నియామక పరీక్షల్లో అక్రమాలకు సంబంధించి జార్ఖండ్‌లో జెన్ జీ నిరసనలు ఉధృతమయ్యాయి. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్‌సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(జేఎస్‌ఎస్‌సీ) నిర్వహించిన నియామక పరీక్షల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ వందలాది మంది విద్యార్థులు రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో ధర్నా చేస్తుండగా, విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో ఆదివారం నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించడంతో ఈ ఆందోళన తీవ్రరూపం దాల్చింది.
“కొన్ని వారాలుగా నిరసనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించట్లేదు.. జూలై 5న పరీక్ష ఫలితాలు వచ్చినప్పటి నుంచే పరీక్షలో జరిగిన అవకతవకలు తెరమీదికొస్తున్నాయి. జూలై 25 నుంచి సత్యాగ్రహం నిర్వహిస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు. అందుకే నిరాహార దీక్షకు దిగాను’ అనిదేవేంద్ర తెలిపారు
14వ జేపీఎస్‌సీ కంబైన్డ్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సబంధించిన వివాదం దీనికి తక్షణ కారణంగా నిలిచినప్పటికీ రాష్ట్ర నియామక వ్యవస్థలో ఏండ్లుగా జరుగుతున్న జాప్యం, పారదర్శకత లోపం, అక్రమాలకు ఈ నిరసన అద్దం పడుతున్నదని విద్యార్థులు పేర్కొంటున్నారు. మీడియా కథనాల ప్రకారం కమిషన్ 103 ఖాళీల భర్తీకి ప్రకటన జారీ చేసింది. జూలై ఆరంభంలో ప్రాథమిక పరీక్ష పలితాలను ప్రకటించిన తర్వాత ప్రధాన పరీక్ష కోసం 2,204 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది.
అయితే ఫలితాలు వెలువడిన వెంటనే అభ్యర్థులు అక్రమాలు జరిగాయని ఆరోపించడం ప్రారంభించారు. క్యాటగిరీల వారీగా కటాఫ్ మార్కులను ప్రకటించకపోవడం విద్యార్థులు లేవనెత్తిన ప్రధాన ఆందోళనల్లో ఒకటి. అలాగే విడుదల చేసిన మెరిట్ జాబితాపై కమిషన్ సభ్యుల సంతకాలు లేవని నిరసనకారులు ఆరోపించారు. ఇది ఆ ప్రక్రియపై సందేహాలకు తావిచ్చింది.
అర్హత సాధించిన అభ్యర్థికి చెందినదిగా భావిస్తున్న ఒక ఓఎంఆర్ సమాధాన పత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. అర్హత సాధించడానికి అవసరమైన 144 మార్కులతో పోలిస్తే చాలా తక్కువగా కేవలం 48 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాసినప్పటికీ సదరు అభ్యర్థిని ప్రధాన పరీక్షకు ఎంపిక చేశారని నిరసనకారులు ఆరోపించారు.
అయితే, ఆ ఓఎంఆర్ షీట్ ప్రామాణికత నిర్ధారణ కానప్పటికీ ఈ ఘటనతో అక్రమాలపై దర్యాప్తు కోసం డిమాండ్లు పెరిగిపోయాయి. ఈ ఆరోపణలను పురస్కరించుకుని దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర సీఐడీని జార్ఖండ్ ప్రభుత్వం ఆదేశించింది. అయితే తమ ఆందోళన 14వ జేపీఎస్‌సీ పరీక్షకు మాత్రమే పరిమితం కాదని విద్యార్థి నాయకులు చెబుతున్నారు. విద్యార్థుల ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సైతం మద్దతు ప్రకటించింది.

More Stories
సహజీవనంలో భాగస్వామిని వేధింపులకు గురి చేస్తే క్రిమినల్ కేసులు
ప్రధానిని దూషించే వీడియో.. మైనర్ బాలికపై కేసు లేదు
కేరళలో భారీ వర్షాలు.. 8 మంది మృతి