రాజీవ్ రహదారి విస్తరణ ప్రాజెక్టులో భూములు, ఇళ్లు, భవనాలు కోల్పోతున్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు. ఖార్ఖానాలో బాధితులు నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొని వారికి బీజేపీ తరఫున సంఘీభావం తెలిపారు. రోడ్డు విస్తరణ కోసం భూములు, ఇళ్లు, భవనాలు కోల్పోతున్న ప్రజలు అభివృద్ధికి వ్యతిరేకం కాదని రాంచందర్ రావు స్పష్టం చేశారు.
ప్రజా ప్రయోజనం కోసం చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు అందరూ సహకరిస్తున్నారని, అయితే తమ ఆస్తులను త్యాగం చేస్తున్న ప్రజలకు సరైన విలువతో కూడిన న్యాయమైన పరిహారం అందాల్సిన అవసరం ఉందని తెలిపారు. తూంకుంట ప్రాంతంలో భూముల పరిహారాన్ని పెంచిన విధంగా, రాజీవ్ రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న ఖార్ఖానా ప్రాంత ప్రజలకు కూడా తగిన మేర పరిహారం పెంచాలని ఆయన కోరారు.
తూనికుంటలో పెంచిన పరిహారం కంటే ఈ ప్రాంతం మరింత ఖరీదైన అర్బన్ ప్రాంతమని, అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ తక్కువ పరిహారం ఇవ్వడం సమంజసం కాదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తూంకుంటలో ఏ మేరకు పరిహారం పెంచిందో, అదే విధంగా ఇక్కడ కూడా సముచితమైన శాతం మేర పరిహారం పెంచి బాధితులకు న్యాయం చేయాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.
ప్రజా ప్రయోజనం కోసం తమ భూములు, ఇళ్లు, ఆస్తులను త్యాగం చేస్తున్న బాధితుల త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించాలని, వారికి న్యాయమైన పరిహారం అందించడం ద్వారా వారి పట్ల న్యాయం చేయాలని ఆయన కోరారు. బాధితులు చేస్తున్న న్యాయమైన డిమాండ్‌కు భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని రాంచందర్ రావు స్పష్టం చేశారు.

More Stories
తెలంగాణ ఎస్ఐఆర్ లో 73 లక్షల ఓట్ల గల్లంతు?
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రతిపాదన లేదు
`ఏఐ’ వాతావరణ అంచనాలతో లబ్ది పొందిన తెలంగాణ రైతులు