జస్టిస్ యశ్వంత్ వర్మను దోషిగా నిర్దారించిన లోక్‌సభ ప్యానెల్

జస్టిస్ యశ్వంత్ వర్మను దోషిగా నిర్దారించిన లోక్‌సభ ప్యానెల్
తన నివాసంలో భారీ ఎత్తున లభ్యమైన నగదుకు సరైన ఆధారాలను చూపించడంలో ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ 
విఫలమయ్యారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన విచారణ కమిటీ తేల్చింది. తమ నివేదికను పార్లమెంట్‌కు సమర్పించిన కమిటీ నగదు రికవరీ కేసులో మాజీ జడ్జి దోషిగా తేలినట్లు పేర్కొంది. గతేడాది మార్చి 14న ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోగా, ఆ సమయంలో భారీగా కరెన్సీ కట్టలు బయటపడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే

‘‘న్యూఢిల్లీలోని 30, తుగ్లక్ క్రెసెంట్ వద్ద ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ  అధికారిక నివాసంలోని స్టోర్ రూంలో పెద్ద మొత్తంలో లెక్కల్లో చూపని రూ 500 కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయి. ఆ నగదు అక్కడ ఎందుకు ఉంది? అది ఎక్కడది? యజమాని ఎవరు? అనే విషయాలపై న్యాయమూర్తి సంతృప్తికరమైన వివరణ ఇవ్వడంలో విఫలమయ్యారు’’ అన కమిటీ తన నివేదికలో పేర్కొంది. నగదు రికవరీపై జరిగిన తదుపరి విచారణను కూడా ఈ కమిటీ ప్రశ్నించింది.
‘‘ముఖ్యమైన సాక్ష్యాలను సరిగ్గా భద్రపరచలేదు. చట్టబద్ధంగా సీల్ చేయడానికి, తనిఖీ చేయడానికి ముందే స్టోర్‌రూమ్‌లో సాక్ష్యాలను చెరిపివేశారు’’ అని నివేదిక పేర్కొంది. ‘తర్వాత అక్కడున్న కరెన్సీ నోట్లు మాయం కాకపోవడం వెనుక గల కారణాలు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నాయి’అని పార్లమెంటరీ కమిటీ వ్యాఖ్యానించింది.  ‘సాక్ష్యాలను భద్రపరచడంలో వైఫల్యానికి న్యాయమూర్తి ఇంటిలో పనిచేసే సిబ్బందిని ఆ స్టోర్‌రూమ్‌లోకి అనుమతించడమే కారణం’ అని కమిటీ తప్పుబట్టింది.

అయితే, న్యాయమూర్తి స్వయంగా ఆ నగదును అక్కడి నుంచి తరలించారనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని కమిటీ వెల్లడించింది. జస్టిస్ యశ్వంత్ వర్మపై విచారణ కమిటీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నివాసంలో నగదు లభ్యం కావడానికి సంబంధించి 2025 మార్చి 22న ఇచ్చిన వివరణ సహా ఆయన తెలిపిన ఏ సమాధానం కూడా సంతృప్తికరంగా లేదు అని కమిటీ స్పష్టం చేసింది.
అంతేకాదు, ‘వర్మ ఇచ్చి న సమాధానంలో నిజాయితీ, పారదర్శకత, వ్యవస్థాగత బాధ్యత పూర్తిగా కొరవడ్డాయి’ అని పేర్కొంది.కాగా, ఈ విచారణ నివేదిక రెండు భాగాలుగా రూపొందించింది. దర్యాప్తు సమయంలో నమోదు చేసిన మౌఖిక, డాక్యుమెంటరీ సంబంధించిన సాక్ష్యాలను పొందుపరిచారు. అంతకుముందు, అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ఏర్పాటైన ఇన్‌హౌస్ కమిటీ కూడా నగదు భద్రపరిచిన సదరు స్టోర్‌రూమ్‌పై జస్టిస్ వర్మకు ప్రత్యక్ష లేదా పరోక్ష నియంత్రణ ఉందని నిర్ధారించింది.

జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ఈ వివాదం వెలుగులోకి రావడంతో ఆయనను తిరిగి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. 
గత ఏడాది మార్చి 14-15 తేదీల మధ్య అతడి ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వెళ్లి మంటలను ఆర్పేశారు. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో కొన్ని ఫొటోలు బయటపడ్డాయి. సంచలన విషయాలు వెలుగు చూశాయి. 
 
అగ్నిప్రమాదం జరిగిన యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలున్నాయి. ఇంటి స్టోర్‌ రూమ్‌లో ఈ నోట్ల కట్టలు చాలా వరకు కాలిపోయాయి. కొన్ని ధ్వంసమయ్యాయి. అవన్నీ రూ.500 నోట్ల కట్టలే.  ఈ అంశం వివాదాస్పదం కావడంతో పోలీసులు, ఇతర అధికారులు ఆ ఇంటికి వెళ్లి ఆ ప్రదేశాన్ని సీజ్ చేశారు. అప్పటికే ఇంట్లోని సాక్షాలు తారుమారు అయ్యాయి. 
 
ఫోటోల్లో కనిపించిన కరెన్సీ నోట్లు ఆ సమయానికి అక్కడ లేవు. మొదట ఈ నోట్ల కట్టలకు, తనకు సంబంధం లేదని యశ్వంత్ వర్మ చెప్పాడు. అసలు, ఈ నోట్లు తన ఇంటికి సంబంధం లేదని చెప్పాడు. అయితే, ఒక రిటైర్డ్ జడ్జి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు కనిపించడం సంచలనంగా మారింది.  జడ్జిల అవినీతి అంశం తెరమీదకు వచ్చింది. దీంతో ఈ అంశంపై పెద్ద దుమారం రేగింది. చివరకు దీనిపై పార్లమెంట్ స్పందించింది. ఈ అంశంపై విచారణ జరిపేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఒక ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్ ఈ అంశంపై విచారణ జరిపింది.