారు.

More Stories
రాహుల్కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
స్మార్ట్ కార్డులపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ల ఫోటోలపై దుమారం
చైనాను కాకుండా పాక్ నే అతిపెద్ద ముప్పుగా చూస్తున్న భారతీయులు