ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సంచలనాలు, వేగవంతమైన సమాచారం ప్రాధాన్యం పెరిగినప్పటికీ ఆధ్యాత్మికత, మానవత, నైతిక విలువలను కాపాడుతూ ‘శ్రీవాణి’ 500 సంచికల ప్రస్థానాన్ని కొనసాగించడంను అభినందించారు. ‘శ్రీవాణి’ కేవలం చదివే పత్రిక కాదని, జీవితాన్ని మార్చే ఆలోచనలను అందించే పత్రిక అని పేర్కొన్నారు.
“భాష బతికితే సంస్కృతి బతుకుతుంది.. సంస్కృతి బతికితే జాతి బతుకుతుంది” అని పేర్కొంటూ తెలుగు భాష, సాహిత్యాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. ముఖ్యంగా యువత సామాజిక మాధ్యమాల వినియోగాన్ని తగ్గించి మంచి పుస్తకాలు చదివే అలవాటును పెంపొందించుకోవాలని కేశినేని చిన్ని సూచించారు. పుస్తక పఠనం ద్వారా ఆలోచనా విధానం మెరుగుపడటంతో పాటు వ్యక్తిత్వ వికాసం, సమాజం పట్ల బాధ్యత మరింత బలపడతాయని తెలిపారు.
పుస్తకాలు మనిషి ఆలోచనలను విస్తృతం చేసి, జీవితాన్ని సరైన దిశలో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. శ్రీ సత్యసాయి బాబా సందేశమైన డ్యూటీ ఈజ్ గాడ్.. వర్క్ ఈజ్ వర్షిప్ ను ప్రస్తావించిన ఎంపీ కేశినేని చిన్ని, కర్తవ్యాన్ని దైవంగా భావించి పనిచేయడమే నిజమైన సేవ అని పేర్కొన్నారు. ఆధ్యాత్మికత, మానవతా విలువలు, మంచి ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ‘శ్రీవాణి’ తనదైన ముద్ర వేసిందని అభినందించారు.
‘శ్రీవాణి’ని 500వ సంచిక వరకు తీసుకురావడంలో కొమరిగిరి కృష్ణమోహనరావు అంకితభావం, నిరంతర కృషి ఎంతో గొప్పదని ఎంపీ చిన్ని కొనియాడారు. ఒక పత్రికను ఇంత సుదీర్ఘకాలం కొనసాగించడం వెనుక సంపాదకులు, రచయితలు, పాఠకులు, నిర్వాహకుల సమష్టి కృషి ఉందని అభినందనలు తెలిపారు. మంచి పత్రికలను ఆదరించడం అంటే భావితరాలకు మంచి విలువలను అందించడమేనని పేర్కొన్నారు. 500వ సంచికతో ‘శ్రీవాణి’ చారిత్రక మైలురాయిని చేరుకుందని, తెలుగు సాహిత్యానికి, విలువల ఆధారిత పత్రికా రంగానికి ఇది గర్వకారణమని కేశినేని చిన్ని పేర్కొన్నారు.

More Stories
వైఎస్ వివేకానందరెడ్డి అసలు హంతకులను గుర్తించాలి
అభివృద్ధికి ఓటు వేయరు.. మానవ సంబంధాలు ముఖ్యం!
గుజరాత్లో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్