* హైదరాబాద్ కు రూ 319 కోట్లు
పట్టణ ప్రాంతాల్లో వరదల ముప్పును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు దశల్లో 18 నగరాలకు మొత్తం రూ.5,520.07 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ఆమోదం తెలిపింది. జాతీయ విపత్తు నివారణ నిధి (ఎన్డీఎంఎఫ్) కింద ఈ నిధులను కేటాయించనున్నారు. పట్టణ వరదల ముప్పు నిర్వహణ కార్యక్రమం (యూఎఫ్ఆర్ఎంపీ) తొలి దశ కింద అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ముంబయి, పుణె నగరాలకు రూ.3,075.65 కోట్ల నిధులను కేంద్రం ఆమోదించింది.
రెండో దశలో భోపాల్, భువనేశ్వర్, గువాహటి, జైపూర్, కాన్పూర్, పాట్నా, రాయ్పూర్, తిరువనంతపురం, విశాఖపట్నం, ఇండోర్, లఖ్నవూ నగరాలకు రూ.2,444.42 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఈ ప్రాజెక్టులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. తొలి దశలోని ఏడు నగరాల్లో, రెండో దశలోని పదకొండు నగరాల్లో ఒకటైన గువాహటిలో ఆమోదం పొందిన ప్రాజెక్టులు ఇప్పటికే వివిధ దశల్లో అమలవుతున్నాయి.
ఈ కార్యక్రమం కింద చేపడుతున్న పనులతో నగరాల్లో వర్షపు నీటి పారుదల వ్యవస్థ మెరుగుపడటంతో పాటు డ్రైనేజీ వ్యవస్థ సామర్థ్యం, వరదలను తట్టుకునే శక్తి పెరుగుతుందని కేంద్రం తెలిపింది. అయితే ప్రాజెక్టుల అమలు తగిన స్థాయికి చేరుకున్న తర్వాతే నగరాల వారీగా వాటి ఫలితాలను పూర్తిస్థాయిలో అంచనా వేయగలమని పేర్కొంది.
యూఎఫ్ఆర్ఎంపీ ప్రాజెక్టుల అమలు పురోగతిని సమీక్షించడంతో పాటు పనులను సకాలంలో పూర్తి చేసేలా కేంద్ర హోంశాఖ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమం అమలు, పర్యవేక్షణ కోసం ఎన్డీఎంఏ ప్రత్యేక పర్యవేక్షణ, మూల్యాంకన విధానాన్ని రూపొందించి, నగరాలకు పంపింది.
ఆయా నగరాలు దాన్ని అమలు చేసి, పురోగతిపై నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. ఇదిలావుండగా తొలిదశలో ఉన్న హైదరాబాద్కు రూ.319.53 కోట్లు కేటాయించగా, కేంద్ర సాయం కింద రూ.250 కోట్లను ఎన్డిఎంఎఫ్ సమకూరుస్తుంది. అయితే ఎన్డిఎంఎఫ్ తొలుత హైదరాబాద్ కోసం రూ.75 కోట్లు విడుదల చేసింది.

More Stories
టీఎంసీ బ్యాంక్ అకౌంట్లపై నిషేధం తొలగింపుదకు సుప్రీం నిరాకరణ
పాలిమర్ కరెన్సీ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
విద్యుత్ కారుగా తిరిగి రానున్న టాటా నానో