రాజ్యసభలో ‘లుంగీవాలా వ్యాఖ్యలు’ తీవ్ర కలకలం రేపాయి. సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ తనను బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ ‘లుంగీవాలా’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ రాజ్యసభలో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టిన జాన్ బ్రిట్టా దక్షిణాది వ్యక్తిగా తన ఆహార్యం తనకు ఎంతో గర్వకారణమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు వేదికగా ఓ ప్రాంతాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమమని తెలిపారు.
తాను ఓ రోజు సభలో మాట్లాడుతుంటే లుంగీవాలా అంటూ తనను ఉద్దేశించి అమర్యాదకర వ్యాఖ్యలు చేశారని ఆయన చెప్పారు. ‘‘నేను ధోతీలో ఉన్నా. మలయాళీని, దక్షిణాది వ్యక్తిని అయినందుకు గర్వపడుతున్నాను. కానీ, తమ సంస్కృతి పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ విషయంపై సభ దృష్టి సారించాలి. ఆమెకు వ్యతిరేకంగా ప్రివిలెజ్ మోషన్‌ను ప్రవేశపెట్టాను. ఆమెపై నాకు ఎటువంటి ద్వేషం లేదు” అని ఎంపీ బ్రిట్టాస్ తెలిపారు.
తనను తన బాధ్యతలు నిర్వర్తించనీయకుండా బీజేపీ ఎంపీ పదే పదే అడ్డుపడ్డారని ఆయన ఆరోపించారు. పలుసార్లు ‘లుంగీవాలా’ అని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి, బీజేపీ సభాపక్ష నేత జేపీ నడ్డా స్పందిస్తూ లుంగీ వాఖ్యలను తాము సమర్థించమని స్పష్టం చేశారు. బ్రిట్టాస్ అభ్యంతరాలు, తమ పార్టీ ఎంపీ వ్యాఖ్యలు అన్నీ రికార్డుల్లోకి చేరాయని ఆయన పేర్కొన్నారు.
సుస్మితా దేవ్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, అది తమ దృష్టిలో ధోతీ అని తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ సభ హుందాతనాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘సభకు సభ్యులందరూ సమానమే. ఒక సభ్యుడిపై ఆరోపణలు వచ్చాయి. కాబట్టి వారికీ తమ వివరణ ఇచ్చేందుకూ అవకాశం ఇస్తున్నాం. సభా గౌరవానికి భంగం కలిగించేది ఏదైనా జరిగితే ఛైర్మన్ వారిని తన ఛాంబర్‌కు పిలిపించి వాదనలు వినొచ్చు ’ అని చెప్పారు.
సభలో చోటుచేసుకున్న పరిణామాలపై రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ విచారం వ్యక్తం చేస్తూ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని, ప్రాంతీయ భావోద్వేగాలను గౌరవించాలని కోరారు. ‘‘గౌరవ సభ్యులు సభలో ఒక సభ్యుడు ప్రసంగిస్తున్నప్పుడు ఇతర సభ్యులు జోక్యం చేసుకుంటూ మర్యాదలేకుండా, అనుచిత వ్యాఖ్యలు చేసిన కొన్ని సంఘటనలు నా దృష్టికి వచ్చాయి. గౌరవ సభ్యులు తోటి సభ్యుల మనోభావాలను, సెంటిమెంట్లను దెబ్బతీసేలా ప్రవర్తించకుండా జాగ్రత్త వహించాలి’’ అని వ్యాఖ్యానించారు.
దీనికి ప్రతిస్పందనగా, సుష్మితా దేవ్ కేరళ సంప్రదాయ వస్త్రధారణను తాను అవమానించలేదని, ఇది కేవలం మంచి పేరు కోసం చేస్తున్న దురదృష్టకరమైన రాజకీయం అని పేర్కొన్నారు. బ్రిట్టాస్ పార్టీ విధేయతను, మతాన్ని అవమానిస్తున్నట్లు వీడియో ఆధారాలు ఉన్నాయని ఆమె వాదించారు. ఆమె స్వయంగా కేరళ ఎంపీపై హక్కుల ఉల్లంఘన కింద ఒక ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అది కూడా రాజ్యసభ ఛైర్మన్ వద్ద పెండింగ్‌లో ఉంది.
తాను కేరళను ప్రేమిస్తున్నానని, సంస్కృతి ఆధారంగా సభ విభజన సందేశం పంపడం తనకు ఇష్టం లేదని ఆమె స్పష్టం చేశారు. తాను ఏ రాష్ట్ర వస్త్రధారణపైనా నిందలు వేయలేదని, తనకు బ్రిట్టాస్ చాలా కాలంగా తెలుసని ఆమె తెలిపారు. “నేను అస్సాంకు చెందిన బెంగాలీని. వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల దుస్తులు ధరించడం నేను చూశాను. నేను గానీ, మరే ఇతర సభ్యుడు గానీ ఏ రాష్ట్ర వస్త్రధారణపైనా నిందలు వేయలేదు. ఈ విషయాన్ని రికార్డులో పెట్టాలనుకున్నాను,” అని ఆ ఎంపీ సభలో తేల్చి చెప్పారు.
సంస్కృతి లేదా మతం ఆధారంగా భారతదేశాన్ని విభజించాలని ఒక సభ్యుడు కోరుకుంటున్నట్లు రాజ్యసభ సందేశం పంపకూడదని ఆమె స్పష్టం చేశారు. తర్వాత ఎన్‌డిటివితో మాట్లాడుతూ, బ్రిట్టాస్ అబద్ధం చెబుతున్నారని ఆమె ఆరోపించారు. “ఆయన ఈరోజు సభలో అబద్ధం చెప్పారు. నేను ‘లుంగీవాలా’ అనే పదాన్ని ఉపయోగించలేదు. విచారణ జరిపిన తర్వాతే అసలు నిజం బయటపడుతుంది,” అని ఆమె తెలిపారు.

More Stories
ప్రజా సేవ పట్ల నిరంతర నిబద్ధతను ప్రదర్శించిన కోవిద్
ప్రతిపక్షం చర్చ నుండి పారిపోతుంది
జస్టిస్ యశ్వంత్ వర్మను దోషిగా నిర్దారించిన లోక్‌సభ ప్యానెల్