పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చే ప్రతిపాదన లేదని కేంద్రం రాజ్యసభలో స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుపై సీడబ్ల్యూసీకి వచ్చిన ప్రతిపాదనను వెనక్కి పంపినట్లు తెలిపింది. కృష్ణా జలాల వినియోగంపై పాలమూరు ప్రాజెక్టు ఆధారపడి ఉందని పేర్కొంది. కాంగ్రెస్ ఎంపి రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషన్ చౌదరి లిఖిత పూర్వక సమాధానంలో కృష్ణా జలాల వినియోగం, అంతర్రాష్ట్ర అంశాలు కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II విధివిధానాల్లో ఉండటంతో ఈ వ్యవహారం కోర్టు పరిధి విచారణలో ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రాజెక్టుపై సాంకేతిక-ఆర్థిక మదింపు సాధ్యం కాదని కేంద్ర పేర్కొంది. ఈ ప్రాజెక్టును జాతీయహోదా ఇవ్వాలంటే సాంకేతిక-ఆర్థిక మదింపు తప్పనిసరి అని, కోర్టు పరిధిలో ఉన్నందున ఈ ప్రాజెక్టు డీపీఆర్ను వెనక్కి పంపినట్లు కేంద్రం ప్రకటించింది. ‘
‘ఏదైనా నీటి పారుదల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించేందకు సాంకేతిక పరిశీలన జరగాలి. ఆ తర్వాత గంగా పునరుజ్జీవ సలహా సంఘం ద్వారా సాంకేతిక, ఆర్థిక మదింపు జరపాల్సి ఉంటుంది. దీని కోసం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలనూ పరిశీలించాల్సి ఉంటుంది. పాలమూరు-రంగారెడ్డిలో కృష్ణా నదీ జలాల వినియోగం ఇమిడి ఉన్నందున అంతర్రాష్ట్ర జల వివాద అంశాల ముడిపడి ఉన్నాయి” అని కేంద్ర మంత్రి వివరించారు.
కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ విధి విధానాలలో చేర్చినందున ఈ విషయం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందని పేర్కొంటూ న్యాయస్థాన పరిధితో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టును ప్రస్తుత దశలో సాంకేతిక-ఆర్థిక మదింపునకు తీసుకోవడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కాగా, ప్రాజెక్టుకు సంబంధించి చెల్లించే బిల్లులపై తెలంగాణ ప్రభుత్వం మరింత పారదర్శకంగా ముందుకెళ్తోంది.
కాంట్రాక్టు ఒప్పంద నిబంధనలు, టెండర్ ప్రక్రియ, పనుల్లో జాప్యం, పెరుగుతున్న వ్యయం ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మూడు దశాబ్దాల క్రితం జారీ చేసిన జీవో-94లో మార్పులు చేసేందుకు ఇటీవలే ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. తాజాగా సవరించిన అంచనాకు ఆమోదం తెలిపినా, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది.
పాలమూరు నుంచి రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని 7,11,15,17వ ప్యాకేజీల సవరించిన అంచనాలకు జులై 17న జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. దీనివల్ల ఖజానాపై అదనంగా రూ.2,353.38 కోట్ల భారం పడింది. 2016లో ఈ నాలుగు ప్యాకేజీల పనులకు ఒప్పందం జరగ్గా, భూ సేకరణలో ఆలస్యం, ఎన్టీటీలో కేసులు తదితర కారణాల వల్ల తీవ్ర జాప్యం జరిగింది. 10 ఏళ్లైనా ఇంకా పనులు పూర్తి కాలేదు.

More Stories
తెలంగాణ ఎస్ఐఆర్ లో 73 లక్షల ఓట్ల గల్లంతు?
`ఏఐ’ వాతావరణ అంచనాలతో లబ్ది పొందిన తెలంగాణ రైతులు
స్నాతకోత్సవంకు సిజెఐను ఆహ్వానించడంపై నల్సార్ లో నిరసన