తెలంగాణ ఎస్ఐఆర్ లో 73 లక్షల ఓట్ల గల్లంతు?

తెలంగాణ ఎస్ఐఆర్ లో 73 లక్షల ఓట్ల గల్లంతు?
తెలంగాణలో దాదాపు 73 లక్షల ఓట్లు గల్లంతు కానున్నాయా!? వీరిలో చనిపోయినవారు, రెండుచోట్ల ఓట్లు ఉన్నవారితోపాటు ఓటు హక్కు కోసం ఎన్యుమరేషన్‌ ఫారాలు సమర్పించని వారూ ఉన్నారా!?ఎన్యుమరేషన్‌ ఫారాలు సమర్పించకపోతే వారి ఓట్లు జాబితా నుంచి పోనున్నాయా!?తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పణ గడువు సోమవారంతో ముగియడంతో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 78.26 శాతం ఎన్యూమరేషన్ పత్రాలను మాత్రమే సిబ్బంది డిజిటలైజేషన్ చేశారు. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, సోమవారం సాయంత్రం వరకు 2,64,73,616 (78.26 శాతం) మంది ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది.  అంటే ఇప్పటివరకు 73,52,832 ఫారాలు సమర్పించాల్సి ఉన్నది. 

రాత్రి 12 గంటలకు వరకు మరికొన్ని ఫారాలను సిబ్బంది డిజిటలైజేషన్ చేయనున్నది. మిగిలిన ఓట్లను అన్‌కలెక్టబుల్ ఓటర్లుగా గుర్తించి వందశాతం డిజిటైజేషన్ పూర్తి చేస్తారు. వీరిలో మరణించినవారు, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు, డబుల్ ఎంట్రీ ఉన్నవారు, ఆబ్సెంట్ అయినవారు, ఇతరత్రా కారణాలతో అందుబాటులో లేనివారిగా వీరిని పరిగణిస్తారు. 

ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 94.31 శాతం డిజిటలైజేషన్ పూర్తయ్యింది. ఆ తర్వాతి స్థానాల్లో జనగాం 91.68 శాతం, మెదక్ 90.53 శాతం, సూర్యాపేట 90.45 శాతంతో ఉన్నాయి. ఇక, హైదరాబాద్ 27,89,214 ఎన్యూమరేషన్ ఫారాలతో 58.89 శాతం డిజిటలైజేషన్ పూర్తయి చివరి స్థానంలో నిలిచింది. 
 
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 63.97 శాతం, రంగారెడ్డి జిల్లాలో 65.16 శాతం డిజిటలైజేషన్ పూర్తయ్యింది. ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించినప్పటికీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో డిజిటలైజేషన్ శాతం పెరగలేదు. కాగా, గడువు పెంపుతో బిఎల్‌ఒలు ఇంటింటికీ వెళ్లి అన్‌ట్రేసబుల్, ఆబ్సెంట్ విభాగంలో చూపినవారి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు.
 
కొందరి వివరాలు లభ్యం కావడంతో వివరాలు నమోదుచేసి ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు. శాశ్వతంగా వలస వెళ్లిన విభాగంలో చూపించినవారి వివరాలు మరోసారి పరిశీలించి గుర్తిస్తే రోల్‌బ్యాక్ చేసి ఫారాలు నమోదు చేశారు. ఇప్పటివరకు ఫారాలు ఇవ్వనివారిలో కొందరు ఆన్‌లైన్‌లో సమర్పించారు. 
 
సర్‌లో చేపడుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియ గడువు తేదీ నాటికి 80 శాతం మార్క్ దాటనట్లే కనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 78.26 శాతం ఎన్యూమరేషన్ పత్రాలను మాత్రమే సిబ్బంది డిజిటలైజేషన్ పూర్తి చేయగా, అర్థరాత్రి వరకు ఆ శాతం స్వల్పంగా పెరగనుంది. సర్ గడువు ముగిసే చివరి మూడు రోజులు రెండో శనివారం, ఆదివారం, సోమవారం (బోనాల పండగ) సెలవులు ఉన్నాయి. ఈ కారణంతో కూడా కొంతమంది ఫారాలు సమర్పించడంలో నిర్లక్షంగా వ్యవహంచినట్లు తెలుస్తోంది